3/5
2 Hr 32 Min | Action | 30-03-2023
Cast - Nani, Keerthy Suresh, Deekshith Shetty, Sai Kumar, Shine Tom Chacko, Samuthirakani, Poorna and others
Director - Srikanth Odela
Producer - Sudhakar Cherukuri
Banner - Sri Lakshmi Venkateswara Cinemas
Music - Santhosh Narayanan
న్యాచురల్ స్టార్ మూవీ అంటేనే కుటుంబ ప్రేక్షకులో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. అన్ని వర్గాలను మెప్పించేలా కథలను ఎంచుకుంటూ వచ్చిన నాని మొదటిసారి ఊర మాస్ నేపథ్యం ఎంచుకోవడం దసరా పట్ల ఈ స్థాయి హైప్ ని తీసుకొచ్చింది. పోస్టర్లతో మొదలుపెట్టి ప్రమోషన్ల దాకా టీమ్ తీసుకున్న శ్రద్ధ వల్ల ఇందులో బలమైన కంటెంట్ ఉందనే సందేశం జనానికి వెళ్లిపోయింది. క్యాస్టింగ్ కి తోడు భారీ బడ్జెట్ కళ్ళకు కట్టినట్టు ట్రైలర్ లోనే కనిపించేసింది. ఇంతకీ దసరా టైటిల్ కు తగ్గట్టు పండగలా ఉందా.
కథ
తొంభై దశకం నేపథ్యంలో కథ సాగుతుంది. తెలంగాణ ప్రాంతంలోని వీర్లపల్లి అనే ఊరి జనానికి బొగ్గు గనులు, మద్యపానం ఇవే జీవితం. ధరణి(నాని) సూరి(దీక్షిత్ శెట్టి) వెన్నెల(కీర్తి సురేష్) చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు. ధరణి మనసు పారేసుకున్న వెన్నెల అనూహ్యంగా సూరిని ఇష్టపడుతుంది. శివన్న(సముతిరఖని), రాజన్న(సాయికుమార్) రాజకీయం వల్ల వీళ్ళ జీవితాల్లో అనూహ్య మార్పులు వస్తాయి. ఊహించని సంఘటనల నడుమ ధరణి లక్ష్యం హింసాత్మకంగా మారిపోతుంది. తర్వాత జరిగేదే అసలు స్టోరీ.
విశ్లేషణ
సహజత్వం కూడిన ఇలాంటి రా విలేజ్ డ్రామాల్లో కమర్షియల్ ఫ్లేవర్ ని జోడించడం చాలా కష్టం. అందులోనూ ఇమేజ్ ఉన్న హీరోతో చేస్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అందుకే మేకర్స్ వీటి జోలికి వెళ్లేందుకు ఎక్కువ ఇష్టపడరు. అయితే రంగస్థలంతో ఈ భ్రమను బ్రేక్ చేసిన క్రెడిట్ సుకుమార్ కు దక్కుతుంది. ఒక నిజాయితీ ప్రయత్నాన్ని బలమైన టేకింగ్ తో చూపించినప్పుడు హీరో హీరోయిన్ కవ్వింపు పాటలు, ఐటెం సాంగులు పెట్టినా పాస్ అవ్వొచ్చని నిరూపించారు. ఆయన శిష్యుడే కాబట్టి దసరా విషయంలో శ్రీకాంత్ ఓదెల తన డెబ్యూతోనే పెద్ద రిస్క్ కు సిద్ధపడ్డాడు. అసలు నానిని ధరణిగా ఊహించుకోవడమే ఒక సవాల్ లాంటిది.
