చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, థియేటర్లకు రప్పించడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. క్రేజీ ప్రమోషనల్ కంటెంట్‌తో వస్తే తప్ప ప్రేక్షకుల చూపు వాటి మీద పడదు. చిన్న చిత్రాల పబ్లిసిటీ కోసం కొందరు కావాలని వివాదాలు రాజేయడమూ చూస్తున్నాం. కానీ ఇప్పుడో సినిమా టైటిల్ విషయంలో అనుకోకుండా తలెత్తిన వివాదం దానికి వరంగా మారింది. షూటింగ్ కూడా మొదలు కాకముందే ఆ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. ఆ చిత్రమే.. ఇడుపు కాయితం.
సుకుమార్, బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంతో వంశీ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, యూట్యూబ్ స్టార్ నాగదుర్గ ఇందులో జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి ముహూర్త వేడుక నిర్వహించి.. టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.
ఐతే ‘ఇడుపు కాయితం’ అనేే టైటిల్ చాలామందికి అర్థం కాలేదు.
తెలంగాణ పల్లెటూళ్లలో విడాకుల పత్రాన్ని వాడుకు భాషలో ‘ఇడుపు కాయితం’ అంటారు. ఆంధ్ర వాళ్లకే కాదు.. తెలంగాణ అర్బన్ ఏరియాల వాళ్లకు కూడా ఈ టైటిల్ అర్థం కాలేదు. ఐతే భాషలో మరుగునపడ్డ ఎన్నో పదాలు ఉంటాయి. వాటిని ఇలా పరిచయం చేయడం, జనాలకు అలవాటు చేయడం మంచిదే.
ఐతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు సోషల్ మీడియాలో ఈ టైటిల్ మీద వెటాకారాలడడం.. ఈ సినిమాకు సబ్ టైటిల్స్ పెడతారా అంటూ కౌంటర్లు వేయడంతో వివాదం మొదలైంది. దీని మీద తెలంగాణ వాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నటుడు రాహుల్ రామకృష్ణ లాంటి ప్రముఖులు కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. ఇది ప్రాంతీయ విద్వేషాలకు, విభేదాలకు దారి తీసే స్థాయిలో వివాదంగా మారింది.
ఐతే అచ్చమైన తెలంగాణ పల్లెటూరి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు, దర్శకుడు తెలంగాణ వారు కాగా.. దాన్ని నిర్మిస్తోంది ఇద్దరు ఆంధ్రులు అన్న సంగతి మరువరాదు. టైటిల్ మీద వెటకారాలాడడం కచ్చితంగా తప్పే. కానీ సోషల్ మీడియాలో ఎవరో చేసిన పిచ్చి కామెంట్ల మీద ఇంత గొడవ కూడా అవసరం లేదు. ఈ గొడవకు ఇంతటితో తెరదించాల్సిన అవసరముంది. ఈ వివాదం వల్ల చిత్ర బృందానికైతే బాగానే లాభం జరిగింది. కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ వచ్చింది. ఓపెనింగ్స్‌కు ఇది బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. సినిమాలో విషయం ఉంటే.. ‘బలగం’లా అందరి మన్ననలూ పొందవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates