సమీక్ష – భాగ్ సాలే

1.75/5

2 Hr 1 Min   |   Crime Thriller   |   07-07-2023


Cast - Sri Simha, Neha Solanki, Rajeev Kanakala, John Vijay, Varshini, Nandini Rai, Viva Harsha

Director - Praneeth Bramandapally

Producer - Arjun Dasyan, Yash Rangineni, Singanamala

Banner - Vedaansh Creative Works

Music - Kaala Bhairava

ఇండస్ట్రీ తరఫున పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా చిన్న సినిమాలతోనే తన టాలెంట్ ని నిరూపించుకుందామని చూస్తున్న హీరో శ్రీసింహా కోడూరి నాలుగో సినిమా భాగ్ సాలే. మొదటి చిత్రం మత్తువదలరా మంచి సక్సెస్ అందుకున్నా ఆ తర్వాత ట్రాక్ తప్పాడు. అయినా సరే అవకాశాలు బాగానే వస్తున్న తరుణంలో దీని మీద గట్టి ఆశలే పెట్టుకున్నాడు. ప్రమోషన్లు బాగా చేయడం, సిద్దు జొన్నలగడ్డ లాంటి వాళ్ళు వాయిస్ ఓవర్ ద్వారా సపోర్ట్ చేయడం కలిసి వచ్చాయి. మరి కుర్రాడి ఆశలు నిలబడ్డయా లేక ఆవిరయ్యాయా

కథ

హోటల్ లో వంటవాడిగా పని చేసే అర్జున్(శ్రీసింహ)కు కోటీశ్వరుడిగా ఎదగాలని కలలుంటాయి. రెస్టారెంట్ పెట్టే లక్ష్యం  పెట్టుకుంటాడు. అయితే అబద్దాలు చెప్పి మాయ(నేహా సోలంకి)ని ప్రేమలో పడేస్తాడు. మరోవైపు శ్యామ్యూల్(జాన్ విజయ్) అనే డ్రగ్ డాన్ తను ప్రేమించిన నళిని(నందిని రాయ్)అడిగిందని కోట్ల విలువైన డైమండ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే అది మాయ తండ్రి దగ్గర ఉండటంతో కిడ్నాప్ డ్రామా మొదలవుతుంది. లవర్ కోసం పద్మవ్యూహంలో దిగిన అర్జున్ చివరికి ఎలా గెలిచాడనేదే బ్యాలన్స్

విశ్లేషణ

డార్క్ కామెడీలు తెలుగులో రెగ్యులర్ గా కాదు కానీ అప్పుడప్పుడూ వస్తూనే ఉన్నాయి. వీటిని డీల్ చేయడం పుస్తకంలో చదివినంత ఈజీ కాదు. చాలా హోమ్ వర్క్ చేయాలి. ఏ మాత్రం లెక్క తప్పినా ఆడియన్స్ తిప్పి కొడతారు. కన్ఫ్యూజన్ లేకుండా నేరాన్ని హాస్యాన్ని బ్యాలన్స్ చేయడం ఒక కళ. రామ్ గోపాల్ వర్మ తీసిన అనుకోకుండా ఒక రోజు మంచి ఉదాహరణ. ఇప్పటికీ అది క్లాసిక్ గా చెప్పుకోవచ్చు. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి దాన్నుంచి స్ఫూర్తి పొందాడో లేదో తెలియదు కానీ రైటింగ్ లో గతి తప్పడం వల్ల స్క్రీన్ మీద కూడా అవుట్ ఫుట్ తేడాగా వచ్చేసింది. బ్యాక్ డ్రాప్ ని బాగానే సెటప్ చేసుకున్నప్పటికీ  దానికి తగ్గ కసరత్తు మాత్రం సరిగా జరగలేదు.

హీరోయిన్ ని మభ్య పెట్టి ప్రేమలో పడేయడంతో మొదలుపెట్టి ఎక్కడా నవ్యత ఉండదు. శ్యామ్యూల్ గ్యాంగ్ ద్వారా నవ్వించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన థ్రెడ్ ఆషామాషీగా ఉండకూడదు. కానీ ప్రణీత్ బి గ్రేడ్ ఎంటర్ టైన్మెంట్ తో పూర్తిగా పట్టాలు తప్పించాడు. మాములుగా జాన్ విజయ్ ఎక్స్ ప్రెషన్లు, డబ్బింగ్ కొంచెం మోతాదు మించి ఉంటాయి. సరైన జోకులు పడితేనే నవ్వించగలడు. దీంట్లో అది సాధ్యపడకపోవడంతో ఒకదశ దాటాక ఇరిటేషన్ వస్తుంది. రింగు చుట్టూ నడపటం బాగానే ఉంది కానీ అది ఎంగేజింగ్ గా లేదు. సేతుపతిలో పోలీస్ రివాల్వర్ పోయాక వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తరహాలో ఇందులోనూ ఉండాల్సింది

ఎంత సృజనాత్మక స్వేచ్ఛ ఉన్నా సరే దాన్ని మరీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. అర్జున్ మాయల ప్రేమకథ, డబ్బు కోసమే  క్రైమ్ చేసే శ్యామ్యూల్ లవర్ కోసం డైమండ్ వేట చేయడం ఇవన్నీ ఓవర్ ది బోర్డు వెళ్లిపోయాయి. పైగా అతనికి పెట్టిన కారణం నమ్మశక్యంగా లేకపోవడం కాదు సిల్లీగా ఉంది. పాత్రల మధ్య లింకులన్నీ కిందిస్థాయిలో నడుస్తాయి. రింగు చుట్టే సీన్లు రిపీట్ అవుతున్నాయని గుర్తించి అనవసరంగా నళినిని ఎత్తుకుపోవడం లాంటివి పంటి కింద రాళ్ళలా అడ్డం పడ్డాయి. ఏదో ఫ్యాన్స్ ని మెప్పించడం కోసమన్నట్టు ఆర్ఆర్ఆర్ మాస్కులతో నడిపించిన ఈ ఎపిసోడ్ కనీసం చిన్నపిల్లకు నవ్వు తెప్పించినా గొప్పే

