2.75/5
2 Hours 36 Mins | Action-Drama | 09-04-2021
Cast - Pawan Kalyan, Nivetha Thomas, Anjali, Ananya Nagalla, Prakash Raj, Shruti Haasan and Others
Director - Venu Sriram
Producer - Dil Raju, Boney Kapoor
Banner - Sri Venkateswara Creations
Music - S Thaman
సినిమాలో కోర్టు డ్రామా అన్నది స్మాల్ పార్ట్ లేదా ఫన్నీ పార్ట్ అయితే దాని గురించి పట్టించుకోనక్కరలేదు. లాజిక్కులు లాగక్కరలేదు. కానీ కోర్టు డ్రామానే కీలకమై, సినిమా అయితే కచ్చితంగా కాస్త డీప్ గా చూడాల్సిందే. డిస్కస్ చేయాల్సిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ను సమీక్షించే ముందు ఈ పాయింట్ ను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. పరిగణనలోకి తీసుకోవాలి. పైగా సినిమా టైటిల్ నే వకీల్ సాబ్ కదా. ఆ తరువాతే పంచ్ డైలాగులు, ఫ్యాన్స్ గూస్ బంప్ మూవ్ మెంట్లు. సినిమాకు అడ్డం పడే ఫైట్ల సంగతి చూడాల్సి వుంటుంది.
వకీల్ సాబ్ కథ అందరికీ తెలిసిందే. పింక్ సినిమాను రీమేక్ చేసారు. సింపుల్ గా చెప్పుకోవాలంటే..ఓ అమ్మాయి పట్ల ఓ మంత్రి కొడుకు అసభ్యంగా ప్రవర్తించబోతే, సీసాతో కొట్టి గాయపరుస్తుంది. దాంతో ఆ మంత్రి కొడుకు ఆ అమ్మాయిని తప్పుడు ఆరోపణలతో కోర్టుకు లాగి నానా యాగీ చేయడం. హీరో ఆ అమ్మాయిల తరపున వాదించి గెలిపించడం.
వకీల్ సాబ్ ..తొలిసగం నీరసంగానే వుంటుంది. సినిమా ఎత్తుగడ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. హీరో పరిచయం అన్నది సినిమాకు కాస్త జోష్ తెస్తుంది. కానీ కాస్తేపటికే ఫ్లాష్ బ్యాక్ వచ్చి సినిమాను కిందకు లాగుతుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు..సత్యమేవ జయతే..కంటిపాప వచ్చి, థియేటర్ లో కన్నా బయటే బాగున్నాయి అనిపిస్తాయి. ఒక ఫైట్ తో యాజ్ యూజువల్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది. ఈ తొలిసగాన్ని ఫ్యాన్స్ అంతా ఓ శంకరాభరణం సినిమా చూస్తున్నట్లు మౌనంగా, క్లాస్ గా చూసేయాల్సిందే. అరిచేయాలన్నీ అరకొర మూవెంట్స్ తప్ప, ఆదుకునేవి వుండవు.
సినిమా మొత్తం ద్వితీయార్థం మీదే ఆధారపడి ముందుకు వెళ్తుంది. ద్వితీయార్థంలో సినిమా కొర్టు రూమ్ లోకి మారిపోతుంది. కేవలం ఫైట్ల కోసం తప్పిస్తే బయటకు రాదు. ఈ కోర్టు సీన్లే సినిమాకు కమర్షియల్ ఆధారం. పవన్ స్టయిల్ ఉపన్యాసాల మాదిరిగానే వున్నాయి ఇవి. ఎందుకు ఇలాంటి పదం వాడడం అంటే, కోర్టు వాదనలు అంటే సాక్ష్యాలు, రుజువులు, పాయింట్ బేస్డ్ గా వుంటాయి. అంతే తప్ప ఉపన్యాసాలు, పంచ్ డైలాగులు కాదు. అవి ఫ్యాన్ మూవ్ మెంట్ల కోసం వాడడంలో తప్పు లేదు. కానీ వాటితో పాటు వాదన కూడా వుండాలి.
ఎస్ ఐ ఓల్డ్ డేట్ తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది అని ప్రూవ్ చేయడం బాగుంది. కానీ ఆ తరువాత అలాంటి పాయింట్ మరొక్కటి కూడా లేదు. ప్రాసిక్యూషన్ లాయర్ ఒరిజినల్ లేదా ఫ్యాబ్రికేటెట్ విట్ నెస్ లు వరుసగా చూపించి అప్పర్ హ్యాండ్ తీసుకుంటే, డిఫెన్స్ లాయర్ కేవలం ప్రవచనాలతో కేసు గెలవాలని చూడడం ఏమిటి? ఇన్సిడెంట్ ను సరైన ట్విస్ట్ తో కేసు మలుపు తిప్పి, జడ్జిమెంట్ ఎలా వుండబోతోందో ప్రేక్షకులకు అర్థం అయ్యే రేంజ్ కు తీసుకువచ్చి, అప్పుడు ఓ లెంగ్తీ ప్రీచింగ్ సీన్ ఒక్కసారే పెట్టేసి, ప్రేక్షకులు, ఫ్యాన్స్ చేత చప్పట్లో కొట్టించేస్తే అది వేరేగా వుండేది. అంజలి కోర్టు వ్యవహారాలకు ఫ్రస్టేట్ అయిపోయి, తాము డబ్బు డిమాండ్ చేసాము అని ఒప్పేసుకునే సీన్ కు కొనసాగింపు ఏదీ? ఆ ఫ్రస్టేషన్ లో ఆమె నుంచి బలమైన డైలాగులు రావాల్సింది? కానీ ఏవీ? అమ్మాయిల సమస్యల గురించి, సమాజ దృక్పథం గురించి డిస్కస్ చేసినపుడు, తల్లితండ్రుల మద్దతు,. మనోభావాల జాడ ఏదీ?
