ప్రేక్షకులకు నచ్చని కాక్ టైల్ రుచి

షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది. రెండో వారంలో అడుగు పెట్టే నాటికి అతి కష్టం మీద వంద కోట్ల మైలురాయి దాటడం ఈ స్థాయి సినిమాకు తక్కువే. కారణం ఆడియన్స్ కి ఇందులో ఉన్న జెన్ జీ రిలేషన్ షిప్ కంటెంట్ నచ్చకపోవడమే. ప్రేమికుడి నిజాయితీ పరీక్షించడానికి అతని జీవితంలోకి ఇంకో అమ్మాయిని పంపించే హీరోయిన్ మహత్తర గాధని జనాలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు .

ట్విస్ట్ ఏంటంటే కాక్ టైల్ 2 కన్నా పదిహేను రోజులు దాటేసిన మైన్ వాపస్ ఆవూంగాకే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయని బాలీవుడ్ ట్రేడ్ టాక్. అందులో విపరీతమైన ఎమోషన్, కంటతడి పెట్టించే ప్రేమకథ ఉన్నప్పటికీ జనాలు దానికే ఓటు వేస్తున్నారని కలెక్షన్లను చూసి అర్థం చేసుకోవచ్చు. మొదటి రెండు రోజులు దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. తర్వాత అనూహ్యంగా పుంజుకుని వంద కోట్ల క్లబ్బు వైపు పరుగులు పెట్టింది. ఇందులో స్టార్ క్యాస్టింగ్ లేదు.

ఇక కాక్ టైల్ 2 విషయానికి వస్తే రష్మిక మందన్నకు మరో బాలీవుడ్ ఫ్లాప్ ఖాతాలో పడినట్టే. సికందర్ అంత దారుణంగా కాదు కానీ ఇది కూడా అంచనాలు అందుకోలేకపోతోంది. సక్సెస్ అయ్యుంటే మరిన్ని క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చని భావించిన రష్మిక ఈ సినిమాలో రొమాన్స్ ఉన్నప్పటికీ ఎస్ చెప్పింది. కాకపోతే ఎక్స్ పోజింగ్ ఎక్కువ కృతి సనన్ మీద పెట్టేయడంతో సోషల్ మీడియా దృష్టి ఆమె వైపు ఉండటం రష్మికకు మైనస్ అయ్యింది.

ఒరిజినల్ కాక్ టైల్ లో సైఫ్ అలీ ఖాన్ టైమింగ్ ని షాహిద్ కపూర్ మ్యాచ్ చేయలేకపోవడం మరో మైనస్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా కొన్ని క్లాసిక్స్ ని టచ్ చేయకపోతేనే బెటర్. లేదంటే ఇలాంటి విమర్శలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ కారణంగానే రన్బీర్ కపూర్ తో ప్లాన్ చేసుకున్న ధూమ్ 4ని వాయిదా వేస్తూ వస్తోంది. ఏ మాత్రం లెక్క మిస్ అయినా వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.