అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న హైద‌రాబా ద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. ముక్కుకు స‌ర్జ‌రీ కూడా చేయించున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌రోసారి ఆయ‌న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న వెంట స‌తీమ‌ణి అన్నా కూడా వెళ్లారు. రెండు రోజుల పాటు ఆసుప‌త్రిలోనే ఉండ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

ఎందుకు?

గ‌త కొంత కాలంలో భుజాల‌కు సంబంధించిన రొటేట‌ర్ క‌ఫ్ స‌మ‌స్య‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇబ్బంది ప‌డుతున్నారు. అలానే.. రెండు భుజాల‌కు సంబంధించిన కండ‌రాలు కూడా చిట్లి పోవ‌డంతో స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్ర‌త్యేక ట్రీట్‌మెంటు అవ‌సరం కావ‌డంతో ఆయ‌న ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌మాచార శాఖ కూడా ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఓజీ స‌మయంలోనే..

ప‌వ‌న్ హీరోగా న‌టించిన ఓజీ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే రెండు భుజాల‌కు గాయాలు అయిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా క‌త్తుల‌ను వేగంగా తిప్పే క్ర‌మంలో రెండు భుజాల‌కు గాయాల‌కు అయ్యాయ‌ని తెలిసింది. అయితే.. అప్ప‌టి నుంచి మందులు వాడుతున్నా.. లోలోన పెరిగిన స‌మ‌స్య కార‌ణంగా తాజాగా మ‌రింతగా ఇబ్బంది ఎదుర‌వు తోంద‌ని స‌మాచారం. అందుకే రెండు రోజుల పాటు ఆసుప‌త్రిలో ఉండి చికిత్స తీసుకోవాల‌ని వైద్యులు సూచించ‌డంతో కోకిలా బెన్ ఆసుప‌త్రికి వెళ్లార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.