సమీక్ష – ది వారియర్

2/5

2 Hrs 35 Mins   |   Action   |   14-07-2022


Cast - Ram Pothineni, Aadhi Pinisetty, Krithi Shetty, Akshara Gowda, Nadhiya and others

Director - N. Lingusamy

Producer - Srinivasa Chitturi

Banner - Srinivasa Silver Screen

Music - Devi Sri Prasad

తాతల మూతుల నేతి వాసన చూడడం అంటే ఇదే. ఎప్పుడో బాగా కాయలు కాసిందని ఎండిపోయిన చెట్టును ఇంకా సాకడం అన్నా ఇదే. ఒకప్పుడు పందెంకోడి, రన్ లాంటి సినిమాలు అందించారు దర్ళకుడు లింగుస్వామి. ఈ మధ్య ఫ్లాపులే అందిస్తూ వస్తున్నారు. అలాంటి డైరక్టర్ దగ్గర ఇంకా ఏదో విషయం వుండే వుంటుందని భ్రమించి హీరో రామ్ అవకాశం ఇచ్చారు. తన మూతికి పాత నేతి వాసన తప్ప కొత్తగా ఏమీ మిగలలేదని రుజవు చేసేసారు లింగుస్వామి. ఇదా సినిమా, ఇదా కథ, ఇదా స్క్రీన్ ప్లే, అని ప్రతి ఒక్కరు పెదవి విరిచేంత దారుణమైన సినిమా తీసి థియేటర్లో పెట్టారు. సినిమా అంటే కేవలం ఒక్క పాయింట్ వుంటే సరిపోదు. దాని చుట్టూ సరైన సీన్లు, బ్లాక్ లు, లేయర్లు అల్లుకుంటూ జవసత్వాలు అందించాలి, అప్పుడే అది అలరిస్తుంది అన్నది మరిచిపోయారో లేదా చేతకాలేదో, మొత్తానికి ఏదో అయింది. వారియర్ అనే పేరు గొప్ప సినిమాను అందించారు.

వారియర్ సినిమాలో కథ వుంది. కానీ పరమ పాత చింతకాయపచ్చడి.

వారియర్ సినిమాకు స్క్రీన్ ప్లే..పరమ అమెచ్యూర్.

వారియర్ సినిమాలో సీన్లు…ఇప్పటికి సవాలక్షసార్లు చూసినవే.

వారియర్ సినిమాలో కంటెంట్ అణుమాత్రం కొత్తది కాదు.

డాక్టర్ అయిన హీరో హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తాడు. అక్కడ ఓ భయంకరమైన గూండా. వాడిని ఎదుర్కోలేక వెనక్కు వెళ్లి ఐపిఎస్ రెండేళ్లలో చదివి పోలీసాఫీసరై వెనక్కు వచ్చి వాడి ఆటకట్టిస్తాడు. కర్నూలులో హీరోయిన్ రేడియో జాకీ. ఆమెతో ప్రేమాయణం. ఇదీ కథ.

ఇలా కథ ఎవరు చెప్పినా, ఏ హీరో డేట్లు ఇచ్చినా దండం పెటొచ్చు. కానీ ఇక్కడ చెప్పింది లింగస్వామి. అందుకే రామ్ డేట్ లు ఇచ్చేసాడు. ఆయన సినిమా తీసి ఇచ్చేసాడు. అంతే తప్ప ఆ లైన్ సరిపడా సరైన సీన్లు రాయలేదు. లేయర్లు అల్లలేదు. విలనిజం, యాక్షన్ బ్లాక్ లు పక్కన పెడితే లవ్ ట్రాక్ కానీ, మిగిలిన సీన్లు కానీ చూస్తే ఈయనేనా గతంలో అన్ని సినిమాలు తీసింది అన్న అనుమానం కచ్చితంగా కలుగుతుంది.

