సమీక్ష – ప్రేమ్ కుమార్

1.75/5

2 hr 30 min   |   Comedy   |   18-08-2023


Cast - Santosh Soban, Rashi Singh, Krishna Chaitanya, Ruchitha Sadineni, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Sri Vidya

Director - Abhishek Maharshi

Producer - Shiva Prasad Panneeru

Banner - Sharanga Entertainments

Music - Anant Srikar

చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటే జనం ఖచ్చితంగా చూస్తారని ఈ ఏడాది బలగం, బేబీలాంటివి వసూళ్ల సాక్షిగా నిరూపించాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకపోయినా వాళ్లకు నచ్చేవి ఉంటే చాలు ఆడతాయనే గ్యారెంటీ నిర్మాతలకు వచ్చేసింది. టాలెంట్ పరంగా ఎలాంటి ఫిర్యాదులు లేని సంతోష్ శోభన్ కు టైం కలిసి రాక చాలా కాలం నుంచి హిట్టు లేక మొహం వాచిపోయింది. ఇలాంటి పరిస్థితిలో వచ్చిన ప్రేమ్ కుమార్ మీద పెద్దగా అంచనాలు లేవు కానీ సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఆశించిన పబ్లిక్ ని ఈ లవ్ వీరుడు మెప్పించాడా

కథ

ప్రేమ్ కుమార్(సంతోష్ శోభన్)ది విచిత్రమైన జాతకం. ఎన్నో సంబంధాలు కుదిరినా సరిగ్గా పీటల మీద ఆగిపోవడం ఇతని స్పెషాలిటీ. ఏకంగా రికార్డులు కూడా సృష్టిస్తాడు. ఇలా లాభం లేదని పీకే డిటెక్టివ్ ఏజెన్సీని పెట్టుకుని సంబంధాలు చెడగొట్టుకోవాలని చూస్తున్న వాళ్లకు సహాయం చేసే బిజినెస్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో నడిపించే నిత్య(రాశి సింగ్)మనోడి జీవితంలో అడుగు పెడుతుంది. ఈమెతో పాటు రైజింగ్ స్టార్ రోషన్(చైతన్యకృష్ణ), అంగన(రుచిత)లు వస్తారు. తర్వాత జరిగేది తెరమీదే చూడాలి.

విశ్లేషణ

నవ్వించడం ఒక ఆర్టు. ఒకప్పుడు జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవివి లాంటి దర్శకులు ఈ జానర్ లో తిరుగులేని పట్టు సాధించి బ్లాక్ బస్టర్స్ సాధించారు. అభిషేక్ మహర్షి ఆ స్ఫూర్తిని తీసుకుందామనుకున్నాడు కానీ వాళ్లంత సెన్సిబుల్ గా ఆలోచించలేక ఎండిపోయిన కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసే ప్రయత్నం చేశాడు. నిజానికి లైన్ పరంగా చూసుకుంటే ఇది వర్కౌట్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న సబ్జెక్టే. కాకపోతే రాత బలంగా ఉండాలి. అంతే తప్ప డైరెక్టర్ కు ఫ్రెండ్స్ అయినవాళ్లు నవ్వుకున్నంత మాత్రాన అంతే స్థాయిలో థియేటర్ జనాలు రిసీవ్ చేసుకుంటారని కాదు. చాలా సిల్లీ జోకులుతో మెప్పించడం ఇప్పుడున్న పరిస్థితిలో అంత సులభం కాదు.

పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడంతో మొదలుపెట్టి హాస్యాన్ని ప్రతి ఫ్రేమ్ లో పిండుకోవాలని చూసిన అభిషేక్ మహర్షి క్యారెక్టరైజేషన్లను రాసుకోవడం దగ్గర విపరీతంగా తడబడ్డాడు. అసలు ప్రేమ్ కుమార్ కు అలాంటి విచిత్రమైన పరిస్థితి ఎందుకొచ్చిందనేది రిజిస్టర్ కాదు. అలాంటప్పుడు తన మీద సానుభూతి రాదు. ఎన్నో వంకలున్న వాళ్లకు నేరాలు చేసిన వాళ్ళకే పెళ్లిళ్లు జరుగుతుంటే అదేదో పెద్ద ట్విస్టు లాగా ప్రేమ్ కుమార్ అదే పెద్ద గండంలా చూపించిన విధానం నవ్వించలేదు సరికదా విసిగిస్తుంది. అసలు ప్రేమ్ కుమార్ కోరుకుంటున్నది ఏంటో కూడా ఒక స్టేజి దాటాక అర్థం కాదు. అవసరం లేని సాగతీతతో ఓపికకు విపరీతమైన పరీక్ష పెట్టారు.

వర్ధమాన హీరో తరహాలో పెట్టిన రోషన్ క్యారెక్టర్ మొత్తంగా తేడా కొట్టేసింది. నటన అసహజంగా ఉండి అతనున్న సన్నివేశాలన్నీ చప్పగా తేలిపోయాయి. ఇలాంటి వాటికీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు పడాలి. కనీసం కొంత వరకు కాపాడతారు. కానీ కృష్ణ చైతన్య దాన్ని మోయలేక చేతులెత్తేశాడు. తప్పు దర్శకుడిదే. విశ్రాంతికే నీరసం పీక్స్ కు వెళ్లిపోతుంది. పోనీ సెకండ్ హాఫ్ లో ఏమైనా బెటర్ గా ఉంటుందేమోనని ఆశిస్తే అమ్మా ఆశ దోశ అంటూ వెక్కిరిస్తాడు. క్లైమాక్స్ లో పెట్టిన కారు ఛేజ్ ఎపిసోడ్ ఇదసలు ఏ కాలం నాటి ఆలోచన, రచన అని అనిపించడం ఖాయం. పైగా పదే పదే కొన్ని లొకేషన్లలోనే చుట్టేయడంతో ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర పూర్తిగా దొరికిపోయారు.

