2.25/5
2 hr 27 mins | Action | 12-05-2023
Cast - Naga Chaitanya, Arvind Swamy, Sarathkumar, Krithi Shetty, Priyamani, Sampath Raj
Director - Venkat Prabhu
Producer - Srinivasaa Chitturi
Banner - Srinivasaa Silver Screen
Music - Yuvan Shankar Raja
స్టార్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు టాలెంట్ పుష్కలంగా ఉన్నా టాప్ లీగ్ లో చేరేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న నాగ చైతన్య ఎన్నడూ చూడని ఎక్కువ కాన్ఫిడెన్స్ కస్టడీ విషయంలో చూపిస్తూ వచ్చాడు. ఏజెంట్ గాయాలు దీంతో పోతాయని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి తగ్గట్టే వారం పది రోజులుగా ప్రమోషన్లు బలంగా చేశారు. తమిళంలోనే కాక ఇక్కడా మంచి ఫాలోయింగ్ ఉన్న వెంకట్ ప్రభు దర్శకుడు కావడంతో ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. మరి కస్టడీ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందా
కథ
1996 నేపథ్యం. పోలీస్ కానిస్టేబుల్ శివ(నాగ చైతన్య)చాలా సిన్సియర్. ప్రేమించిన అమ్మాయి రేవతి(కృతి శెట్టి)తో పెళ్లి ప్లాన్ చేసుకున్న టైంలో ఓ రాత్రి జరిగిన సంఘటన ఇతని జీవితాన్ని మార్చేస్తుంది. కరుడుగట్టిన క్రిమినల్ రాజు(అరవింద్ స్వామి)ని సిబిఐ ఆఫీసర్(సంపత్ రాజ్) కోర్టుకు తీసుకెళుతుండగా ప్రమాదం జరిగి ఆ బాధ్యత శివ మీద పడుతుంది. సిఎం ద్రాక్షాయని(ప్రియమణి) మనుషులు రాజు కోసం శివను వెంటాడతారు. ఇంత భయంకరమైన వలయం నుంచి శివ ఎలా బయటపడ్డాడనేదే అసలు స్టోరీ
విశ్లేషణ
వెంకట్ ప్రభు ప్రత్యేకత ఆయన స్క్రీన్ ప్లేలో ఉంటుంది. పాత్రల పరిచయంతో మొదలుపెట్టి ట్విస్టులను విప్పుకుంటూ వెళ్లి ఊహించని మలుపులతో కథనాన్ని పరుగులు పెట్టిస్తారు. అజిత్ గ్యాంబ్లర్ అంత పెద్ద హిట్టవ్వడానికి కారణం అదే. కస్టడీలోనూ సగటు ఆడియన్స్ అలాంటి స్పీడ్ ఆశిస్తారు.కానీ ఆశ్చర్యపరిచే విధంగా చాలా ఫ్లాట్ గా సాగే సబ్జెక్టును ఎంచుకున్నారు. ఒక పోలీస్ ప్రాణాలకు తెగించి ఒక కింగ్ పిన్ రౌడీని రక్షించడం వినడానికి గొప్ప పాయింట్. బహుశా చైతుని ఎగ్జైట్ చేసింది ఇదే కావొచ్చు. అంత అనుభవమున్న వెంకట్ ప్రభు మీద పూర్తి నమ్మకంతో చెప్పినట్టు నటించడమే తప్ప స్క్రిప్ట్ లోతుపాతుల్లోకి అతను అంతగా వెళ్లినట్టు అనిపించదు
ప్రమోషన్ టైంలో ముందే చెప్పినట్టు తొలి అరగంట చప్పగా సాగుతుంది. శివ రేవతిల ప్రేమకథను అతి మాములుగా రాసుకున్నారు. దానికి తోడు పాటలు ఏ మాత్రం ఆకర్షణీయంగా లేకపోవడం ఫస్ట్ ఇంప్రెషన్ ని దెబ్బ కొట్టింది. సరే తీస్తున్నది ఛేజింగ్ థ్రిల్లర్ కాబట్టి లవ్ స్టోరీ, పాటలు ఎలా ఉన్నా ప్రేక్షకులు క్షమిస్తారని లెక్కేసుకుని ఉండొచ్చు. సరే ఇందులో తప్పేమీ లేదు. అయితే రాజు పాత్ర ప్రవేశించాక టెంపో పెరగాలి. ఏం జరుగుతుందానే ఆతృత కలగాలి. కానీ దాదాపుగా అంతా ఊహకందే విధంగా జరగడంతో ఎలాంటి హై మూమెంట్స్ లేక డల్లుగా వెళ్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసిన విధానం బాగున్నా అవి కనెక్ట్ చేయాల్సిన విధానం పండలేదు
ప్రీ ఇంటర్వెల్ ముందు నుంచే సన్నివేశాల నుంచి కదలిక వస్తుంది. విశ్రాంతి బ్లాక్ ని ఓ మోస్తరుగా కట్ చేశాక సెకండ్ హాఫ్ లో చాలా థ్రిల్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేయడం తప్పేమీ కాదు. అయితే శివకు రాజుకు మధ్య లింక్ ని వివరించే ఫ్లాష్ బ్యాక్ థ్రెడ్ మరీ అవుట్ డేటెడ్ కావడంతో అక్కడ జరగాల్సిన ఎమోషనల్ కనెక్షన్ జీరో అయిపోయింది. దీంతో శివ డ్యూటీ కోసం కాకుండా తన ఫ్యామిలీకి జరిగిన నష్టానికి ప్రతీకారం కోసం తెగించాడన్న అభిప్రాయం కలిగించడం ఒకరకంగా రైటింగ్ తప్పే. మరోవైపు శివ రాజులను పోలీసులు సిఐడి డిపార్ట్ మెంట్ వెంటాడే క్రమంలో చాలా లూజ్ ఎండ్స్ వదిలేశారు. టేకింగ్ వీకైనప్పుడు సహజంగానే లాజిక్స్ మీద ప్రశ్నలొస్తాయి