దసరా సెటప్ ని రిజిస్టర్ చేసేందుకు తగినంత సమయం తీసుకున్న శ్రీకాంత్ ఈ క్రమంలో కొంత నెమ్మదిగా వెళ్లినా పలు ఇంటర్వ్యూలలో చెప్పినట్టు ఏదీ బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేయలేదు. రాసుకున్న సబ్జెక్టుకే కట్టుబడ్డాడు. ముందు ప్రధాన పాత్రల మధ్య స్నేహం, ఆ తర్వాత ముక్కోణపు ప్రేమతో మొదలుపెట్టి, క్రమంగా దానికి పొలిటికల్ కలర్ అద్ది రివెంజ్ డ్రామా వైపు మలుపు తిప్పడం మంచి ఆలోచన. ఇంటెన్స్ డ్రామాకు సరిపడా ముడిపాయింట్ ని శ్రీకాంత్ ఓదెల సరిగ్గా రాసుకున్నాడు. దాన్నే రియలిస్టిక్ డ్రామాగా ప్రెజెంట్ చేయాలని తాపత్రయపడ్డాడు. ఇందులో చాలా మటుకు విజయవంతం అయ్యాడు కూడా.
నిజానికి శ్రీకాంత్ పురాణాలను ప్రత్యేకించి రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం టైటిల్ తో మొదలుపెట్టి క్లైమాక్స్ లో రావణ దహనం దాకా స్పష్టంగా కనిపిస్తుంది. పరస్త్రీ మీద వ్యామోహపడటం వల్ల అన్ని సుగుణాలున్న రావణుడు చివరికి చరిత్రలో చెడ్డవాడిగా మిగిలాడు. అదే కాంక్ష ఒక దుష్టుడిలో కలిగితే జరిగే దారుణం ఏ స్థాయిలో ఉంటుందో చూపించే చిత్రమే దసరా. కాకపోతే వైవిధ్యం ఉండాలనే ఉద్దేశంతో మలయాళ నటుడిని మెయిన్ విలన్ గా తీసుకొచ్చిన శ్రీకాంత్ ఓదెల అతన్నుంచి ఆ స్థాయి అవుట్ ఫుట్ ని రాబట్టుకోలేకపోయాడు. ఉదాహరణకు వర్షం – జయం – నిజంలో గోపిచంద్ రేంజ్ ఆర్టిస్టు అయితేనే దీనికి న్యాయం జరిగేది.
ఇంటర్వెల్ దాకా ఒక టోన్ లో నడిపించిన దర్శకుడు విశ్రాంతి దగ్గర షాకింగ్ ట్విస్టు రివీల్ అయ్యాక ఎక్కువ ఎమోషన్ మీద దృష్టి పెట్టడంతో ఒక అరగంట నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ధరణి, వెన్నెల మధ్య భావోద్వేగాల కోసం అంత సమయం అవసరం లేదు. వాళ్ళ బంధాన్ని ప్రేక్షకులు అపార్థం చేసుకునే అవకాశం లేనప్పుడు అంత విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ ప్రేమ కన్నా ధరణి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనే దాని మీదే ఆడియన్స్ దృష్టి ఉంటుంది కాబట్టి వీలైనంత వేగంగా యాక్షన్ తో పరుగులు పెట్టించాలి. ఇక్కడ కొంచెం తడబాటు జరిగింది. పైగా అంతగా అవసరం అనిపించని పాటలు సైతం బ్రేక్ వేశాయి.
