తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను పోషించారు. ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న ముందు ప‌డేవారు. త‌నే వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేవారు. లేదంటే స‌మ‌స్య ఎదురైన వాళ్లు ఆయ‌న ద‌గ్గ‌రికి వెళ్లి మొర‌పెట్టుకునేవారు. ఇండ‌స్ట్రీ త‌ర‌ఫున ఏం చేయాల‌న్నా ఆయ‌న లీడ్ తీసుకునేవారు.

దాస‌రిని అంద‌రూ ఇండ‌స్ట్రీ పెద్ద‌గా గుర్తించారు, గౌర‌వించారు కూడా. కానీ ఆయన మ‌ర‌ణానంత‌రం ఆ స్థానం ఖాళీ అయింది. మెగాస్టార్ చిరంజీవి అనేక సంద‌ర్భాల్లో ఇండ‌స్ట్రీ కోసం చొర‌వ తీసుకుని అనేక ప‌నులు చేశారు. ఎవ‌రికే సాయం అవ‌స‌ర‌మైనా త‌న వంతుగా చేస్తున్నారు.

కానీ అధికారికంగా ఇండ‌స్ట్రీ పెద్ద అనిపించుకోవ‌డానికి ఆయ‌న ఇష్ట‌ప‌డ‌ట్లేదు. అదే సంద‌ర్భంలో ఆయ‌న‌పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేసేవాళ్లూ లేక‌పోలేదు. ఒక ర‌కంగా చిరు త‌న‌ను ఇండ‌స్ట్రీ పెద్ద అనొద్దు అన‌డానికి ఇలాంటి కామెంట్లే కార‌ణం.

తాజాగా సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ.. ఈ ఇండ‌స్ట్రీ పెద్ద టాపిక్ మీద మాట్లాడారు. త‌న నిర్మాణంలో తెర‌కెక్కిన వ‌ద‌లా సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో ఒక జ‌ర్న‌లిస్టు ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు అని అడిగితే ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు.

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ పెద్ద అంటూ ఎవ‌రూ లేరు. నిజానికి అది ప‌ద‌వి కాదు. వాళ్లు చేసే ప‌నుల‌ను బ‌ట్టి పెద్ద దిక్కు అవుతారు. ఒకాయ‌న (దాస‌రి నారాయ‌ణ‌రావును ఉద్దేశించి) తాను చేసిన ప‌నుల వ‌ల్ల ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు అయ్యాడు. ఆయ‌న చేసిన ప‌నుల వ‌ల్ల చాలామంది ఆయ‌న ద‌గ్గ‌రికి వెళ్లేవాళ్లం. కాబ‌ట్టే ఆయ‌న పెద్ద దిక్కుగా ఉన్నారు.

కానీ ఇవాళ ఆయ‌న లేరు కాబ‌ట్టి పెద్ద దిక్కు లేన‌ట్లే. నాకు తెలిసి ఆయ‌న ఒక్క‌డే ఇంకొక్క‌డు రాడు ఎప్పుడూ.. లేడు కూడా అని త‌మ్మారెడ్డి ముక్తాయించారు. ఐతే క‌రోనా, ఏపీలో టికెట్ల రేట్ల త‌గ్గింపు స‌హా ఎన్నో ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో చిరు చొర‌వ తీసుకుని ఇండ‌స్ట్రీ కోసం ఎంతో చేసినా.. ఎన్నో గొప్ప సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నా.. ఏ సినిమా ప్ర‌మోష‌న్‌కు త‌న అవ‌స‌రం ప‌డ్డా తోడ్పాటు అందిస్తున్నా.. ఆయ‌న్ని గౌర‌వించ‌కుండా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అంటూ చిరు అభిమానులు త‌మ్మారెడ్డి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు.