సమీక్ష – రిపబ్లిక్

2.5/5

2 hrs 32 Mins   |   Political Drama   |   01-10-2021


Cast - Sai Tej, Aishwarya Rajesh, Jagapathibabu, Ramya krishna

Director - Dev Katta

Producer - J Bhagawan, J Pulla Rao, Zee Studios, JB Entertainments

Banner - JB Entertainments

Music - Manisharma

కాస్సేపు సినిమా పడికట్టు సూత్రాలు అన్నీ పక్కన పెట్టి ఆలోచిద్దాం.  జ్యుడిషియరీ, లెజిస్లేచర్, రిపబ్లిక్ ఇలాంటి పదాలను విరివిగా వినడానికి సిద్దపడదాం. అప్పుడు మీకు రిపబ్లిక్ సినిమా ఓ హానెస్ట్ అటెంప్ట్ అనిపిస్తుంది. కానీ అదే సమయంలో కాస్త చాదస్తం కూడా అనిపిస్తుంది. అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నం తినిపించేయకూడదు. మెలమెల్లగా అలవాటు చేయాలి.  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దానికి భావసారూప్యంగా అతి పెద్ద మంచినీటి చెరువు తెల్లేరు. దాన్ని రాజకీయ నాయకులు కలుషితం చేసారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థను కలుషితం చేసినట్లే. దాని ప్రక్షాళన ఎలా సాధ్యం? రాజకీయ వ్యవస్థ చేతుల్లో బందీ అయిన, ఆడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ ధైర్యం చేస్తే తప్ప సాధ్యం కాదు. కానీ ధైర్యం చేసినా కూడా వ్యవస్థ అర్జెంట్ గా మారిపోదు. అది అలాగే కలుషిత తెల్లేరులా వుండిపోతుంది.

ఇదీ దర్శకుడు దేవా కట్టా చెప్పిన రిపబ్లిక్ కథ. ఈ కథ ఎలా చెప్పాడో చూద్దాం. అభి (సాయితేజ్) చిన్నప్పటి నుంచి నిజాయతీని ప్రేమిస్తూ, కుళ్లిన వ్యవస్థను ద్వేషిస్తూ పెరిగిన కుర్రాడు. తండ్రి దశరథ్ (జగపతిబాబు) ఓ కరెప్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్. తెల్లేరు సరస్సును తన గుప్పిట్లో పెట్టుకుని, రైతులను, మత్స్య కారులను రెండుగా విభజించి, రాజకీయం చేస్తూ, కోట్లకు కోట్లు ఆర్జించే నాయకురాలు విశాఖ వాణి (రమ్యకృష్ణ). ఆమె కొడుకు సిఎమ్.

ఇలాంటి నేపథ్యంలో అభి ఐఎఎస్ అధికారిగా మారి విశాఖ వాణి ప్రాంతానికే కలెక్టర్ గా వస్తాడు. వ్యవస్థను మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఆ ప్రయత్నంలో చివరకు గెలిచాడా? ఓడాడా? అన్నది మిగిలిన కథ.

సినిమా ఆరంభం నుంచి చివరి వరకు దర్శకుడు దేవా కట్టాకు వ్యవస్థ మీద వున్న ఆలోచనా విధానం నడుస్తూనే వుంటుంది. దాన్ని ఎలా మార్చాలా అనే ఆవేదన వినిపిస్తూనే వుంది. రాజకీయ వ్యవస్థ కబంధ హస్తాల్లో చిక్కుకున్న అధికారిక, న్యాయ వ్యవస్థలు స్వేచ్ఛగా పని చేస్తే తప్ప వ్యవస్థ బాగుపడదు అనే క్లారిటీ కనిపిస్తుంది. దేవా కట్టా నిజాయతీని కానీ, సాయి తేజ్ తో సహా అందరి నటుల ప్రయత్నం కానీ, మణిశర్మ నేపథ్యం సంగీతం, సినిమాటోగ్రాఫర్ పనితనం ఇలా దేనికీ వంక పెట్టేది లేదు.

కానీ ఇన్ని వున్నా కూడా సినిమాలో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ వుండదు. పోటీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ లేకపోయినా ఫరవాలేదు. ప్రస్థానం మాదిరగా ఎమోషన్లు క్యారీ అయ్యాయి. ప్రేక్షకుడు వాటితో కనెక్ట్ అయ్యాడు అని అనిపించుకుంటే ఓకె. కానీ ఇక్కడ అదీ లేదు.

ప్రస్థానంలో తండ్రి..ఇద్దరు కొడుకులు. కాస్త నేపథ్యంలో చోటు చేసుకునే కథ. కానీ రిపబ్లిక్ లో అలా కాదు. చాలా కథ వుంది. ఉపకథలు వున్నాయి. నేపథ్యాలు వున్నాయి. ఇంకా చాలా చాలా వున్నాయి. పైగా అవన్నీ అండర్ కరెంట్ గా మేథావితనం రంగరించిపోసినవి. ప్రేక్షకులకు ఇన్ స్టాంట్ గా నచ్చే లౌడ్, కమర్షియల్, పొలిటకల్ ఫార్మాట్ కాదు. పోనీ ఆ విషయం కూడా అలా పక్కన వుంచేసినా, సినిమాలో పేక్షకుడు విపరీతంగా కదిలిపోయే, లేదా తనతో తీసుకెళ్లే సీన్ ఒక్కటి కూడా లేదు. ఆఖరికి హీరో విషాదాంత ముగింపు తో సహా.

ఏటికి ఎదురీదినట్లు సినిమాకు అలాంటి ముగింపు ఇవ్వాలనుకున్నపుడు ప్రేక్షకుడు లోలోపల ఎంత కదిలిపోవాలి. ఎంత బరువైన హృదయంతో థియేటర్ బయటకు రావాలి? ఏదీ అలాంటి వ్యవహారం ఎక్కడ? సరే, ఈ సంగతీ అలా వుంచుదాం. తప్పు మనుషులది కాదు, వారిని అలా మార్చేస్తున్న వ్యవస్థది అని చెప్పడానికి ప్రతి నెగిటివ్ క్యారెక్టర్ కు ఓ ఫ్లాష్ బాక్. సినిమాటిక్ అంశాలన్నీ డస్ట్ బిన్ లో పడేసి, సీరియస్, థియరిటికల్, ఎమోషన్ కంటెంట్ ను తను పేపర్ మీద ఏ విధంగా రాసుకున్నారో అలాగే తీసుకుంటూ వెళ్లారు.

కానీ ఈ పిహెచ్డీ థియరీ అనేది నవలగా చదవించేదిగా వుండదని దేవాకు తెలిసే వుంటుంది. అలాంటపుడు వీలయినంత వరకు ఇంకా క్రిస్ప్ గా, షార్ప్ గా చెప్పే ప్రయత్నం చేసి వుండాల్సింది. అది కూడా చేయలేదు. ఎక్కడో మొదలుపెట్టి, సినిమాకథను ఒక పాయింట్ దగ్గర లాక్ చేయడానికి విశ్రాంతి వరకు నడపాల్సి వచ్చింది.

విశ్రాంతి తరవాత సూపర్ పవర్ కలెక్టర్ అన్నది చెప్పడం కోసం లాజిక్ లను దూరం పెట్టాల్సి వచ్చింది. ఐఎఎస్ కు ఎంపికైన వారు కలెక్టర్ కావడానికి కనీసం కొన్నేళ్లు పడుతుందని విస్మరించారు. నిజానికి దేవా ఆలోచన వేరు కేంద్రం తనకు నచ్చని రాష్ట్రాన్ని కట్టడి చేయడం కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకోవడం అలవాటు. ఇక్కడ అలా చెప్పలేక, కలెక్టర్ గా మార్చారని అనుకోవాలి. అందుకే దానికి సూపర్ పవర్స్ ఇచ్చారు.

ఇన్ని చేసినా కూడా క్లయిమాక్స్ దగ్గరకు వచ్చేసరికి రాసుకున్న కాగితాలు అన్నీ పక్కన పెట్టి, చివర్న వున్న నాలుగైదు పేజీలు మాత్రం పిక్చరైజ్ చేసారు అనిపిస్తుంది. కోర్టు విచారణ ఊడిపడడం, న్యాయం జరగడం, కానీ అంతలోనే మళ్లీ అన్యాయం అయిపోవడం. విశాఖ వాణి నోటి వెంట వ్యవస్థ మారదు అనిపించడం. వీటి మధ్యలో మహరాష్ట్ర శివసేన వ్యవహారాలు, ఇంకా అనేక సమకాలీన రాజకీయ నిర్ణయాలు, సంఘటనలు చొప్పించడం.

వ్యవస్థ మీద హానెస్ట్ గా కథ చెప్పాలనుకున్న దేవా కట్టా, కేవలం విశాఖ వాణిని టోటల్ రాజకీయ వ్యవస్థకు ప్రతినిధిగా చూపించేసారు. ఇక పొరపాటున కూడా వర్తమాన రాజకీయాల జోలికిపోలేదు. అనేకానేక కట్టుబాట్ల నడుమే ఆయన కథను చెప్పాలనుకున్నారు. దాంతో చెప్పాల్సినవి చాలా చెప్పలేకపోయారు. చెప్పిన వాటిలో కూడా కట్ షార్ట్ చేయాల్సిన వాటికి బదులు, డిటయిలింగ్ ఎక్కువయిపోయింది.

దీంతో టోటల్ గా సినిమా బావుందా అంటే ప్రేక్షకుడు సీరియస్ గా మొహంపెట్టి, మేధావిలా…’గుడ్ అటెంప్ట్..హానెస్ట్ అంటెంప్ట్’ లాంటి ఓ లేబుల్ డయిలాగు పడేసి చక్కాపోవాలి. అంతే. బాలేదు అనలేరు. ఎందుకంటే వ్యవస్థలాగే ప్రేక్షకుడిని కూడా మార్చలేం కదా ?

ఇలాంటి సినిమాలో హీరోగా సాయి ధరమ్ తేజ్ బాగా చేసాడు. జగపతిబాబు ఓకె. రమ్యకృష్ణ బిల్డప్ ఎక్కువ. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ బాగున్నాయి. ఆర్ఆర్ సినిమాను వీలయినంత లేపే ప్రయత్నం చేసింది. టొటల్ గా జనం కోరినది మనం చేయవలెనా..మనం చేసినది జనం చూడవలెనా? అన్న పాయింట్లలో రెండో దాని వైపు మొగ్గి దర్శకుడు దేవా కట్టా చేసిన ప్రయత్నం..రిపబ్లిక్.

ప్లస్ పాయింట్లు
కథలో కోర్ పాయింట్
సిన్సియర్ అటెంప్ట్

మైనస్ పాయింట్లు
సింగిల్ మోడ్ టేకింగ్
నాన్ కమర్షియల్ టచ్

ఫినిషింగ్ టచ్ : హానెస్ట్.. అటెంప్ట్

Rating: 2.5/5