1.75/5
2 Hr 32 Mins | Action | 15-08-2024
Cast - Vikram, Parvathy Thiruvothu, Malavika Mohanan, Pasupathy and others
Director - Pa. Ranjith
Producer - K.E. Gnanavelraja, Neha Gnanavelraja
Banner - Studio Green
Music - G.V. Prakash Kumar
హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువున్నా చియాన్ విక్రమ్ అంటే తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అపరిచితుడుతో మొదలుపెట్టి పొన్నియిన్ సెల్వన్ దాకా దాన్ని వివిధ రూపాల్లో చూస్తున్నాం. అందుకే తంగలాన్ మీద కాస్తో కూస్తో హైప్ నెలకొంది. టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు మూడు పోటీలో ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ నమోదయ్యాయంటే విక్రమ్ బ్రాండ్ ఇమేజే దానికి కారణం. దర్శకుడు పా రంజిత్, జివి ప్రకాష్ కుమార్ సంగీతం లాంటి పేర్లు అంచనాలు పెంచడానికి ఉపయోగపడ్డాయి. మరి కోరుకున్న కనికట్టు జరిగిందా
కథ
భారతదేశాన్ని బ్రిటిషర్లు రాజ్యమేలుతున్న కాలంలో వేల్పూర్ గ్రామం దగ్గర బంగారు నిక్షేపాలున్న సంగతి ప్రభుత్వానికి తెలుస్తుంది. దాన్ని వెలికి తీసి ఇస్తే వాటాతో పాటు భూములు రాసి ఇస్తానని ఆఫీసర్ క్లెమెంట్ (డేనియల్ కాల్టరిగోన్) ఆ జాతికి నాయకుడిగా చెలామణి అవుతున్న తంగలాన్ (విక్రమ్) కు ఆఫర్ ఇస్తాడు. దాన్ని గుడ్డిగా నమ్మిన అతను మొత్తం జనాన్ని తీసుకుని ఏనుగుల కొండ దగ్గరకు చేరుకుంటాడు. అయితే బంగారాన్ని ఆరతి (మాళవిక మోహనన్) అనే దెయ్యం కాపు కాస్తూ ఉంటుంది. ఎవరైనా దొంగతనం చేయడానికి వస్తే వందలాది పాములతో చంపిస్తుంది. దీని వెనుక తంగలాన్ తాతల నాటి గతమొకటి ఉంటుంది. తర్వాత జరిగేదే అసలు స్టోరీ.
విశ్లేషణ
కుల వివక్ష మీద తనదైన శైలిలో వెండితెరపై గళమెత్తే దర్శకుడు పా రంజిత్. సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు అవకాశాలిస్తే వాటిలోనూ తన భావజాలాన్ని చూపించిన ధైర్యశాలి. రంజిత్ ఆలోచన ధోరణి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండకపోయినా అతని నిజాయితీ అభిమానులను సంపాదించి పెట్టింది. తంగలాన్ చాలా సాహసోపేతమైన ప్రయత్నం. ఎక్కడో పుస్తకాల్లో చదివితే తప్ప తెలుసుకోలేని, చరిత్రలో కలిసిపోయిన ఒక పాత ప్రపంచాన్ని చూపించాలని ఈ సబ్జెక్టు రాసుకున్నాడు. అమాయకత్వం తప్ప మరేమి తెలియని అనాగరికుల సమూహాన్ని ఎలా అణిచివేశారో చెప్పడమే తంగలాన్ ప్రధాన ఉద్దేశం. దానికి కెజిఎఫ్ తరహా నేపథ్యం తీసుకున్నాడు.
కనీసం కట్టుకోవడానికి సరైన బట్టలు లేని జనం నివసించే గూడెంని పరిచయం చేయడంతో సినిమా మొదలుపెట్టిన పా రంజిత్ ఎక్కువ హడావిడి లేకుండా విక్రమ్ ఇంట్రోని చాలా సింపుల్ గా చూపిస్తాడు. రాత్రి పూట పిల్లలకు బంగారు నిక్షేపాలు, దానికి కాపలాగా ఉన్న దెయ్యం గురించి చందమామ కథలా చెప్పడం లాంటి సీన్లు కొంత విభిన్న అనుభూతిని అందిస్తూ ఫస్ట్ ఇంప్రెషన్ కలిగిస్తాయి. తంగలాన్ తాత ఫ్లాష్ బ్యాక్ ని హ్యాండిల్ చేసిన తీరు బాగా వచ్చింది. విఎఫెక్స్ విషయంలో రాజీ పడిన తీరు క్వాలిటీని తగ్గించేసినప్పటికీ పా రంజిత్ స్క్రీన్ ప్లేకి ముందే ప్రిపేరై వచ్చిన ప్రేక్షకులను మరీ విసుగెత్తించకుండా నడిచింది. అసలు సమస్య తర్వాతొచ్చింది.
బ్రిటిష్ దొర ఎప్పుడైతే తంగలాన్ బృందాన్ని కొండకు తీసుకొచ్చి తవ్వకాలు మొదలుపెడతాడో అక్కడి నుంచి డ్రామా తాలూకు గ్రాఫ్ తగ్గుతూ వెళ్లిపోయింది. ఎంతసేపూ పాములు కాటేయడం, ఆరతి ఆత్మ రూపంలో వచ్చి భయపెట్టడం తప్ప మరీ ఎగ్జైటింగ్ గా అనిపించే ఎపిసోడ్స్ పెద్దగా ఉండవు. అప్పట్లోనూ అగ్ర కులాల అహంకారం తీవ్రంగా ఉండేదని ఇంగ్లీష్ దొర పక్కన ఉండే అసిస్టెంట్ పాత్రని సృష్టించడం లాంటివి చేయడం ద్వారా పా రంజిత్ తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. సమాజంలో గౌరవం దక్కాలంటే బ్రాహ్మణత్వాన్ని బలవంతంగా అయినా తీసుకోవాలని పశుపతి క్యారెక్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఇలాంటివి బోలెడున్నాయి.
