సమీక్ష – రావణాసుర

2/5

2 Hr 22 mins   |   Thriller   |   07-04-2023


Cast - Ravi Teja, Sushanth, Anu Emmanuel, Faria Abdullah, Megha Akash, Daksha Nagarkar, Poojitha Ponnada, Sriram, Rao Ramesh, Jayaram, Murali

Director - Sudheer Varma

Producer - Abhishek Nama, Ravi Teja

Banner - Abhisek Pictures, RT Teamworks

Music - Harshavardhan Rameshwar, Bheems Ceciroleo

మాములుగా రవితేజ కొత్త సినిమా వస్తోందంటేనే ఆ సందడి వేరుగా ఉంటుంది. కానీ రావణాసుర విషయంలో టీమ్ కొంచెం లో ప్రొఫైల్ మైంటైన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త జానర్ ట్రై చేయడం, మాస్ మహారాజాని మునుపెన్నడూ చేయని సరికొత్త పాత్రలో చూపించడం లాంటి కారణాల వల్ల ప్రమోషన్లలో హీరో దర్శకుడు వీలైనంత ఎక్కువ వివరాలేవీ చెప్పకుండా గుట్టుని కొనసాగించారు. ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్లతో మంచి ఊపుమీదున్న రవితేజకు రావణాసుర హ్యాట్రిక్ ఇచ్చే కంటెంట్ తో వచ్చిందా

కథ

రవీంద్ర(రవితేజ) క్రిమినల్ లాయర్. తన జూనియర్ కనకం(ఫరియా అబ్దుల్లా) దగ్గరే అసిస్టెంట్ గా పని చేస్తుంటాడు. నగరంలో వరసగా హత్యలు జరుగుతుంటాయి. ఇందులో సాకేత్(సుశాంత్)ప్రమేయం ఉన్నట్టు అనుమానం మొదలవుతుంది. తన తండ్రి ఇరుక్కున్న కేసు నుంచి బయట పడేందుకు హారిక(మేఘ ఆకాష్) కనకం దగ్గరకు వస్తుంది. రవీంద్ర సహాయం చేసే నెపంతో ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఈలోగా క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ దారుణాలన్నీ చేస్తున్నదెవరనే ప్రశ్నకు సమాధానమే రావణాసుర

విశ్లేషణ

కమర్షియల్ హీరోలకుండే అతి పెద్ద పరిమితి రిస్కులు చేస్తే అభిమానులు అంత సులభంగా అంగీకరించకపోవడం. ప్రతి స్టార్ మీద సాధారణ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిప్రాయాలు నెలకొంటాయి. వాటికి అతీతంగా ఏదైనా ప్రయోగం చేస్తే తిరస్కరించే ప్రమాదం ఉంది. వెంకటేష్ ఈ కారణంగానే రానా నాయుడు విషయంలో విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. రావణాసుర సబ్జెక్టు పరంగా చూస్తే ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. సాధారణంగా ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ లో ఉండే మర్డర్లు, అనుమానితులు, ట్విస్టులు అన్నీ ఉన్నాయి. స్టోరీ లైన్ పరంగా ఎగ్జైట్ చేయడం వల్లే రవితేజ ఎక్కువ ఆలోచించకుండా ఓకే చేసినట్టు సినిమా మొత్తం చూశాక అర్థమవుతుంది.

దర్శకుడు సుధీర్ వర్మ ఎంత విభిన్నంగా చెప్పాలని ప్రయత్నించినా ఇది రవితేజ సినిమా అనే స్పృహతో రెగ్యులర్ ఫార్ములాలోనే మొదలుపెడతాడు. అతి మాములు జోకులు, త్వరగా అయిపోవాలనిపించే పాటలు ఇలా రొటీన్ గానే సాగిపోతుంది. అయితే అసలు మలుపు వచ్చే దాకా వీటిని ఎంగేజింగ్ గా రాసుకోవడంలో తడబడటంతో మొదటి అరగంట అసలేం చూస్తున్నామో అర్థం కాదు. మొదటి ట్విస్టు ఓపెన్ చేశాక కూడా ఎగ్జైట్ మెంట్ లెవెల్స్ ఆశించిన స్థాయిలో ఉండవు. రవితేజని ఓవర్ నెగటివ్ గా చూపించడమే గొప్ప అచీవ్ మెంట్ గా భావించిన సుధీర్ వర్మ దానికి సహేతుకమైన కారణం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారనే చిన్న లాజిక్ మిస్సయ్యాడు

దీని వల్లే ఎన్ని మలుపులు వచ్చినా ఎన్ని హత్యలు జరిగినా రావణాసుర ఫ్లో ఒక మాములు సినిమాలాగా వెళ్తుంది తప్ప సంథింగ్ స్పెషలని ఏ దశలోనూ అనిపించదు. ఇంచుమించు ఇదే పాయింట్ తో మోహన్ బాబు ఆ మధ్య గాయత్రి చేశారు. అందులో విష్ణు కూడా ఉంటాడు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో గుర్తు లేదు కానీ ఈ రెండు సినిమాలకు స్ఫూర్తి ఒకటేనని వరల్డ్ మూవీస్ చూసే ఎవరైనా సులభంగా చెప్పగలరు. తన ప్రధాన బలమైన స్క్రీన్ ప్లే మీద సుధీర్ ఈసారి పెద్దగా కసరత్తు చేయలేదు. ఊహాతీతంగా జరిగే ఎపిసోడ్లు రాసుకున్నాడు కానీ అవన్నీ ఊహాకనుగుణంగానే జరిగిపోవడం బాగా దెబ్బ తీసింది. షాక్ అనిపించే మూమెంట్స్ చాలా పరిమితం