ఎంత సేపూ దుస్తులు, కన్యాత్వం, పచ్చి డైలాగులే పవర్ ఫుల్ అనుకోవడం తప్ప, భావోద్వేగాలు కలికంలోకి కూడా కనిపించవేం? జనం కూడా కోర్టు వాదనలు ఫాలో అవుతూ వుంటే తీర్పు ఇలా రావచ్చు అన్న క్లారిటీ కొద్ది కొద్దిగా వస్తూ వుంటుంది. కానీ వకీల్ సాబ్ లో కోర్డు వాయిదా వేస్తున్నాం. తరువాత వాయిదాలో తీర్పు అనగానే ప్రేక్షకులకు కాస్త అమోయమం. అసలు వకీల్ సాబ్ ఎక్కడ వాదించాడు. ఎక్కడ కేసు మలుపు తిప్పాడు. అప్పుడే తీర్పా? అని. అదే విధంగా సరే, తీర్పు వచ్చింది. బెనిఫిట్ ఆఫ్ డవుట్ కింద లేదా మరే విధంగానో కేసు కొట్టేసారు. బాగానే వుంది. మరి ఇంతకీ వకీల్ సాబ్ ఏం ప్రూవ్ చేసారని విలన్ కు ఏడేళ్ల శిక్ష విధించేసారు? అది అర్థం కాకుండానే థియేటర్ బయటకు రావాల్సిందే. అసలు అక్కడేం జరిగిందన్న క్లారిటీ లేదు. ట్విస్ట్ లు లేవు. కేసు మలుపు తిరగడం లేదు. ప్రవచనాలు తప్ప వాదనలు లేవు.. తీర్పు వచ్చేసింది. సినిమా అయిపోయింది.
ఇంకా చిత్రం ఏమిటంటే రేపు తీర్పు వస్తుంది అంటే ఈరోజు హీరోయిన్లు ముగ్గురు మీద దాడి చేయడం అవసరమా? వాళ్లు చనిపోతే కేసు తీర్పు ఏమవుతుంది? నేరం ఎవరి మీదకు మళ్లుతుంది. ఇలాంటి ఆలోచనలు లేవా? పోనీ తీర్పు వచ్చేసింది గెలిచిన గర్వంతో దాడి చేసారు. లేదా ఓడిన కోపం తో దాడి చేసారు అంటే సరిపోయేదేమో? ప్రీ క్లయిమాక్స్ ఫైట్ కాకుండా క్లయిమాక్స్ ఫైట్ అయ్యేది.
ఇలాంటి సినిమా పవన్ కమ్ బ్యాక్ ఫిల్మ్ అన్నంత వరకు ఓకె. మంచి సబ్జెక్ట్ నే. కానీ దాన్ని పవన్ చరిష్మాకు, పొలిటికల్ ఎజెండాకు అనుగుణంగా డైలాగులు రాసి మార్చడం వల్లే కాస్త తేడా వచ్చింది. కానీ పవన్ మాత్రం ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లు బాగానే చేసారు. కానీ పవన్ మినహా మరెవరు అంటే ఆన్సర్ వుండదు. పవన్ సినిమాకు ఇంత తక్కువ లెవెల్ స్టార్ కాస్ట్ అన్నది పూర్తిగా మైనస్ నే. ప్రకాష్ రాజ్, నివేదా, అంజలి మినహా గుర్తు పట్టేవారే లేరు. కనీసం జడ్జ్ గానైనా కాస్త మాంచి నోటెడ్ నటుడిని తీసుకువస్తే బాగుండేది. నాలుగు డైలాగులు రాసే అవకాశం వుండేది. కానీ అదీ లేదు.
సినిమాకు థమన్ నేపథ్య సంగీతం బలం. పాటలు సినిమాలో కన్నా బయటే బాగున్నాయి. తిరుపతి రాసుకున్న డైలాగులే సినిమాకు బలం. డైరక్షన్ అదిరింది అనే మూవ్ మెంట్ ఒక్కటీ కనిపించలేదు.
డైలాగులు, ఫైట్లు ఫ్యాన్స్ కు గూస్ బంప్ మూవ్ మెంట్స్ అయితే అయ్యుండొచ్చు కానీ రెగ్యులర్ ఆడియన్స్ కు మాత్రం అవి సరిపోతాయి సినిమా మొత్తానికి అన్నది అనుమానమే.
ప్లస్ పాయింట్లు
పవన్ కళ్యాణ్
డైలాగులు
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్లు
తొలిసగం
క్లయిమాక్స్
ఫినిషింగ్ టచ్: సరిపోలేదు…’సాబ్’
Rating: 2.75/5
-సూర్య