సమీక్ష…థాంక్యూ

2/5

2 Hrs 9 Mins   |   Love   |   22-07-2022


Cast - NagaChaitanya, Raashi Khanna, Malavika Nair, Avika Gor

Director - Vikram Kumar

Producer - Dil Raju

Banner - Sri Venkateswara Creations

Music - Thaman S

అర్థరాత్రి ఐడియా వచ్చిందని, అది బాగా నచ్చిందని, తెల్లవారి కూర్చుని కథ వండేయాలనుకుంటే సరిపోదు. ఆ వండిన కథలో దమ్ము వుండాలి. ఎక్కడెక్కడి నుంచో ఐడియాలు ఎత్తుకొచ్చి, మనకు వచ్చిన ఐడియాకు అతుకేసి అదే కథ అనుకోమంటే మరీ కష్టం. చూసే మనసుకూ కష్టం. జీవితంలో ఎత్తుకు ఎదిగిన మనిషికి అంతా నేనే..అంతా నాదే…అనేంత గర్వం పెరిగిపోతే, నెత్తిన కొమ్ములు వస్తే…అప్పుడు వెనక్కు తిరిగి చూసుకొవాల్సిన పరిస్థితి వచ్చి, ఎదుగుదలకు మెట్లుగా మిగిలిన వారిని వెదుక్కుంటూ వెళ్లి ‘థాంక్స్’ చెప్పడం అన్నది బేసిక్ గా కథకుడు బివిఎస్ రవి కి వచ్చిన ఐడియా. దానిని దర్శకుడు విక్రమ్ కుమార్ అండ్ టీమ్, బివిఎస్ రవి అండ్ టీమ్ కలిసి ఓ కిచిడి కథను వండారు.

కిచిడి కథ అని ఎందుకు అనడం అంటే… అభిరామ్ (నాగ్ చైతన్య) యాప్ తయారుచేసిన తరువాత అందులో నలుగురు స్నేహితుల భాగం కూడా వుండడం, అతనితో సహజీవనం చేసిన ప్రియ (రాశీఖన్నా) డబ్బు సాయం చేయడం ఇన్ఫోసిస్ నారాయమూర్తి గారి ఉదంతం గుర్తుకు తెస్తాయి. ఇన్ఫోసిస్ ను ఆయన అలాగే ప్రారంభించారు. కానీ ఆయన ఇక్కడ హీరోలా తనదే అంతా అని వారిని దూరం చేసుకోలేదు…అది వేరే సంగతి.

అలాగే యండమూరి వీరేంద్రనాధ్ రాసిన ఆనందో బ్రహ్మ నవల కూడా గుర్తుకువస్తుంది. కోనసీమలో నత్తితో బాధపడే ఫుట్ బాల్ ఆడే కుర్రాడు..అతనికి మానసిక ధైర్యాన్ని నూరిపోసే పక్కింటి అమ్మాయి…జీవితంలో పైకి ఎదిగిన తరువాత ఆ అమ్మాయిని వెదుక్కుంటూ చేసే ప్రయత్నం.

థాంక్యూ సినిమా కథ ఒక ఐడియాగా ఓకె. కానీ అక్కడ కూడా చిన్న కీలకమైన తేడా వుంది. రచయిత..దర్శకుడు మనకు సాయం చేసిన వారికి థాంక్స్ చెప్పమంటున్నారా? అలా చెబితే…రుణపడి వుండక్కరలేదా? థాంక్స్ వేరు గ్రాటిట్యూడ్ లేదా విశ్వాసం చూపించడం వేరు. థాంక్స్ చెప్పినంత మాత్రాన సరిపోదు. వారి పట్ల విశ్వాసంతో వుండి అవసరం అయినపుడు సాయం చేయగలగాలి. సినిమా తొలి ఎపిసోడ్ లో హీరో చేసింది అదే. హీరోయిన్ మాళవికతో తండ్రి మాట్లాడడం మానేస్తే, తాను వెళ్లి తిరిగి సరిచేయడం. తనకు అమెరికాలో సాయం చేసిన ప్రకాష్ రాజ్ కు చనిపోయిన తరువాత ఏదో విధంగా సాయం చేయడం. ఇదంతా గ్రాటిట్యూడ్ కు సంబంధించినది. థాంక్స్ అంటే సరిపోయేది కాదు.

సినిమా ఎత్తుగడ, తొలి ఎపిసోడ్ వరకు ఓకె అనిపించుకుంటుంది. పైగా పిసి శ్రీరామ్ రిచ్ విజువల్స్, కాస్త ఫ్రెష్ గా విలేజ్ ఎపిసోడ్, వీటన్నింటికి సమకూరిన థమన్ నేపథ్య సంగీతం కలిసి తొలిసగాన్ని చాలా వరకు పాస్ చేసేస్తాయి. ఫరవాలేదు ఓ ఫీల్ గుడ్ సినిమాను ఫ్లాట్ నెరేషన్ తో అయినా చూడబోతుతున్నాం అనే భావన కలిగిస్తాయి. అసలు ఇలాంటి స్క్రీన్ ప్లే కు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఇస్తారు..ద్వితీయ భాగం మీద ఎలా ఆసక్తి కలుగ చేస్తాడు దర్శకుడు అని అనుకోవాల్సి వస్తుంది. అనుకున్నట్లుగా, ఎటువంటి హంగామా..హడావుడి లేకుండానే విశ్రాంతి కార్డ్ పడిపోతుంది.

