3/5
2 hour 25 min | Thriller | 13-08-2022
Cast - Nikhil Siddharth, Anupama Parameswaran, Anupam Kher
Director - Chanddo Mondeti
Producer - Abhishek Agarwal, TG Vishwa Prasad
Banner - Abhishek Agarwal Arts, People Media Factory
Music - Kala Bhairava
కొత్త కథలూ వుండవు..కొత్త రాగాలూ వుండవు..వున్న కథలనే అటు ఇటు తిప్పి కొత్తగా చెప్పాల్సి వుంటుంది. పాపులర్ రాగాలతోనే కొత్త పాటలు సృజించాల్సి వుంటుంది. రాజుగారు ఏడుగురు కొడుకులు కథ అయినా కొత్తగా చెప్పగలిగితే జనం చూస్తారు. ఈవారం విడుదలైన కార్తికేయ2 సినిమా కొత్త కథ కాదు. మోసగాళ్లకు మోసగాడు దగ్గర నుంచి చూసిన అనేకానేక ట్రెజర్ హంట్ సినిమాల మాదిరే. కానీ ట్రజర్ హంట్ సినిమాకు మన పురాణాలు, మన ఇతిహాసాలను జతచేసి, హైందవ ధర్మం టచ్ ఇస్తే అది కార్తికేయ 2 అవుతుంది.
ఓ బంగారు కడియం లేదా మహిమగల కాలి కడియం కోసం హీరో అండ్ కో వెదుకులాడారు అని కథ చెబితే కొత్తగా వుండదు. అదే ఆ కడియం శ్రీకృష్ణుడిది అని, ప్రపంచ సౌభాగ్య సూత్రాలు ఆ కడియంలో నిక్షిప్తమై వున్నాయని, అది సాధించడం అత్యవసరంమని చెప్పి, అప్పుడు నిధివేట సాగిస్తే, దానికి అప్పడప్పుడు హైందవ ధర్మం, విశిష్టత, ప్రాశస్త్యం జోడిస్తే… అప్పుడు కొత్తగా వుంటుంది. దర్శకుడు చందు మొండేటి చేసిన మొదటి చమక్కు ఇదే. నిధివేట సినిమాలు చాలా చూసేసాం అని ముందే చెప్పుకున్నాం కదా. సాధారణంగా అవన్నీ అడవుల్లో, ఎడారుల్లో సాగుతాయి. అలా కాకుండా ద్వారక, మధుర, గోవర్థనగిరి ఇలా పురాణ ప్రాశస్త్యం వున్న స్థలాలను ఎంచుకుని చిత్రీకరిస్తే…ఆ లుక్ వేరు. అదే చందు మొండేటి చేసిన రెండో చమక్కు. ఇక ముచ్చటైన మూడోది కూడా వుంది. అది పక్కాగా ఏదైతే చెప్ప దలుచుకున్నారో, చూపించదలుచుకున్నారో దానికి కట్టుబడి ముందుకు సాగడం. పదునైన స్క్రీన్ ప్లేను తయారు చేసుకోవడం. పక్క చూపులు చూడకపోవడం.
కార్తికేయ వన్ లోని డాక్టర్ కార్తికేయ క్యారెక్టర్ ఇందులో కొనసాగుతుంది. మొదటి సినిమా నుంచి రెండో సినిమా గ్యాప్ లో డాక్టర్ కార్తికేయ ఏం చేసాడు అన్నది కంటిన్యేషన్ దెబ్బతినకుండా సంక్షిప్తంగా చూపించిన తరుువాత అసలు కథలోకి వెళ్లారు. కృష్ణుడి నిర్యాణ సమయం కథను, యానిమేషన్ తో చిత్రీకరించారు. అలా కాకుండా కృష్ణుడి పాత్రకు ఎవరినైనా తీసుకుని, సెట్ లేదా సిజిలతో పౌరాణిక సీన్లు కూడా చిత్రీకరించి వుంటే సినిమాకు మైనస్ అయ్యేది. ఈ జనరేషన్ కు నచ్చే, నప్పే విధంగా యానిమేషన్ వాడడం మంచిది అయింది.
సినిమాకు వున్న రెండు మైనస్ లు ముందు చెప్పేసుకుంటే మంచి విషయాలు తరువాత చెప్పుకోవచ్చు. సినిమాకు ట్రెజర్ హంట్ లుక్ వుంది..ట్రజర్ హంట్ సినిమాల్లో మాదరిగానే కౌంటర్ టీమ్ కూడా వుంది. కానీ ఇక్కడ కౌంటర్ టీమ్ లక్ష్యం ఏమిటిన్నది మరింత క్లారిటీగా చెప్పి వుంటే బాగుండేది. ఇది ఒక మైనస్. తొలిసగం అంతా కథను ఎస్టాబ్లిష్ చేయడానికే వెచ్చించారు. మలిసగంలో ట్రజర్ హంట్ ను మరి కాస్త డిటైల్డ్ గా లేదా కాస్త సంతృప్తికరంగా చేసి వుంటే వేరుగా వుండేది. చటుక్కున అయిపోయిన ఫీలింగ్ కొంతమంది ప్రేక్షకులకు కలిగింది అంటే ఇదే కారణం.
