3/5
Disney Hotstar | Thriller | 17 Sep 2021
Cast - Nithiin, Tamannaah, Nabha Natesh, Naresh, Jitu
Director - Merlapaka Gandhi
Producer - Sudhakar Reddy, Nikitha Reddy
Banner - Shresht Movies
Music - Mahati Swara Sagar
సమీక్షకులు ఎక్కడ అంటారో అనే ఆలోచనతో ఓ పాయింట్ ను మాస్ట్రో హీరో నితిన్, డైరక్టర్ గాంధీ సినిమా ప్రమోషన్ టైమ్ లో చెబుతూ వచ్చారు. ఒరిజినల్ ను మారిస్తే చెడగొట్టాం అంటారు. మార్చకపోతే కలర్ జిరాక్స్ తీసారు అంటారు…అన్నదే ఆ పాయింట్. ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ల్లో తెలుగు ప్రేక్షకులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే చూసేసిన సినిమా అంథాదూన్. అది తెలిసీ దీన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకోవడమే కాస్త ధైర్యం చేయడం. అలాగే అటయితే పాడు చేసారంటారు. ఇటయితే కలర్ జిరాక్స్ అంటారు అనే పాయింట్ తెలిసి కూడా రీమేక్ చేయడం అన్నది ఇంకా ఎక్కువ ధైర్యం చేయడం. గమ్మత్తేమిటంటే మధ్యేమార్గం లేక కలర్ జిరాక్స్ కే ఓటేసారు మేకర్లు.
తనదైన ఓ ఆలోచన, లాజిక్ తో గుడ్డివాడిగాన సమాజాన్ని నమ్మిస్తూ బతికేస్తుంటాడు అరుణ్ (నితిన్). పియానో వాయించడంలో ప్రావీణ్యం వున్నవాడు. ప్రయివేట్ కచేరి చేయడానికి వెళ్లి సిమ్రాన్ (తమన్నా) తన భర్త మోహన్ (నరేష్) ను హత్య చేయడం చూస్తాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్ (బిజుసేన్ గుప్త) పాత్ర కూడా వుంటుంది. దాంతో హీరోకి సమస్యలు ప్రారంభం అవుతాయి. ఈసారి నిజంగానే కళ్లు పోతాయి. అక్కడితో ఆగదు వ్యవహారం. ఎక్కడికి చేరింది అన్నది మిగిలిన సినిమా.
మాస్ట్రో సినిమా ఓ సిన్సియర్, ట్రూత్ ఫుల్ రీమేక్. అలా చేయడానికి మేకర్లు అస్సలు మొహమాట పడలేదు. అవసరం అయితే మాతృక విడియో పక్కన పెట్టుకుని మరీ ముందుకు వెళ్లిపోదాం అని డిసైడ్ అయిన తరువాతే షూట్ మొదలుపెట్టినట్లు వుంది. ఏదో కొత్తగా చేద్దామని చూసి, చెడగొట్టారన్న మాట పడడం కన్నా, కలర్ జిరాక్స్ అని అంటే అంటారు కానీ, చూడబుల్ గానే వుంది అనే టాక్ తెచ్చుకోవాలన్నది మేకర్ల అయిడియా, ఆలోచన అయి వుండొచ్చు.
అంథాదూన్ కథలో ఓ బ్యూటీ వుంది. తన దైన ఆలోచన, లాజిక్ తో గుడ్డివాడుగా వున్న హీరో అనుకోకుండా ఓ మర్డర్ చూడాల్సి వస్తే…చెప్పడం ఎలా? అదే కారణంగా నిజంగానే గుడ్డివాడుగా మారిపోతే పరిస్థితి ఏమిటి? ఈ రెండు పాయింట్ల ఆధారంగా అల్లుకున్న కథదే అసలు సక్సెస్. అందుకే ఆ హిందీ కథను కొనుక్కొచ్చి తెలుగులో తీసే ధైర్యం చేసారు. అయితే హిందీ మాతృక స్క్రిప్ట్ లోనే ద్వితీయార్థం కొంచెం భారం అనిపించే సమస్య వుంది. నిజానికి దీనిని మార్చుకునే అవకాశం కొంత వరకు వుంది. కానీ ఆ ధైర్యం చేయలేదు దర్శకుడు మేర్లపాక గాంధీ. అలా చేసి సక్సెస్ అయి వుంటే అతని ఖాతాలో పడేది క్రెడిట్. కానీ ఇప్పుడు యధాతథంగా తీయడం వల్ల పెద్దగా క్రెడిట్ లేకుండా పోయింది.