కథ తేలిగ్గా ఉన్నప్పుడు కథనంలో బలం ఉండాలి. ప్రేమ్ కుమార్ లో లోపించింది అదే. ఇన్నిసార్లు పెళ్లి తప్పుతున్న యువకుడి మానసిక స్థితి మీద మంచి జోకులు రాసుకోవచ్చు. అంతే మోతాదులో ఎమోషన్లు కూడా పండించొచ్చు. కానీ ఆ అవకాశాన్ని వాడుకోలేదు. పక్కనున్న కృష్ణతేజ, సుదర్శన్ లు వీలైనంత వరకు ఏదో కామెడీ చేసే ప్రయత్నం చేశారు కానీ ఒకదశ దాటాక వాళ్ళూ చేతులెత్తేశారు. షార్ట్ ఫిలింకు మాత్రమే పనికొచ్చే పాయింట్ ని ఫుల్ లెన్త్ మూవీగా మలచాలనుకున్నప్పుడు దాన్ని ఆషామాషీగా తీసుకోకూడదు. బోలెడు హాస్యం ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్న ట్రెండ్ లో డబ్బులిచ్చి టికెట్ కొనే ఆడియన్స్ ని చులకనగా చూడకూడదు

ఇప్పటిదాకా సంతోష్ శోభన్ చేసిన వాటిలో బాక్సాఫీస్ ఫలితాల సంగతి ఎలా ఉన్నా డీసెంట్ అట్టెంప్ట్ చేశాడనే సింపతీ జనాల్లో ఉంది. కానీ ఇలాంటి ప్రేమ్ కుమార్ లు దాన్ని పోగొట్టేస్తాయి. ఏ ఇమేజ్ లేని ఇతని లాంటి యూత్ హీరోలను తెల్ల పేపర్ లా ట్రీట్ చేసి దాన్ని మీద ఏం రాస్తే పబ్లిక్ చప్పట్లు కొడతారో గుర్తించి దానికి అనుగుణంగా సినిమాలు తీయాలి. సన్నివేశాల కలబోత ఎప్పటికీ మంచి చిత్రం అనిపించుకోదు. మెరుగైన కథని తీసుకుని దాని మీద సీన్లను రాసుకుంటే డ్రామా పండుతుంది. అంతే తప్ప యూట్యూబ్ కన్నా అన్యాయంగా అనిపించే నెరేషన్ తో ఏదో జాతిరత్నాలు తీసేశాం అనే భ్రమకు లోనైతే మాత్రం ప్రేమ్ కుమార్ లు వస్తూనే ఉంటాయి

నటీనటులు

యాక్టింగ్ కోణంలో సంతోష్ శోభన్ లో ఏ లోపమూ లేదు. అతని ప్రతి సినిమా రివ్యూలోనూ ఇది కామన్ గా కనిపించే అంశం. ఇందులోనూ తన వంతుగా కంప్లయింట్ లేకుండా చేశాడు కానీ దాన్ని సరిగా ఉపయోగించుకునే మేకర్ దొరకకపోవడం బ్యాడ్ లక్. హీరోయిన్లు రాశి సింగ్, రుచిత సాధినేని పర్వాలేదు. ఏదో మెప్పించడానికి ట్రై చేశారు. సుదర్శన్, కృష్ణతేజలకు ఎక్కువ స్పేస్ దొరికింది. ఉన్నంతలో ఓకే. అప్ కమింగ్ హీరోగా నటించిన కృష్ణ చైతన్య పూర్తిగా రాంగ్ ఛాయస్. హావభావాలు, డైలాగ్ డెలివరీ రెండూ నప్పలేదు. కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రికమండేషన్ బ్యాచ్ కాబోలు. మిగిలిన ఆర్టిస్టులు ఇంకెవరూ అంతగా గుర్తొచ్చేలా చేయలేదు

సాంకేతిక వర్గం

అనంత్ శ్రీకర్ సంగీతం ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. సినిమా సంగతి పక్కనపెడదాం. కనీసం ఇలాంటి వాటిలో పాటలైనా బాగుంటే మరిన్ని అవకాశాలు వస్తాయని యంగ్ టాలెంట్స్ త్వరగా గుర్తించకపోతే కెరీర్ మనుగడ కష్టం. రాంపీ నందిగం ఛాయాగ్రహణం గురించి చెప్పడానికి ఏమీ లేదు. స్క్రీన్ ప్లేకు తగ్గట్టే కెమెరా వర్క్ అంతకంతా కిందకు వెళ్తూనే పోయింది. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ లో ఎక్కువ కోత వేస్తే ఫైనల్ కట్ గంట కూడా రాదనుకున్నారో ఏమో అవసరం లేని ఫుటేజ్ ని చాలా పెట్టారనే ఫీలింగ్ కలుగుతుంది. శివ ప్రసాద్ నిర్మాణ విలువలు అంతంత మాత్రమే. బాగా రాజీ పడిపోయారు. క్వాలిటీ లేకపోవడం తెరమీద స్పష్టంగా తెలిసిపోతుంది

ప్లస్ పాయింట్స్

ఒకటి రెండు జోకులు

మైనస్ పాయింట్స్

డల్ నెరేషన్
నవ్వించని కామెడీ
సాగతీత
సంగీతం

ఫినిషింగ్ టచ్ : పూర్ కుమార్

రేటింగ్ : 1.75 / 5