సమీక్ష – ఒకే ఒక జీవితం

3/5

2 hr 37 Mins   |   Family   |   09-09-2022


Cast - Sharwanand, Vennela Kishore, Ritu Varma ,Amala, Priyadarshi, Nassar

Director - Shree Karthick

Producer - S. R. Prakashbabu, S. R. Prabhu

Banner - Dream Warrior Pictures

Music - Jakes Bejoy

జీవితం చాలా చిన్నది అనుభవించు రాజా అన్న సినిమాలూ వున్నాయి. జీవితాన్ని లక్ష్యసాధన కోసమో, ఆశయ సాధన కోసమో వాడమని ఉద్భోధించిన సినిమాలూ వచ్చాయి. ఇలా జీవితం అనే కాన్సెప్ట్ ను రకరకాలుగా వాడిన సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ ఎవరికైనా సరే ఒకటే ఒక్క జీవితం. మరో జీవితం అనేది వుండదు. ఈ జీవితాన్నే ఆనందంగా జీవించు అని చెప్పే పాయింట్ తీసుకుని, దానికి టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ముడివేసి, ఆపై అమ్మ ప్రేమ, ఎమోషన్లు జోడించి, వీలయినంత వరకు చిక్కని స్క్రీన్ ప్లే అల్లే ప్రయత్నం చేసాడు కొత్త దర్శకుడు కార్తీక్. అసలు టైమ్ మెషీన్ ను పాస్ట్..ఫ్యూచర్ లకు వాడడం అనే పాయింట్ కు బదులుగా మనం కోల్పోయిన వారిని మరొక్క సారి చూడడానికి ఉపయోగించడం అనే దగ్గరే మార్కులు కొట్టేసాడు దర్శకుడు..కథకుడు కార్తీక్.

ఒకే ఒక జీవితం కథనం చాలా రిస్క్ తో కూడింది. ఓ కొత్త దర్శకుడు చాలా ధైర్యం చేయాలి ఇలాంటి పాయింట్ ను పట్టుకుని కథ అల్లాలంటే. టైమ్ మెషీన్ అన్నది లాజిక్ కు అందనంత దూరంలో వుంటుంది. కానీ అలా అని లాజిక్ ను అలుసుగా తీసుకోకూడదు. టైమ్ ట్రావెల్ ను ఎమోషనల్ జర్నీగా మారుస్తున్నపుడు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి బోర్ కొట్టకూడదు. ఎందుకంటే అందరు ప్రేక్షకులు కూడా భావోద్వేగాలను ఆస్వాదించలేకపోవచ్చు. ఇన్ని పాయింట్లు బుర్ర నిండా పెట్టుకుని కథ అల్లడం, కథనం తయారు చేయడం అంటే అంత సులువైన ఫీట్ కాదు. కానీ దర్శకుడు కార్తీక్ ఆ ఫీట్ చేయడంలో తొంభై శాతం విజయం సాధించాడు.

ముగ్గురు స్నేహితులు..(శర్వా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్)..ముగ్గురికి మూడు కారణాలు టైమ్ ట్రావెల్ లో వెనక్కు వెళ్లడానికి. శర్వా అమ్మ ప్రేమ కోసం ..ప్రియదర్శి అమ్మాయి ప్రేమ కోసం…వెన్నెల కిషోర్..చిన్నతనంలో నిర్లక్ష్యం చేసిన చదువును సరి చేసుకోవడం కోసం. సైంటిస్ట్ (నాజర్) సాయంతో అలా టైమ్ ట్రావెల్ చేసి చిన్నతనానికి వెళ్లిన ముగ్గురికి అనుకోకుండా ఓ షాక్. దాని నుంచి బయటపడడం ఎలా? చివరకు ఏమయింది? అన్నది మిగిలిన సినిమా.

దర్శకుడు కార్తీక్ కథను పలు లేయర్లుగా అల్లుకున్నాడు.ఎక్కడా జంప్ లు అస్సలు లేకుండా చూసుకున్నాడు. ఎమోషన్..ఫన్..ఉత్కంఠ మూడూ వీలయినంత వరకు ఎక్కడా డౌన్ కాకుండా చూసుకున్నాడు. సినిమా ఎత్తుగడనే కాస్త థ్రిల్లర్ టచ్ లో ఎత్తుకున్నాడు. 24 సినిమాలో విక్రమ్ కుమార్ స్టయిల్ ఇక్కడ కాస్త కనిపిస్తుంది. ఓపెనింగ్ సీన్ కు, ప్రీ క్లయిమాక్స్ సీన్ కు ముడిపెట్టడంలో కూడా విక్రమ్ కుమార్ 24 స్టయిల్ తొంగిచూస్తుంది.

