సమీక్ష – ఆయ్

2.75/5

2 Hr 22 Mins   |   Comedy   |   15/08/2024


Cast - Narne Nithin, Rajkumar Kasireddy, Ankith Koyya, Nayan Sarika, Vinod Kumar, Mime Gopi & others

Director - Anji K Maniputhra

Producer - Bunny Vas & Vidya Koppineedi

Banner - GA2 Pictures

Music - Ram Miriyala & Ajay Arasada

చిన్న సినిమాలను పెద్ద బ్యానర్లు నిర్మించడం కొత్త కాదు కానీ విపరీతమైన పోటీ మధ్య రిలీజ్ చేయడం మాత్రం ఆశ్చర్యమే. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి స్టార్ల చిత్రాల మధ్య ఆయ్ వస్తుందని ప్రకటించినప్పుడు ట్రేడ్ సైతం షాక్ అయ్యింది. ఎంత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద అల్లు అరవింద్ సపోర్ట్ చేసినా జనాలు కేవలం ఆ పేరు చూసి టికెట్లు కొనరుగా. అయినా సరే కంటెంట్ మీద కొండంత నమ్మకంతో సమరానికి సిద్ధపడ్డారు నిర్మాతలు. మరి ఇంత కాంపిటీషన్ లో దిగిన ఈ యూత్ ఎంటర్ టైనర్ ఏమైనా మేజిక్ చేసిందా

కథ

గోదావరి జిల్లా వీరవాసరంలో ఉండే బూరయ్య (వినోద్ కుమార్) కొడుకు కార్తీక్ (నితిన్ నార్నె) కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఊరికి వచ్చేస్తాడు. తొలిచూపులోనే పల్లవి (నయన్ సారిక) ని ప్రేమిస్తాడు. అంటిపెట్టుకుని ఉండే స్నేహితులు సుబ్బు (కసిరెడ్డి), హరి (అంకిత్ కొయ్య) ఏ అవసరం వచ్చినా తీరుస్తూ ఉంటారు. కులాల పిచ్చి ఎక్కువగా ఉండే ఆ గ్రామంలో తండ్రి (మైమ్ గోపి) కి భయపడిన పల్లవి ప్రేమ విషయంలో వెనుకడుగు వేసి పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని ఒప్పుకుంటుంది. దీంతో కార్తీక్ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఎలాగైనా సరే ఆమెనే పెళ్లి చేసుకోవాలని కంకణం కట్టుకుంటాడు. ఎలా గెలిచాడన్నది తెలియాలంటే తెరమీద చూడాలి.

విశ్లేషణ

పరిమిత బడ్జెట్ లో హిట్లు కొట్టాలంటే యూత్ ని టార్గెట్ చేసుకునే ఎంటర్ టైనర్లు మంచి ఆప్షన్. జంధ్యాల రెండు జళ్ళ సీతతో మొదలుపెట్టి మొన్నొచ్చిన కమిటీ కుర్రోళ్ళు దాకా ఎన్నో ఉదాహరణలున్నాయి. కాకపోతే వీటితో ఒక చిక్కు ఉంది. కమర్షియల్ అంశాలు లేకుండా రెండున్నర గంటలు బోర్ కొట్టించకుండా చేయాలంటే వినోదాన్ని బలంగా పండించాలి. నవ్వుల మోతాదు తగ్గకుండా చూసుకోవాలి. కాసింత ఎమోషన్ ని కలిపేసి, బ్యాక్ గ్రౌండ్ లో లవ్ స్టోరీని నడిపిస్తే పైసా వసూల్ అంతే. దర్శకుడు అంజి కె మణిపుత్ర ఈ సూత్రాన్ని బాగా వంట బట్టించుకున్నాడు. కామెడీతో టైం పాస్ చేయిస్తే కథను సీరియస్ గా తీసుకోరనే తెలివితో స్టోరీ రాసుకున్నాడు.

నిజానికి పేపర్ మీద ఒక కథగా చదివితే ఆయ్ లో ఎలాంటి కొత్తదనం ఉండదు. సగం అవ్వకుండానే చాలా సార్లు చూశాం కదా అనేస్తాం. ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య సరదాలు, మెయిన్ హీరోకు ప్రేమకథ, పెద్దల అడ్డంకి, ఇదంతా అరిగిపోయిన ఫార్ములా. కానీ అంజి ఇక్కడే తన తెలివిని చూపించే ప్రయత్నం చేశాడు. ఆయ్ జరుగుతున్నంత సేపు ప్రతి పది పదిహేను నిమిషాలకోసారి మనసారా నవ్వుతూనే ఉంటాం. అలాని ఎప్పుడూ చూడనిది ఫీలవుతామా అంటే ముమ్మాటికి కాదు. తన పెన్నుని నమ్ముకున్న అంజి వన్ లైనర్లు, గోదావరి ఎటకారాలను బాగా వంటబట్టించుకుని తెరమీద పేలేలా చూసుకున్నాడు. దీంతో అధిక భాగం బోర్ కొట్టకుండా సాగింది.

నితిన్ నార్నె, నయన్ సారిక మధ్య పరిచయం ఏర్పడటం, అది ప్రేమగా మారడం ఇదంతా గతంలో వాడేసిన వ్యవహారమే. కానీ విజువల్స్ తో పాటు చక్కని బీజీఎమ్ జోడించడంతో కూల్ గా సాగిపోతాయి. కొంచెం రొటీన్ గా ఫీలవ్వడం ఆలస్యం అక్కడ రాజ్ కుమార్ కసిరెడ్డి డ్యూటీ ఎక్కేసి ఘొల్లుమనిపిస్తాడు. ముఖ్యంగా కార్తీక్, పల్లవి, సుబ్బు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రాక్ బాగా పేలింది. హై మూమెంట్స్ పెద్దగా లేకపోయినా విసుగు తెప్పించకూడదనే లక్ష్యంతో అంజి పని చేశాడు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర ట్విస్టు ఇచ్చి అటుపై ఏం జరుగుతుందో ఊహించేలానే ఉన్నా క్లైమాక్స్ కోసం దాచిన అసలైన మలుపుని వాడుకున్న విధానం హైలైట్ గా నిలిచింది.

హీరో హీరోయిన్ విడిపోయే టైంలో పల్లవి వైపు నుంచి కన్విన్సింగ్ గా అనిపించిన వెర్షన్ అంతే మోతాదులో ఈ సమస్యని కార్తీక్ పరిష్కరించుకోవడానికి చొరవ తీసుకోకపోవడం అతని పాత్రని పాసివ్ గా మార్చింది. పదే పదే వెంటపడి బ్రతిమాలుకోవడం తప్ప అతనేం చేయడు. బదులుగా ఫ్రెండ్స్ చేసే అడ్వెంచర్లు డామినేట్ చేస్తాయి. దీని వల్ల అసలు కథానాయకుడు ఏం చేయలేదన్న డౌట్ వచ్చేస్తుంది. ఇది పక్కనపెడితే వినోద్ కుమార్ ని వాడుకుని చివరి పది నిముషాలు తండ్రి తాలూకు భావోద్వేగాన్ని ఎలివేషన్ కలిపి పండించిన తీరు కుటుంబ ప్రేక్షకులను సైతం మెప్పిస్తుంది. అప్పటిదాకా జరిగిన హెచ్చుతగ్గులని ఈ ఎపిసోడ్ కవర్ చేసేసింది.