వారియర్ తొలి సగం మెల్లగా మొదలవుతుంది. తెర తెరచుకుంటేనే పాతకాలంలో మాదిరిగా హీరో ఇంట్రడక్షన్ సీన్..ఆ వెంటనే పాట. ఆ ఇంట్రడక్షన్ సీన్ కు బుర్రా రాసిన మాటలు అమోఘం. అక్కడి నుంచి క్లాస్ టచ్ తో మెల్లగా ముందుకు సాగి ఇంట్రవెల్ కు చేరుకుంటుంది. సరే, డాక్టర్ క్యారెక్టర్ కనుక మెత్తగా, మెల్లగా సాగింది. పోలీస్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఇంక సినిమా దుమ్ము దులిపేస్తుంది అనుకుని సెకండాఫ్ లోకి వెళ్తాడు ప్రైక్షకుడు.

అక్కడ నుంచి నిజంగా సినిమా చూపించేసాడు దర్శకుడు. దేవీశ్రీప్రసాద్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాదేస్తుంటాడు. కానీ సీన్లలో మాత్రం దమ్ము వుండదు. రెండూ సింక్ కావు. విలన్ లుంగీ ఎగ్గొట్టుకోవడం, హీరో మీసాలు దువ్వుకోవడం తప్ప సీన్లలో సత్తా అన్నది పొరపాటున కూడా కనిపించదు. ఒక్క చిన్న సీన్ చెప్పుకుందాం..సరదాకి..’’ హీరో తల్లి బజార్లో కూరగాయలు కొంటూ వుంటుంది..విలన్ వచ్చి, నమస్కారం పెట్టి, కొడుకును జాగ్రత్తగా వుండమని చెప్పమ్మా అంటాడు. దానికి ఆమె కూడా హీరో లెవెల్ లోనే డైలాగులు కొడుతుంది’’ ఇలాంటి సినిమా తెలుగు సినిమా పుట్టిన తరువాత ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పండి? హీరోయిన్ ను గూండాలు ఎత్తుకుపోతే అస్సలు పోన్ లు అన్నీ ఆపేసుకుని , మౌనంతో సాధించే సీన్, అరవింత సమేతలో సీన్ ను గుర్తుకు తెస్తుంది. ఈ సీన్ నే కాదు సినిమాలో ప్రతి సీన్ కూడా ఎక్కడో ఒక దగ్గర చూసేసి, అరిగిపోయినట్లే వుంటుంది.

సినిమా మొత్తం కర్నూలు కొండారెడ్డి బురుజు చుట్టూనే తిరుగుతూ వుంటుంది. హీరో..విలన్..హీరోయిన్..వంద మంది రౌడీ బ్యాచ్..అంతే. రంగుల రాట్నంలా అటు ఇటు అక్కడిక్కడే తిరుగుతూ వుంటుంది. సీన్లు కొత్తగా వుండక, స్క్రీన్ ప్లే కొత్తగా లేక, అవే మొహాలు, అదే చోట, రెండున్నర గంటలు జనం ఎలా చూస్తారని అనుకున్నారో అనుభవజ్ఙులైన దర్శకుడు, నిర్మాత కూడా.

ఇలాంటి సినిమాకు అదృష్టం ఏమిటంటే తొలిసగంలో రెండు పాటలు, మలిసగంలో రెండు పాటలు కూడా బాగుండడం. అంతకు మించిన లక్ మరొటి సినిమాలో లేదు. మిగిలినదంతా బ్యాడ్ లక్ నే.

రామ్ ఎనర్జిటిక్ గా బాగానే చేసాడు. తనదంటూ ఓ స్టయిల్ వుండేలా చూడాలనుకున్నాడు. కృతి శెట్టి మీద మరీ అన్ని క్లోజ్ లు వేయడం కాస్త ఇబ్బందిగానే వుంది. స్క్రీనంతా నోరే అన్నట్లు వుంది. ఆది పినిశెట్టి తమిళం వెర్షన్ ను దృష్టిలో పెట్టుకుని నటించినట్లున్నాడు. ఆది రొమాన్స్ సీన్ చూస్తే గతంలో మణిరత్నం సినిమాలో మాధవన్ గుర్తుకు వచ్చాడు.

మొత్తం మీద ది వారియర్… ‘నమ్మరాదే..సీనియర్లను ఇక నమ్మరాదే’ అని పాటేసుకునేలా వుంది.

ప్లస్ పాయింట్లు

పాటలు

మైనస్ పాయింట్లు

మిగిలినవన్నీ

ఫినిషింగ్ టచ్: వారియర్…ది ఫెయిల్యూర్

Rating: 2/5