హీరో ప్రవర్తన వెనుక అతను చేసే హత్యల వెనుక ఏదో లింక్ ఉంటుందని ముందే పబ్లిక్ ప్రిపేరయినప్పుడు వీలైనంత త్వరగా ఫ్లాష్ బ్యాక్ ని చెప్పేయాలి. సాగదీసి ప్రీ క్లైమాక్స్ కు ముందు వరకు ఏదో పెద్ద సస్పెన్స్ లా దాచి పెట్టడం ఓపికకు పరీక్ష పెడుతుంది. దానికి తోడు సాంగ్స్ లేకపోతే ఎక్కడ ఫ్యాన్స్ ఫీలవుతారోనని బలవంతంగా ఇరికించిన పాటలు పంటి కింద రాళ్లలా మారాయి. పైగా రవీంద్ర గతంలో అందరూ వాడేసి అరిగిపోయిన మెడికల్ మాఫియా తిరిగి రిపీట్ చేయడం తేడా కొట్టింది. మాస్ ని థ్రిల్ ని మిక్స్ చేయాలని సుధీర్ వర్మ చేసిన ప్రయత్నం రెండింటికి న్యాయం చేయలేక మధ్యలో నలిగిపోయింది చాలా ఎక్కువ ఆశించి చూసినోళ్ల మెదడు లాగా.

కట్టిపడేసే కథనం ఉన్నప్పుడు హీరో ఎవరనేది జనం పట్టించుకోకుండా హిట్ చేస్తారని రాక్షసుడులాంటివి ఋజువు చేశాయి. సుధీర్ వర్మ ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయి టెంప్టింగ్ అనిపించే పాయింట్ ని తీసుకుని అసలు ఉద్దేశాన్ని ప్రతిభావంతంగా చెప్పలేకపోయాడు. రవితేజకు ఫ్యామిలీస్ లో మాస్ లో మంచి ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బ తీయకూడదనే ఒత్తిడి డైరెక్టర్ క్రియేటివిటీని కుదించిన దాఖలాలు కనిపిస్తాయి. క్యారెక్టరైజేషన్ లోపాల చాలా లాజిక్స్ గాలికొదిలేశారు. నమ్మశక్యం కాని రీతిలో ప్రొస్తటిక్స్ మేకప్ కాన్సెప్ట్ ని కామెడీగా మార్చారు. టెక్నికల్ గానూ సుధీర్ వర్మ బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాడు.

నటీనటులు

మాస్ మహారాజా రవితేజని ఇలా ప్రతికూల ఛాయలున్న రవీంద్ర పాత్రలో చూడటం కొత్తగా అనిపిస్తుంది. సీరియస్ గా బాగా క్యారీ చేశారు. వయసు తాలూకు ప్రభావాన్ని కొన్ని ఫ్రేమ్స్ లో కవర్ చేయలేకపోయారు. సుశాంత్ బాగున్నాడు. మేఘ ఆకాష్ ఒకటే స్టోరీతో నేరుగా సంబంధం ఉన్న క్యారెక్టర్. ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, అను ఇమ్మానియేల్, దక్ష ఉన్నంతలో ఓకే.  జయరాంకు ఇలాంటివి కొట్టిన పిండి. మురళి శర్మ, రావు రమేష్, సంపత్, హైపర్ ఆది, విజయ్ కుమార్ ఇలా తారాగణం లిస్టు పెద్దదే ఉంది కానీ అందరివీ ఒక పరిధి మేరకే ఉన్నవి. దానికి తగ్గట్టే చేశారు తప్పించి అదే పనిగా గుర్తు పెట్టుకునే స్కోప్ దక్కలేదు.

సాంకేతిక వర్గం

హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే సాగింది. థీమ్ కి తగ్గట్టు ఇచ్చిన డిఫరెంట్ సిగ్నేచర్ ట్యూన్ సందర్భానికి తగ్గట్టు సింక్ అయ్యింది. పాటలు మాత్రం బ్రేక్ కోసం బయటికి వెళ్లేలా చేస్తాయి. ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన చివరి ఐటెం సాంగ్ కూడా భరించలేనిదే. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం పర్వాలేదు. ఆయన నైపుణ్యానికి పరీక్ష పెట్టేంత రిస్క్ సుధీర్ వర్మ చేయలేదు కాబట్టి ఎక్కువ జడ్జ్ చేయలేం. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకొంచెం పదునుగా ఉంటే లెన్త్ తగ్గేది. ప్రొడక్షన్ వేల్యూస్ మాత్రం తెరమీద కనిపిస్తాయి. ఇష్టపడిన సబ్జెక్టు కావడంతో పాటు స్వయానా నిర్మాణ భాగస్వామి అయిన రవితేజ ఖర్చుకు వెనుకాడలేదు

ప్లస్ పాయింట్స్

రవితేజ నటన  

మైనస్ పాయింట్స్

ఫ్లాట్ స్క్రీన్ ప్లే
సులభంగా ఊహించే ట్విస్టులు
పాటలు
లాజిక్స్

ఫినిషింగ్ టచ్ : భరించలేమురా

రేటింగ్ : 2/5