పై రెండు మైనస్ లు వదిలేస్తే మిగిలినందా ప్లస్ నే. సినిమాకు నిడివి, క్రిస్ప్ గా తయారు చేసుకున్న స్క్రిప్ట్ అతి కీలకమైనది. దర్శకుడు ఏం తీయదలుచుకున్నాడో అదే తప్ప, ఒక్క అదనపు సీన్ తీయలేదు. అనసరపు పోకడలకు పోలేదు. కార్తికేయ వన్ లో హీరోయిన్ వుంది. ఆ హీరోయిన్ ను రిపీట్ చేయకుండా ఇక్కడ మరో హీరోయిన్ ను తీసుకున్నారు. అందువల్ల ఔచిత్యం దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డారు. అక్కడికీ యూత్ పల్స్ కోసం చిన్న చిన్న గమకాల్లాంటి లుక్స్ జోడించారు.
సినిమాకు రెండో ప్లస్ సంభాషణలు, మూడో ప్లస్ సినిమాటోగ్రఫీ, నాలుగో ప్లస్ నేపథ్యసంగీతం. ఈ మూడూ కూడా ది బెస్ట్ అవుట్ పుట్ అనిపించుకున్నాయి. కాలభైరవ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ చాలా బాగుంది. తెలుగులో మణిశర్మ, థమన్, కీరవాణి లాంటి వాళ్లు మాత్రమే మంచి బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ఇస్తారు. ఇప్పుడు ఈ జాబితాకు కాలభైరవ పేరు తోడయింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాను విజువల్ ట్రీట్ గా మలిచారు. సంభాషణలు డ్రమెటిక్ గా లేవు. బలవంతంగా చొప్పించినట్లు లేవు. ఉపన్యాసాలు ఇచ్చినట్లు కాకుండా సన్నివేశాల పరంగా వచ్చినట్లే వున్నాయి. అనుపమ్ ఖేర్ పాత్ర ద్వారా కృష్ణతత్వం గురించి వివరించిన తీరు జనాలకు పట్టేయడానికి అదే కారణం.
సినిమా అసలు కథలో ప్రవేశించిన దగ్గర నుంచి చివరి వరకు ఒకే టెంపోతో సాగేలా చేయడం అనే స్క్రీన్ ప్లే స్పెషాలిటీ దర్శకుడు చందు మొండేటి చేసాడు. ఇరవై ఒక్క క్లోట్ల ప్రొడక్షన్ కాస్ట్ లో ఇంత మంచి అవుట్ పుట్ ఇవ్వడం అన్నది కూడా మెచ్చుకోదగ్గ విషయమే. ముందుగా చెప్పిన రెండు మైనస్ లు కూడా సినిమాను వెనక్కు లాగేవి కాదు కానీ కాస్త ఆలోచిస్తే చిన్న అసంతృప్తి మిగిల్చేవి. అది కథా పరంగా లోపమే అని చెప్పక తప్పదు.
మైథలాజికల్ టచ్ తో వచ్చిన ఈ ట్రెజర్ హంట్ మూవీలో నిఖిల్ బాగా చేసాడు. పాత్ర ను పూర్తిగా ఆకళింపు చేసుకుని, ఆరంభం నుంచి చివరి వరకు ఒకటే క్యారెక్టరైజేషన్ ను మెయింటియన్ చేయడంలో మార్కులు పడతాయి. అనుపమ కూడ బాగా చేసింది. సపోర్టింగ్ పాత్రలు చేసిన వారంతా ఒకె కానీ విలన్ పాత్రకు మాత్రం సరైన దిశ, దశ లేదు.
మొత్తం మీద నిరుత్సాహపర్చదు..మంచి సినిమా చూసామనే భావన కలిగిస్తుంది కార్తికేయ 2
ప్లస్ పాయింట్లు
స్క్రీన్ ప్లే
సాంకేతిక విలువలు
సంభాషణలు
మైనస్ పాయింట్లు
సరైన కథను అల్లుకోలేకపోవడం
ఫినిషింగ్ టచ్: డివోషనల్ ట్రెజర్ హంట్
Rating: 3/5
Gulte Telugu Telugu Political and Movie News Updates