సినిమా తొలిసగం మొత్తం ఆసక్తికరంగా, ఇటు కథ, అటు ఫన్ కలిసి సాగుతుంది. విశ్రాంతి ముందు అస్సలు ఊహించలేని ట్విస్ట్ తో ముగించాడు. ఇంటర్వెల్ సీన్ తీసిన విధానం బాగుంది. ఎందుకు అంత డిటైల్డ్ గా తీస్తున్నాడా అన్న అనుమానం కలిగినా ట్విస్ట్ బయటకు వచ్చాక,చిన్న జర్క్ లా వుంటుంది.

సినిమా మలిసగం మొదలైన తరువాత కాస్త డౌన్ అయిన మాట వాస్తవం. పిల్లలను హైదరాబాద్ నగరం అంతా తిప్పుతూ సాగించిన మాంటేజ్ సాంగ్ వ్యవహారం కాస్త లాగ్ అనిపిస్తుంది. అదీ కాక సినిమా అంతా కూడా కాస్త స్లో నెరేషన్ అన్నది దర్శకుడు స్టయిల్ గా పెట్టుకున్నాడు. అది చాలా చోట్ల వర్కవుట్ అయింది. కొన్ని చోట్ల లాగ్ అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఎలా వున్న ప్రేక్షకుడికి చూడాలన్న ఉత్కంఠను, ఆసక్తిని మాత్రం చెడనివ్వలేదు. దర్శకుడు సినిమాను ఎక్కడకు తీసుకెళ్లి ఎలా ముగిస్తాడా? అన్నది చివరంగా చూసేలా చేస్తుంది.

సినిమా చివర్న కేవలం హీరో చేత పేజీలకు పేజీల డైలాగులు, సందేశాలు ఇవ్వకుండా, ముగ్గురు నటుల చేత క్లుప్తంగా మూడు మాటాలు చెప్పించి, జనాలను ఇంటకి పంపే ప్రయత్నం చేసాడు దర్శకుడు. సినిమా కమర్షియల్ గా ఎలా వుంటుంది అన్న ఆలోచన పక్కన పెడితే చూసిన ప్రతి ప్రేక్షకుడు ఓ వైవిధ్యమైన ప్రయత్నాన్ని చూసిన ఫీలింగ్ తో ఇంటికి వస్తాడు.

సినిమాకు శర్వానంద్ కీలకంగా నిలిచాడు. శర్వా మంచి నటుడు. అది కొత్తగా చెప్పనక్కరలేదు. కానీ ఈ సినిమాలో నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. కొన్ని సీన్లలో పెదవులు వొణకడం వంటి సున్నితమైన స్పందనలు కూడా అద్భుతంగా చూపించాడు. కొన్ని భావోద్వేగ భావనలు మొహంలో శర్వా పలికించిన తీరుమాత్రం గుర్తుండిపోతుంది. వెన్నెల కిషోర్ కూడా ప్రశంనలు అందుకుంటాడు. హీరోయిన్ కు అంత పాత్ర లేదు. జస్ట్ ఓ హీరోయిన్ వుండాలి కనుక పెట్టారు. అందుకే ఎటువంటి డ్యూయట్ లు ప్లాన్ చేసి, ఫ్లోని చెడగొట్టలేదు. సినిమాలో కీలకమైన పాత్రనే అయినా అమల అక్కినేని తో ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేరు. అమల అక్కినేని తల్లి పాత్రలో కొత్తగా అనిపించింది కానీ శర్వా తో వచ్చిన సీన్లలో అంత గొప్పగా అనిపించలేదు.

టెక్నికల్ గా సినిమా మరీ అద్భుతంగా లేదు కానీ బాగుంది. నేపథ్యసంగీతం బాగుంది. అయితే హీరో, హీరో బాల్యం, హీరో తల్లి ఇవన్నీ సంగీతం చుట్టూ తిరుగుతూ, ఓ మాంచి పాటను చేయించుకోలేకపోవడం సరికాదు. సినిమాలో కీలకమైనపుడల్లా వినిపించేలా ఓ థీమ్ సాంగ్ ను అద్భుతంగా చేయించుకుని వుంటే సినిమాను మరింత పైకి తీసుకెళ్లేది.

ప్రేక్షకుల రసస్పందనను బట్టి ఈ సినిమా విజయం ఆధారపడి వుంటుంది. అయితే చూసిన వాళ్లను మాత్రం డిస్సపాయింట్ చేయదు.

ప్లస్ పాయింట్లు

స్క్రిప్ట్

శర్వానంద్

నేపథ్యసంగీతం

మైనస్ పాయింట్లు

ద్వితీయార్థంలో కొంత పార్ట్

పాటలు

ఫినిషింగ్ టచ్: ‘జీవితం’ చవి చూడాల్సిందే

Rating: 3/5