ఇదంతా రెండో సగంలో గ్రాఫ్ పరంగా కొంచెం అప్ అండ్ డౌన్ అయినప్పటికీ క్లైమాక్స్ లో తారాస్థాయికి తీసుకెళ్లే ఎలివేషన్ తో చివరి ఘట్టాన్ని ముగించడం మాస్ కి గూస్ బంప్స్ ఇస్తుంది. తగలబడుతున్న రావణుడి బొమ్మ ముందు హీరో అతని స్నేహితులు కలిసి విలన్ గ్యాంగ్ ఊచకోత చేసే సన్నివేశం అద్భుతంగా పేలింది. ఇక్కడ ప్రతినాయకుడి ప్రెజెంటేషన్ పరంగా కాస్త డమ్మీగా అనిపించినా అతన్ని లక్ష్యంగా పెట్టుకున్న ధరణి చూపించే విశ్వరూపం అప్పటిదాకా ఫీలైన కొన్ని మైనస్సులను కవర్ చేసేసింది. కాకపోతే ఇంత పచ్చిగా ఉన్న ఒక పల్లెటూరి నేపధ్యాన్ని ఫ్యామిలీ జనాలు ఎంతమేరకు రిసీవ్ చేసుకుంటారనేది కొంత వేచి చూడాల్సి రావొచ్చు
శ్రీకాంత్ ఓదెలలో నిస్సందేహంగా మంచి టెక్నీషియన్ ఉన్నాడు. అలా అని లోపాలే లేవని కాదు. శివన్న, రాజన్న పాత్రలకు టైటిల్ కార్డ్ నుంచి ఇచ్చిన బిల్డప్ తర్వాత కథపరంగానూ వాడుకునే అవకాశం తీసుకోలేదు. ధరణి, సూరి మధ్య స్నేహబంధం ఇంకొంచెం బలంగా రిజిస్టర్ చేసుంటే ఇంపాక్ట్ పెరిగేది. స్నేహితుడి ప్రేయసిని హీరో చిన్నప్పుడే ఇష్టపడటం లాంటి కాంటెంపరరీ పాయింట్స్ తమిళ మలయాళంలో సహజం కానీ టాలీవుడ్ లోనూ ఇలాంటి సాహసాలు చేయడం ఒకరకంగా మంచిదే. దీన్ని కన్విన్సింగ్ గా చూపించడంలో శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికి నెవర్ బిఫోర్ లాంటి ఉపమానాలు కాదు కానీ దసరా గెలిచినట్టే
నటీనటులు
నానిలో ఉన్న వయొలెంట్ యాక్టర్ దసరాలో పూర్తిగా బయటికి వచ్చాడు. నిజంగా ధరణి ఒంట్లో పూనాడేమో అన్నంతగా తన పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశాడు. యాసని పలికే విధానంతో మొదలుపెట్టి తనకు తిరుగులేని ఆయుధమైన బరువైన ఎమోషన్లను పలికించే దాకా యాక్టింగ్ కోణంలో బాంచెత్ అనిపించేశాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ఉన్నంతలో మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి స్కోప్ దక్కింది. వాడుకున్నాడు. కీర్తి సురేష్ లుక్స్ తోనే కాదు ఎప్పటిలాగే నటన కూడా భేష్ అనిపించుకుంది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అంతగా సూటవ్వలేదు. సముతిరఖని. సాయికుమార్, జరీనా వహాబ్, ఝాన్సీ, పూర్ణ తదితరులతో క్వాలిటీ క్యాస్టింగ్ బాగా కుదిరింది
సాంకేతిక వర్గం
సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం దసరా మూడ్ ని క్యారీ చేసింది. సీన్స్ లో ఉన్న ఎలివేషన్లను కనెక్ట్ అయ్యేలా ఇచ్చారు. కొన్ని సన్నివేశాలకు ఇంకా బెటర్ గా ఇవ్వాల్సిందనిపిస్తుంది. రెండు పాటలు బాగున్నాయి. ఆల్బమ్ మొత్తం ఒకే రేంజ్ లో ఉంటే దసరాకు ఇంకా ప్లస్ అయ్యేది. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం దసరాకు అత్యున్నత ప్రమాణాలు జోడించింది. బ్యాక్ డ్రాప్ ని చూపించిన తీరు, కలర్ సెటింగ్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ లో ఓ అయిదు పది నిమిషాల కోతకు ఛాన్స్ ఉన్నా ఎందుకో మొహమాటపడింది. ఆర్ట్ వర్క్ సూపర్బ్. ఎస్ఎల్విసి నిర్మాణంలో కొత్త దర్శకుడిని నమ్మి ఇంత ఖర్చు పెట్టడం నిజంగా అభినందనీయం
ప్లస్ పాయింట్స్
నాని నటన
దర్శకుడి టేకింగ్
క్లైమాక్స్
యాక్షన్ ఎపిసోడ్లు
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా నెమ్మదితనం
విలన్ క్యారెక్టరైజేషన్
ఎమోషన్ డోస్
ఫినిషింగ్ టచ్ : నాని మాస్ బిర్యానీ
రేటింగ్ : 3/5
Gulte Telugu Telugu Political and Movie News Updates