ఇంటర్వెల్ దాకా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ పొందినట్టు అనిపించినా అటుపై బలమైన స్టోరీ మెటీరియల్ లేకపోవడం వల్ల పా రంజిత్ సింగల్ థ్రెడ్ మీద ఆధారపడాల్సి వచ్చింది. దీంతో కథనం ఫ్లాట్ గా వెళ్ళిపోయి క్రమంగా బోర్ కొట్టేందుకు దారి తీసింది. కాంతార తరహాలో వావ్ అనిపించే అంశాలకు చోటిచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు ఆ అవకాశాన్ని వాడుకోలేదు. దాని ఫలితంగా ఉద్వేగం కలిగించే సీన్లు కానీ, అప్రతిభులను చేసే ఎపిసోడ్లు కాని పడలేదు. ఒకపక్క మనసులో మెచ్చుకుంటూనే మరోపక్క అంతే స్థాయిలో రెట్టింపు అసంతృప్తి మనసును తొలిచేస్తూ ఉంటుంది. దీంతో తంగలాన్ అన్ని వర్గాలను మెప్పించలేకపోయాడు.
రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వెళ్లే పా రంజిత్ లాంటి వాళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కానీ థియేటర్ కొచ్చే క్లాసు, మాసు అందరికీ అర్థమయ్యేలా కథలు రాసుకోవాల్సిన ఆవశ్యకత దర్శకులకూ ఉంది. టైం మెషీన్ లో వెనక్కు వెళ్లి షూటింగ్ చేశారా అనిపించేంత సహజంగా లొకేషన్లు, వందలాది జూనియర్ ఆర్టిస్టులతో ఇంత పెద్ద రిస్కుతో షూటింగ్ చేయడం మాటలు కాదు. కానీ టికెట్లు కొనే పబ్లిక్ సంతోషపడేందుకు అవి మాత్రమే సరిపోదు. యూట్యూబ్ లోనూ అలాంటివి దొరుకుతాయి. తెర డిమాండ్ చేసే డ్రామాని సరైన మోతాదులో పండించినప్పుడే ఇలాంటివి క్లాసిక్స్ గా నిలుస్తాయి. లేదంటే కేవలం ప్రశంసలు, అవార్డులు మిగులుతాయి.
నటీనటులు
చియాన్ విక్రమ్ నటనా ప్రతిభకు ఎన్ని ప్రశంసలు అందించినా తక్కువే. మూడు కాలాల్లో మూడు షేడ్స్ లో కనిపించిన వైనం అద్భుతం. ప్రయోగాలకు ఎప్పుడూ సై అనే ఈ విలక్షణ నటుడు ఒక యాక్టింగ్ డిక్షనరీ లాంటి వాడు. పోస్టర్ గెటప్ లోనే అబ్బురపరిచిన మాళవిక మోహనన్ గుర్తుపట్టలేని విధంగా భయపెట్టింది. అయితే బిల్డప్ ఇచ్చిన స్థాయిలో తగినంత స్కోప్ లేకపోవడంతో ప్రత్యేకంగా గుర్తుంచుకునే అవసరం పడలేదు. పశుపతి సీనియారిటీ బాగా ఉపయోగపడింది. తంగలాన్ భార్యగా నటించిన పార్వతి తిరువోతు రూపంలో మరో బెస్ట్ పెర్ఫార్మర్ పరిచయమయ్యింది. బ్రిటిష్ నటులు న్యాచురల్ గా ఉన్నారు. క్యాస్టింగ్ చాలా బాగా కుదిరింది.
సాంకేతిక వర్గం
జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీమ్ కు తగ్గట్టు సాగింది. మరీ గొప్పగా కాదు కానీ ఉన్నంతలో మూడ్ పక్కకెళ్ళకుండా ఇచ్చాడు. పాటలు తక్కువే ఉన్నా మళ్ళీ వినాలనిపించేవి లేకపోవడం లోటే. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీకి పురస్కారాలు ఖాయం. బీడువాడిన లొకేషన్లను అత్యంత సహజంగా చూపించడంలో ఆర్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి పోటీ పడిన వైనం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. సెల్వ ఆర్కె ఎడిటింగ్ నిడివిని కొంత నియంత్రించాల్సింది. ఎస్ఎస్ మూర్తి కళాపనితనం బాగుంది. స్టన్నర్ శ్యాం పోరాటలు చక్కగా వచ్చాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా సాగాయి. ఇలాంటి బ్యాక్ డ్రాప్ మీద ఇంత ఖర్చు పెట్టడం సాహసమే.
ప్లస్ పాయింట్స్
విక్రమ్ అద్భుత నటన
నేపథ్యం
క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్
నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే
లోపించిన నాటకీయత
మలుపులు లేకపోవడం
ఫినిషింగ్ టచ్ : ప్రభావం లేని ప్రయోగం
రేటింగ్ : 1.75/ 5