హిందీ సినిమాను చూసిన వారు తెలుగు రీమేక్ చూస్తే ముందుగా కామెంట్ చేసేది, అబ్జర్వ్ చేసేది నటీనటుల గురించి. మాస్ట్రో అక్కడ ముందుగా పాస్ అయిపోతుంది. ప్రతి పాత్రకు పక్కాగా సరిపోయే నటులు సెట్ అయ్యారు. టబుకు రీప్లేస్ మెంట్ గా తమన్నా సరిపోవడం కాదు, ఈమే బాగా చేసింది అనిపించుకుంది. అలాంటి కామెంట్ రావడం సాధారణంగా కష్టం. నితిన్ కూడా ఓకె. బాగానే చేసాడులే అన్న కామెంట్ నే వస్తుంది తప్ప నెగిటివ్ రాదు. ఇక నరేష్, బిషు సేన్ గుప్త ఇలా అందరూ ఫెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యారు. కొన్ని సినిమాల అనుభవం వుండడంతో డైరక్టర్ వాళ్లను సరైన గ్రూలోనే నడిపించాడు.
ఇక రెండో ప్లస్ పాయింట్ టెక్నికల్ గా సినిమా సౌండ్ గా వుండడం. యువరాజ్ సినిమాటోగ్రఫీ కానీ, సర్వసాగర్ నేపథ్యసంగీతం కానీ సినిమాకు యాడ్ అయ్యాయి తప్ప మైనస్ కాలేదు. ఈ రెండు పాయింట్ల వల్ల కలర్ జిరాక్స్ అనే అపప్రధను ఒరిజినల్ చూసిన వారి నుంచి ఎదుర్కొంటూనే పాస్ మార్కుల దిశగా సాగిపోయింది.
మైనస్ ఏమిటంటే హీరో గుడ్డివాడు కాదు అన్నది రివీల్ చేయడం కాస్త ఇంట్రస్టింగ్ వుంటుంది మాతృకలో. తెలుగులో ఆ ఆసక్తి లేదా చమక్కు మిస్ అయింది. అలాగే తొలిసగంలో హీరో వ్యవహారంలో చిన్న ఫన్ వుంటుంది. అది కూడా మిస్ అయింది. ఒరిజినల్ లో వున్న సమస్య ఏమిటంటే తొలిసగం కన్నా మలిసగం కాస్త భారంగా సాగడం అన్నది. ఇంట్రర్వేల్ బ్యాంగ్ అన్నది ఎక్కడ వుండాలో అక్కడ వుంచాల్సి రావడంతోనూ, వన్స్ హీరో సమస్యలో ఇరుక్కోవడం ప్రారంభమయ్యాక, కథ చాలా వుండడంతోనూ ఈ మలిసగం భారం అన్నది తప్పదు. ఇది మాతృకలో వున్న సమస్యే. దర్శకుడు గాంధీ ధైర్యం చేసి వుంటే ఇది కొంత వరకు అధిగమించవచ్చు. కానీ ఆ ధైర్యం ఎందుకో చేయలేకపోయాడు.
మాతృక చూడకపోతే కథ తెలియదు కాబట్టి, ఆసక్తికరంగానే వుంటుంది. పైగా హీరో నితిన్ చాలా వరకు ఎక్కువ తక్కువ కాని బ్యాలన్స్డ్ నటన అందించాడు. నభా ను కాస్త గ్లామర్ కంటెంట్ కు వాడుకున్నారు. సినిమా గోవా లోకేషన్లు బాగుండడం, పెద్దగా ఇబ్బంది పెట్టని స్క్రీన్ ప్లే కలిసి ఓకె అనిపించేస్తాయి. కానీ సినిమా మలిసగంలోని ద్వితీయార్థంలోనే కాస్త స్పీడ్ బ్రేకర్లు తప్పని సరై, నడక మందగించినట్లు అనిపిస్తుంది.
ఈ ఒక్క సమస్య తప్పితే మాస్ట్రో సినిమా చూడడానికి పెద్దగా ఇబ్బంది పెట్టదు.
ప్లస్ పాయింట్లు
తమన్నా
టెక్నికల్ వాల్యూస్
మైనస్ పాయింట్లు
ద్వితీయార్థంలో లాగ్
ఫినిషింగ్ టచ్: వన్ మోర్ కలర్ జిరాక్స్
Rating: 3/5