సరదా కాలక్షేపం కోసం వెళ్తే ఆయ్ ఎంతమాత్రం నిరాశపరిచదు. క్రైమ్, మాస్, బోల్డ్ లాంటి అంశాలకు దూరంగా ఒక క్లీన్ మూవీ ఇవ్వడంలో అంజి సక్సెసయ్యాడు. అక్కడక్కడా స్వల్పంగా డబుల్ మీనింగులు ఉన్నాయి కానీ శృతిలో కలిసిపోయాయి. ఏదేదో ఊహించుకుని జాతిరత్నాలు రేంజ్ లో హిలేరియస్ గా ఉంటుందనుకుంటే మాత్రం ఆయ్ ఓ మోస్తరుగానే నచొచ్చు. ఇటీవలే వచ్చిన కమిటీ కుర్రోళ్ళు స్థాయిలో హై మూమెంట్స్ లేకపోయినా టైం పాస్ కోసం థియేటర్ కు వచ్చిన వాళ్ళకు ఆ కార్యం నెరవేర్చడంలో ఆయ్ సక్సెసయ్యింది. బాక్సాఫీస్ లెక్కల్లో ఎంత దూరం వెళ్తుందో చెప్పలేం కానీ పోటీలో వదలడానికి ప్రొడ్యూసర్ల ధైర్యమేంటో అర్థమైపోతుంది.

నటీనటులు

మ్యాడ్ తో పరిచయమైన తారక్ బావమరిది నితిన్ నార్నె ఇందులో మెరుగయ్యాడు. లుక్స్ బాగున్నాయి. కామెడీ, ఎమోషన్లకు సంబంధించిన సీన్లలో మాత్రం మరికొంత హోమ్ వర్క్ అవసరం. నయన్ సారిక అందంగా హోమ్లీగా ఉంది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజ్ కుమార్ కసిరెడ్డి గురించి. ఎక్కువ నిడివి పాత్ర కావడంతో పాటు తనని సరిగా వాడుకునే దర్శకుడు దొరకడంతో చెలరేగిపోయాడు. ఆంటీ వెంటపడే కుర్రాడిగా అంకిత్ కొయ్య సర్ప్రైజ్ అనిపిస్తాడు. మైమ్ గోపి విలనిజం లేకుండా దొరికిన వెరైటీ పాత్రలో ఒదిగిపోయాడు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ ని భలే వాడుకున్నాడు దర్శకుడు. ఇతర ఆర్టిస్టులు సహజంగా ఉన్నారు.

సాంకేతిక వర్గం

రామ్ మిర్యాల స్వరపరిచిన పాటలు నీట్ గా ఉన్నాయి. వైరలయ్యే టైపు కాదు కానీ సినిమా నాణ్యత పెరగడంలో ఉపయోగపడ్డాయి. అజయ్ అరసద నేపధ్య సంగీతం మంచి ఫీల్ ఇచ్చింది. సమీర్ కళ్యాణి ఛాయాగ్రహణంలో గోదావరి పల్లె అందాలు చాలా అందంగా కనిపించాయి. తక్కువ లొకేషన్లలోనే తన ప్రతిభ చాటుకున్నారు . కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ లో కొన్ని రిపీట్ అనిపించిన సీన్లను తగ్గిస్తే ఇంకా వేగం పెరిగేది. సంభాషణల్లో హాస్యానికి ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి. ఎన్నో స్క్రిప్టులు విన్న తర్వాత ఆయ్ ఓకే చేశామని చెప్పిన నిర్మాత బన్నీ వాస్ ముందే ఇంత హ్యూమర్ ఊహించుకున్నారో ఏమో కానీ నమ్మకంతో పెట్టిన ఖర్చు వృథా కాలేదు.

ప్లస్ పాయింట్స్

గోదావరి బ్యాక్ డ్రాప్
కసిరెడ్డి కామెడీ
సరదాగా సాగే కథనం
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

స్టోరీ పాతదే
మధ్యలో కొంత నెమ్మదితనం
కొన్ని రిపీట్ సీన్లు

ఫినిషింగ్ టచ్ : నవ్వించిదండోయ్

రేటింగ్ : 2.75 / 5