ద్వితీయసగం మొదలైన తరువాత ఇక సినిమా చూడడమే అనవసరం అనిపించేస్తుంది. కాలేజీ ఎపిసోడ్ మొత్తం మాస్ గా చిత్రీకరించామని దర్శకుడు, కథకుడు అనుకున్నారేమో కానీ, సవాలక్ష ఎపిసోడ్ లు చూసేసారు ఇలాంటివి ప్రేక్షకులు. మరి కొన్ని ఎపిసోడ్ లు రాసుకునే సత్తా లేకపోయిందో, లేక ఇది చాల్లే అనుకున్నారో, ఆ కాలేజీ ఎపిసోడ్ నే సాగదీసేసారు. అంటే మొత్తం మీద చూసుకుంటే తొలిసగంలో ఆరంభం..ఓ ఎపిసోడ్..మలిసగంలో మరో ఎపిసోడ్..ముగింపు అన్నమాట.

ఎప్పుడయితే మలిసగంలోని కాలేజీ ఎపిసోడ్ తేలిపోయిందో, క్లయిమాక్స్ ఊఢిపడినట్లయింది. ముందుగా ఊహించినట్లే రాశీ అబార్షన్ చేయించుకోకుండా హీరో చెంతకు చేరిపోవడంతో కథ ముగుస్తుంది.

సినిమాలో ప్రధాన లోపం సరైన ఎపిసోడ్ లు ప్లాన్ చేసుకోలేకపోవడం ఒకటి అయితే, నెరేషన్ ఫ్లాట్ గా సాగడం ఇంకొకటి. ఇవే ఎపిసోడ్ ల నెరేషన్ మరి కొంచెం భిన్నంగా కూడా చేసుకోవచ్చు. కానీ సో మెనీ కుక్స్ అన్నట్లుగా, ఇటు బివిఎస్ రవి టీమ్..అటు విక్రమ్ కుమార్ టీమ్ కలిసి ఇలా తయారు చేసాయి. అదే విధంగా ఎంత మెలోడీ సాంగ్స్ అయినా కాస్త క్యాచీ గా వినసొంపుగా వుండాలి. ఈ సినిమాకు అదే అతి పెద్ద మైనస్. సరైన పాట ఒక్కటి కూడా లేదు. నేపథ్య సంగీతం బాగా చేసిన థమన్ పాటల విష
యంలో ఫెయిలయ్యారు. కాలేజీ పాట అయితే జనాలు థియేటర్లోంచి లేచి వెళ్లిపోయేంత మూడ్ ను క్రియేట్ చేస్తుంది. కేవలం ఐడియా ను ఓ కథగా మార్చుకోవడంలో వచ్చిన లోపం తప్ప థాంక్యూకి మరే లోపం లేదు. కానీ ఆ ఒక్క లోపం చాలు సినిమాను, సినిమాకు వచ్చిన జనాలను పడుకోపెట్టేయడానికి.

ఇలాంటి సినిమాలో నాగ్ చైతన్య బాగానే నటించాడు. మరీ అంతగాడికి మరీ యాభై ఏళ్లవాడి మేకప్ వేేసేయనక్కరలేదు. ఎందుకంటే ఇప్పటి కుర్రకారు ముఫై లు దాటీ దాటకుండానే విజయాలు సాధిస్తున్నారు. మిగిలిన వాళ్లు ఓకె. రాశీఖన్నా మొహం ముందే పిసి శ్రీరామ్ తరచు కెమేరాపెట్టేయడం కాస్త ఇబ్బందిగానే వుంది. ఆయన ఫ్రేమ్ లు, విజువల్స్ ఎంత బాగున్నాయో, ఈ ఎక్స్ ట్రీమ్ క్లోజప్ లు అంత ఇబ్బందిగా వున్నాయి.

మొత్తం మీద సినిమా ఓ పెద్ద డిస్సపాయింట్ మెంట్. దిల్ రాజు జడ్జ్ మెంట్ కు, విక్రమ్ కుమార్ పనితనానికి.

ప్లస్ పాయింట్లు

సినిమాటోగ్రఫీ

బ్యాక్ గ్రవుండ్ స్కోర్

మైనస్ పాయింట్లు

ద్వితీయార్థం

స్క్రిప్ట్

ఫినిషింగ్ టచ్ : క్లా ’సిక్’ మూవీ