2.5/5
2 hrs 27 mins | Comedy | 23-08-2024
Cast - Rao Ramesh, Ankith Koyya, Indraja, Ramya Pasupuleti, Harsha Vardhan, Ajay and others
Director - Lakshman Karya
Producer - Mohan Karya, Bujji Rayudu Pentala
Banner - PBR Cinemas & Lokamhatre Cinematics
Music - Kalyan Nayak
ఆగస్ట్ నెలలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఒకపక్క మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి బడా మూవీస్ బోల్తా కొడుతుంటే అంచనాలు లేని కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ సంచలన విజయం సాధించాయి. ఎవరినీ తక్కువంచనా వేయకూడదనే పాఠం నేర్పించాయి. అందుకే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మీద క్రమంగా ఆసక్తి మొదలైంది. సుకుమార్ భార్య తబిత నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడంతో ప్రీ రిలీజ్ వేడుకకి అల్లు అర్జున్ అతిథిగా వచ్చాడు. అప్పట్నుంచే జనం దృష్టిలో పడ్డ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఎలా ఉన్నాడంటే.
కథ
ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే పట్టుదలతో ఉన్న సుబ్రహ్మణ్యం (రావు రమేష్)కు ఒక అవకాశం చేయి దాకా వచ్చి కోర్టు గొడవ వల్ల జారిపోతుంది. నిరుద్యోగిగా సతీమణి (ఇంద్రజ) సంపాదన మీద బ్రతికేస్తూ ఉంటాడు. వారసుడు అర్జున్ (అంకిత్ కొయ్య) కి పెళ్లీడు వయసొచ్చినా ఇతని జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. సుపుత్రుడేమో కాంచన (రమ్య) ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా ఓ రోజు అనుకోకుండా సుబ్రహ్మణ్యం ఎకౌంటులో పది లక్షల డబ్బు పడుతుంది. భార్య ఊళ్ళో ఉండదు. దీంతో తండ్రి కొడుకులు దాన్ని ఖర్చు చేయడం మొదలుపెడతారు. సొమ్ము ఎవరిది, అర్జున్ ప్రేమకథ, సుబ్రహ్మణ్యం జాబు తదితర ప్రశ్నలకు సమాధానమే స్టోరీ
విశ్లేషణ
నిశితంగా గమినించాలే కానీ మన చుట్టూ జరిగే మధ్యతరగతి మహాభారతాల నుంచే బోలెడు కంటెంట్లు పిండుకోవచ్చు. థియేటర్ కొచ్చే ప్రేక్షకుల్లో అధిక శాతం ఈ క్యాటగిరీనే కాబట్టి వాళ్ళను కనెక్ట్ అయితే చాలు హిట్టు కొట్టేయొచ్చు. దర్శకుడు లక్ష్మణ్ కార్య ఆ ఆలోచనతోనే మారుతినగర్ సుబ్రహ్మణ్యంని రాసుకున్నాడు. నిత్యం పేపర్లలో చదివే వెరైటీ మోసాలకు కామెడీ టచ్ ఇచ్చి మొదటి నుంచి చివరిదాకా టైం పాస్ చేయించే ఉద్దేశంతో దీన్ని తెరకెక్కించాడు. క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడం దగ్గరి నుంచి క్రమంగా పేర్చుకుంటూ పోయిన సంఘటనలు సహజత్వానికి అసహజత్వానికి మధ్య ఊగిసలాడుతూ పర్వాలేదనిపించేలా జరుగుతూ ఉంటాయి.
యూత్ ని టార్గెట్ చేసుకోవడం కోసం అర్జున్,కాంచన ప్రేమకథను నడిపించిన దర్శకుడు దాన్ని ఎంగేజింగ్ గా మలచడంలో తడబడ్డాడు. దీంతో ఇది పంటి కింద రాయిలా మారడం తప్ప సుబ్రహ్మణ్యంకు చేసిన మేలేమి లేదు. భార్య జీతం మీద బ్రతికే మగరాయుళ్ళు సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. రావు రమేష్ క్యారెక్టరైజేషన్ దీని మీద డిజైన్ చేసుకున్న లక్ష్మణ్ కార్య అతన్నో వ్యసనపరుడిగా కాకుండా హాస్యంతో నడిపించాలని దృష్టి పెట్టడం వల్ల అవసరం లేని వ్యసనాలు, పైత్యాలు లేవు. అయితే ఇలాంటి వాటిలో ఎమోషనల్ బ్యాలన్స్ చాలా ముఖ్యం. ఎంత నవ్విస్తున్నా ప్రధాన పాత్రల తాలూకు భావోద్వేగం మనల్ని తాకేలా ఉండాలి.
ఇమేజ్ లేని ఆర్టిస్టు టైటిల్ రోల్ చేయడంతో డైరెక్టర్ గా తనకు దొరికిన సృజనాత్మక స్వేచ్ఛని లక్ష్మణ్ పూర్తి స్థాయిలో వాడుకోలేదు. రావు రమేష్ అలవోకగా సన్నివేశాలు పండిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని ఎపిసోడ్లు రాసుకున్నట్టు అనిపిస్తుంది తప్ప నిజానికి అవసరం లేనివి కూడా ఉన్నాయి. ఇవి ఫ్లోకి స్పీడ్ బ్రేకర్స్ గా మారాయి. కథనం పేర్చుకునే క్రమంలో చేసిన పొరపాట్లు ఇంప్రెషన్ తగ్గించాయి. సుబ్రహ్మణ్యం ఎలాంటి వాడో రిజిస్టర్ చేసే క్రమంలో ఆ క్యారెక్టర్ ని ఇష్టం వచ్చిన రీతిలో మార్చుకుంటూ పోవడంతో ప్రత్యేకంగా అతని మీద ఎలాంటి పాజిటివ్ లేదా నెగటివ్ అభిప్రాయం కలగదు. ప్రధానంగా ఇబ్బంది పెట్టిన మైనస్ ఇదే.
ఇలాంటి కథలు వీలైనంత సహజంగా నడవాలి. కానీ లాజిక్స్ దూరంగా వెళ్తే మాత్రం ఆడియన్స్ అయోమయం చెందుతారు. నిజ జీవితంలో జరిగే అవకాశం లేని వాటిని తెరమీద చూడాలనుకోవడం నిజమే కానీ అది కమర్షియల్ సినిమాకు వర్తిస్తుంది తప్ప వాస్తవానికత నుంచి పుట్టుకొచ్చిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం నుంచి కాదు. వడ్డీ వ్యాపారి ప్రహసనం, ఆన్ లైన్ మోసాలు, హీరోయిన్ ఇంట్లో కూతురి ప్రేమను రిసీవ్ చేసుకునే వైనం ఇవన్నీ న్యాచురల్ గా అనిపించవు. ఒకరకమైన ఫోర్స్ కనిపిస్తుంది. సెకండాఫ్ లో సాగతీత ఎక్కువైపోవడంతో సీన్లు ప్రత్యేకత లేకుండా అతి మాములుగా జరిగిపోతాయి. అంచనాలు సున్నా అయితేనే ఇవి ఇబ్బంది పెట్టవు. క్లైమాక్స్ ని హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కామనే భావన కలిగించి సగం స్టేషన్లు దాటాక ప్యాసింజర్ రైలుకు మారామనే ఫీలింగ్ మిగిలిస్తుంది. ఆ ఫీలింగ్ తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. ఒకవేళ ప్రేక్షకులులు అంగీకరిస్తే పెట్టిన బడ్జెట్ తక్కువ కాబట్టి సేఫ్ అవుతుందేమో కానీ లేదంటే మాత్రం ఎదురీత అంత సులభం కాదు. ఓటిటి జమానాలో థియేటర్ కు జనాలు రావాలి, అది కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుని హీరోగా పెట్టినప్పుడు టికెట్లు కొనాలంటే బోలెడు కసరత్తు అవసరం. ఇందులో అది పూర్తిగా నెరవేరలేదు. అయినా సరే ఓ మోస్తరు హ్యూమర్, కాసింత ఎక్కువ హ్యామర్ ని తట్టుకోగలమంటే సుబ్రహ్మణ్యంతో జర్నీ చేయొచ్చు.
నటీనటులు
ఇది పూర్తిగా రావు రమేష్ వన్ మ్యాన్ షో. పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశాడు. అక్కడక్కడా కొంత మోతాదు మించినప్పటికీ ఉన్నంతలో దీనికి తనే బెస్ట్ ఛాయస్ అనిపించుకున్నారు. చిన్న డాన్సులు చేయడం బోనస్. దశాబ్దాలు గడుస్తున్నా మునుపటి ఛార్మ్ కొనసాగిస్తున్న ఇంద్రజ ఆయన భార్యగా మంచి ఛాయస్. ఇటీవలే ఆయ్ లో ఆకట్టుకున్న అంకిత్ కొయ్యకు మెల్లగా అవకాశాలు పెరుగుతున్న క్రమంలో నటనను ఇలాగే మెరుగుపరుచుకుంటూ వెళ్తే చక్కగా సెటిలవ్వొచ్చు. రమ్య పసుపులేటి డీసెంట్. హర్షవర్ధన్, అజయ్, వాసు, అప్పాజీ తదితరులు తమ పరిధి మేరకు చేసుకుంటూ వెళ్లారు. ముందే చెప్పినట్టు రావు రమేష్ డామినేషనే తుదికంటా నడిచింది.
సాంకేతిక వర్గం
మ్యూజికల్ గా గుర్తుండిపోయే పాటలు డిమాండ్ చేసిన సబ్జెక్టు కాదు కాబట్టి సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ కు రిస్క్ లేకుండా మంచి బీజీఎమ్ ఇస్తే చాలనే బాధ్యత మిగిలింది. దాన్ని బాగానే నెరవేర్చారు. ఎంఎన్ బాల్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. బడ్జెట్ పరిమితులు క్వాలిటీని అక్కడక్కడా తగ్గించినా కలర్ఫుల్ గా కంటెంట్ ని ప్రెజెంట్ చేయడంలో సక్సెసయ్యారు. నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ వీలైనంత నిడివిని కంట్రోల్ లోనే ఉంచింది కానీ కొన్ని చోట్ల ఆయన నిస్సహాయుడే అయ్యాడు. సంభాషణలు తనే సమకూర్చుకున్న లక్ష్మణ్ కార్య డైలాగ్ రైటర్ గా పాసు మార్కులు తెచ్చుకున్నాడు. తబిత సుకుమార్, బుజ్జిరాయుడు, మోహన్ నిర్మాణ విలువలు బాగున్నాయి
ప్లస్ పాయింట్స్
రావు రమేష్ నటన
ఇబ్బంది లేని హాస్యం
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
తేలిగ్గా తీసుకున్న లాజిక్స్
తగ్గిన సహజత్వం
సెకండాఫ్ ఫ్లో
ఫినిషింగ్ టచ్ : మధ్యస్థ వినోదం
రేటింగ్ : 2.5 / 5
Gulte Telugu Telugu Political and Movie News Updates