క్యారెక్టరైజేషన్స్ మీద సీరియస్ హోమ్ వర్క్ జరగలేదు. ముఖ్యమంత్రి రేంజ్ లో దందాలు చేసే రాజు చాలా సులభంగా శివ, రేవతిల మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పరచుకోవడం కన్విసింగ్ గా లేదు. అంత రాటుదేలిన దుర్మార్గుడు క్షణాల్లో వాళ్ళ మీద దాడి చేసి పారిపోయే అవకాశం ఉన్నా అవసరానికి మించి సానుభూతితో ప్రవర్తించడం నమ్మశక్యంగా ఉండదు. క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఇంటరెస్టింగ్ గా ఉండాల్సిన ఛేజులు సుదీర్ఘంగా వెళ్తాయి తప్పింది ఎలాంటి వావ్ ఫీలింగ్ కనిపించకపోవడం మరో మైనస్. పోనీ శివ రాజులు ఒకటే అవ్వాల్సిన సీన్ లో సరైన ఫ్యాన్ స్టఫ్ పడి ఉంటే ఇక్కడ చెప్పిన లోపాలు కవరైపోయేవి. అదీ అంతమాత్రంగా వచ్చింది
మానాడులో శింబు-ఎస్జె సూర్యల కాంఫ్లిక్ట్ డ్రామాని అద్భుతంగా పండించిన వెంకట్ ప్రభు అచ్చంగా అదే కాకపోయినా చైతు అరవింద్ స్వామిల మధ్య ఆసక్తికరంగా సాగే నాటకీయ సన్నివేశాలను రాసుకోవాల్సింది. ఎంతసేపు పరిగెత్తడం కొట్టుకోవడం తప్ప రెండో సగంలో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఫోకస్ మొత్తం రెండు పాత్రల మీదే ఉండటంతో అదనంగా ఎలాంటి సబ్ ప్లాట్స్ కు అవకాశం లేక నెరేషన్ విపరీతంగా నెమ్మదించింది. అసలు సిఎం స్థాయి మనిషి ఆఫ్ట్రాల్ ఒక వ్యానులో వెళ్తున్న వాళ్ళను పట్టుకోలేనంతగా స్థితిలో ఉందంటే దానికి సంబంధించిన ఉపకథలు నమ్మేలా ఉండాలి. కానీ వీటి పట్ల శ్రద్ధ వహించలేదు
నటీనటులు
నాగ చైతన్య శక్తివంచన లేకుండా బాగానే కష్టపడ్డాడు. తనవరకు డైరెక్టర్ అడిగిందంతా ఇచ్చేశాడు. డాన్సుల విషయంలో బలహీనత దాగలేదు. కృతి శెట్టి దాదాపు హీరోతో సమానంగా కనిపించే స్పేస్ దక్కించుకుంది. నటనపరంగా ఓకే. అరవింద్ స్వామి లాంటి పవర్ ఫుల్ విగ్రహాన్ని వాడుకోవాల్సిన తీరు ఇది కాదు. కొన్ని చోట్ల బ్లాంక్ గా కనిపించి డైలాగ్స్ తో సరిపెట్టేశారు. ప్రియమణికి మొదట్లో ఇచ్చిన బిల్డప్ తప్ప తర్వాత స్కోప్ దక్కలేదు. శరత్ కుమార్ ది రొటీన్ పాత్రే. సంపత్, గోపరాజు రమణ, రవిప్రకాష్, జయప్రకాష్ అందరివీ రెగ్యులర్ గా చూసే క్యారెక్టర్లే. తమిళ హీరో జీవా చిన్న క్యామియో వృథా అయ్యింది. వెన్నెల కిషోర్ కామెడీ పెద్దగా నవ్వించలేదు.
సాంకేతికవర్గం
ఇసైజ్ఞాని ఇళయరాజా ఆయన అబ్బాయి యువన్ శంకర్ రాజా కలిసి అందించిన సంగీతం ఏ మాత్రం మెప్పించలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా పర్వాలేదనిపించినా మొత్తంగా చూసుకుంటే పాటలతో సహా అత్యంత వీక్ గా అనిపించిన డిపార్ట్ మెంట్ మ్యూజిక్కే. ఎస్ఆర్ కథిర్ ఛాయాగ్రహణం మరీ బెస్ట్ అనిపించలేదు కానీ అండర్ వాటర్ ఎపిసోడ్, ఫైట్స్ ని బాగా చూపించారు. వెంకట్ రాజీన్ ఎడిటింగ్ గురించి చెప్పడానికేం లేదు. స్టన్ శివ-మహేష్ ల పోరాటాలు పర్వాలేదు. అబ్బూరి రవి మాటలు మెరుపులు లేకుండా సాగాయి. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ వేల్యూస్ లో లోపాలు లేవు కానీ అక్కడక్కడా రాజీపడిన ధోరణి కనిపిస్తుంది
ప్లస్ పాయింట్స్
నాగ చైతన్య
రెండు యాక్షన్ బ్లాక్స్
మైనస్ పాయింట్స్
ఊహించగలిగే కథనం
సంగీతం
పాత్రల డిజైనింగ్
లవ్ ట్రాక్
ఫినిషింగ్ టచ్ : కష్టం శివా
రేటింగ్ : 2.25/5