కనీసం సెకండ్ హాఫ్ ని ఓ మోస్తరుగా నడిపించినా ఆడియన్స్ క్షమించేవాళ్లేమో కానీ అదీ జరగలేదు. ఇలాంటి సిల్లీ ప్లాట్లు బాలీవుడ్ లో వర్కౌట్ అవుతాయి తప్ప మనదగ్గర పేలవు. పైగా టాలెంటెడ్ క్యాస్టింగ్ ఉన్నా వాళ్ళ బలాన్ని వాడుకునే ఎపిసోడ్లు ప్రణీత్ రాసుకోలేకపోయాడు. కనీసం ఓ అరగంట పాటు ఇక్కడ బాగుందే అనే ఫీలింగ్ ఇవ్వలేకపోయాడు. నిజానికి రింగుని కాసేపు పక్కన పెట్టి అదనపు ట్విస్టులు, పాత్రలను పెట్టినా వేరేలా ఉండేదేమో. ఎంతసేపూ అర్జున్, జాన్ విజయ్, నళిని ల చుట్టే ట్రయాంగిల్ ట్రాష్ పెట్టడంతో ఎప్పుడెప్పుడు అయిపోతుందాని ఎదురు చూడాల్సి వచ్చింది. హర్ష, సుదర్శన్ లాంటి వాళ్ళు సైతం హెల్ప్ లెస్ అయ్యారు.

కొత్తైనా పాతైనా ఏ దర్శకుడు ఇప్పటి థియేటర్ ఆడియన్స్ ని తేలిగ్గా తీసుకోకూడదు. అలా చేస్తే ఏమవుతుందో భాగ్ సాలేని వేలెత్తి చూపొచ్చు. క్లైమాక్స్ ని  మరింత ఖంగాళీ చేయడంతో పిసరంత ఉన్న ఇంప్రెషన్ కూడా పూర్తిగా ఆవిరయ్యింది. గతంలో సూర్యకాంతం రూపంలో ఫ్లాప్ అందుకున్న ప్రణీత్ దాన్నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఎంత నవ్వించే ఉద్దేశమే అయినా కనీస స్థాయిలో కాసిన్ని ఎమోషన్లు, మంచి పాటలు, క్యారెక్టర్ల మధ్య సంబంధాలు అవసరం. అవేవి లేకుండా నలుగురు ఫ్రెండ్స్ డాబా మీద మందు సిట్టింగ్ లో కూర్చుకున్నప్పుడు వేసుకున్న జోకులనే స్క్రిప్ట్ గా రాసుకున్నంత వీక్ గా వచ్చింది భాగ్ సాలే

నటీనటులు

శ్రీసింహా ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉంది. ఇలాంటి టైమింగ్ ఉన్న పాత్రలకు తన అనుభవం సరిపోలేదు. వయసుతో పాటు ఈజ్ పెరిగితేనే ఈ టైపు క్యారెక్టర్లకు సూటవుతాడు. 90 ఎంఎల్ తో పరిచయమైన నేహా సోలంకి జస్ట్ పర్వాలేదు. ఎక్స్ ప్రెషన్లు ఎక్కువ పలికించలేకపోయింది. జాన్ విజయ్ వల్ల ఏదో తమిళ డబ్బింగ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నళిని, వైవా హర్ష, రాజీవ్ కనకాల, హర్షిణి, సుదర్శన్ ఇలా పేపర్ మీద బాగుందనిపించిన తారాగణం దర్శక రచయిత పొరపాట్ల వల్ల సరైన రీతిలో ఉపయోగపడలేదు. మాయ తండ్రి ఛాయస్ కూడా సరిగా కుదరలేదు. నిర్మాతలు అందరిని తీసుకొచ్చారు కానీ వాళ్ళను వాడుకునే చాకచక్యం లేకపోయింది

సాంకేతిక వర్గం

కాల భైరవ సంగీతం ఎంత మాత్రం ఉపయోగపడలేదు. పాటలు ఒక్కసారికే బోర్ కొట్టేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సైతం ప్రత్యేకత లేదు. ఎదిగే స్టేజిలో ఇతన్నుంచి ఆశించే అవుట్ ఫుట్ అయితే ఇది కాదు. రమేష్ ఛాయాగ్రహణంలో మెరుపుల్లేవ్. స్క్రీన్ ప్లేకి తగ్గట్టు కన్ఫ్యూజ్ అయినట్టుంది. నిడివి మరీ ఎక్కువ లేదు కాబట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కార్తీక్ శ్రీనివాస్ ని అన్ని విమర్శలకు టార్గెట్ చేయలేం. డైలాగులు చప్పగా సాగాయి. నిర్మాణ విలువలు సబ్జెక్టుకు తగ్గట్టు డీసెంట్ గా ఉన్నాయి. అర్జున్ – యష్ రంగినేని – సింగనమల కళ్యాణ్ ల జాయింట్ ప్రొడక్షన్ కావడంతో మరీ ఎక్కువ రాజీ పడలేదు.  

ప్లస్ పాయింట్స్

నిడివి

మైనస్ పాయింట్స్

అన్నీ

ఫినిషింగ్ టచ్ : బోర్ వాలే

రేటింగ్ : 1.75/5