సమీక్ష – కోర్ట్

3/5

2h 29m   |   Drama   |   March 14, 2025


Cast - Priyadarshi Pulikonda, Saikumar, Sivaji, Harsha Vardhan, Subhalekha Sudhakar, Rohini Molleti, Harsh Roshan, Sridevi Appala, Surabhi Prabhavathi, Rajsekhar Aningi and others

Director - Ram Jagadeesh

Producer - Prashanti Tipirneni

Banner - Wall Poster Cinema

Music - Vijay Bulganim

హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్ నుంచి వచ్చిన కోర్ట్ మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇది నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని నాని స్వయంగా పిలుపు ఇచ్చాక ఒక్కసారిగా అంచనాలు మొదలయ్యాయి. ట్రైలర్ చూశాక నమ్మకం వచ్చింది. ముందస్తు ప్రీమియర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం భరోసాని ఇంకాస్త పెంచింది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా వచ్చిన కోర్ట్ మరి వాటిని అందుకునేలా ఉందో లేదో చూద్దాం.  

కథ

వైజాగ్ లో ఇంటర్ తప్పి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకునే కుర్రాడు చందు (హర్ష్ రానా). ఓ విచిత్ర సందర్భంలో జాబిలి (శ్రీదేవి) తో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమె మావయ్య మంగపతి (శివాజీ) వీళ్ళ విషయం తెలిసి బలవంతంగా పోక్సో చట్టం కింద కేసు కట్టించి చందుని జైల్లో పెట్టిస్తాడు. పేద కుటుంబానికి చెందిన ఈ కుర్రాడి తరఫున వాదిస్తానని ముందుకొచ్చిన లాయర్ చేసిన మోసం వల్ల బెయిల్ రాదు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ గా ఉన్న న్యాయవాది తేజ (ప్రియదర్శి) హైదరాబాద్ నుంచి వచ్చి కేస్ టేకప్ చేస్తాడు. సర్వశక్తులు ఒడ్డి చందూని ఎలా విడిపించి బయటికి తెచ్చాడనేది అసలు స్టోరీ.

విశ్లేషణ

తెలుగులో కోర్ట్ డ్రామాలు చాలా తక్కువ. చట్టాలు, సెక్షన్ల పట్ల అవగాహన లేక లాయర్లకు లక్షలు కుమ్మరించుకున్నా న్యాయం పొందలేని వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది. కొందరు ‘లా’లో లొసుగులు పట్టుకుని తమ వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రతీకారాలు తీర్చుకున్న ఉదంతాలు బోలెడున్నాయి. సరిగ్గా ఇదే అంశాన్ని తీసుకున్నాడు రామ్ జగదీశ్. 2012లో పోక్సో చట్టం వచ్చినప్పుడు అందులో ఉన్న సంక్లిష్టత వల్ల ఎందరో నిర్దోషులు దారుణమైన శిక్షలకు గురయ్యారు. మైనర్లను లైంగికంగా వేధించే కీచకులకు శిక్ష విధించే ఉద్దేశంతో తీసుకొచ్చిన సెక్షన్లను స్వార్థానికి వాడుకుంటే ఏం జరుగుతుందో కోర్ట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు రామ్ జగదీష్.

ఒక క్రమపద్ధతిలో పాత్రల పరిచయం, చందూ జాబిలి ప్రేమకథ, పాటలు ఇలా ఓ గంట పాటు కోర్ట్ మాములుగా జరిగిపోతుంది. పెద్దగా హై అనిపించేవి ఏమీ ఉండవు. పైపెచ్చు లవ్ స్టోరీ నెమ్మదిగా సాగుతూ అసలు మలుపు ఎప్పుడు వస్తుందాని ఎదురు చూసేలా ఉంటుంది. ఎప్పుడైతే చందూ కేసుని తేజ తీసుకుంటాడో అక్కడి నుంచి అసలు ట్విస్టులు మొదలవుతాయి. తప్పు చేయని అమాయకుడిని ఇరికించడానికి ప్రత్యర్థి లాయర్ వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ తేజ కోర్టులో చేసే పోరాటం ఎలాంటి అరుపులు లేకుండా కూల్ గా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకుల మెదడులో ఏర్పడిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తుంది.

వకీల్ సాబ్ లో పవన్, ప్రకాష్ రాజ్ అరుచుకున్నట్టు కాకుండా ఆర్గుమెంట్లను సెటిల్డ్ టోన్ లో చూపించడం రామ్ జగదీశ్ పరిణితిని చూపిస్తుంది. అయితే ఇలాంటి నేపధ్యాల్లో బాధితుడి ఎమోషన్ ఎంత బలంగా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే అంతగా భావోద్వేగాలు పండుతాయి. కానీ రిమాండ్ కు వెళ్ళాక చందూని పూర్తిగా మ్యూట్ చేసేసి కేవలం ఇతర పాత్రల ద్వారానే మాట్లాడించడంతో క్రమంగా ఆ కుర్రాడి బాధ చూసేవాళ్లకు దూరంగా ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది. ఎంత పోక్సో అయినా నిందితుడికి మాట్లాడే అవకాశం ఇస్తారు. కానీ ఎక్కడా ఆ సౌలభ్యాన్ని వాడుకోలేదు. జాబిలిని సైతం మూగమ్మాయి తరహాలో పక్కకు జరిపేయడం ఇంపాక్ట్ తగ్గించింది.

ఈ రెండు లోట్లని వీలైనంత తెలియనివ్వకుండా సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే తతంగాన్ని రామ్ జగదీశ్ ఇంటెలిజెంట్ గా నడిపించడం ఆకట్టుకుంది. కొన్ని చోట్ల లాజిక్స్ వదిలేసినట్టు అనిపించినా అధిక శాతం ప్రాక్టికాలిటీకి దగ్గరగా కథనాన్ని పరుగులు పెట్టించడంతో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రొసీడింగ్స్ జరుగుతాయి. రెగ్యులర్ గా ఇతర భాషల్లోనూ కోర్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చూసేవాళ్లకు ఇది మరీ మైండ్ బ్లోయింగ్ అనిపించకపోవచ్చు. కానీ మంచి ప్రయత్నమని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే ఫ్యామిలీస్ కావాల్సిన ప్రాధమిక అంశాలైన ఎంటర్ టైన్మెంట్, ఫన్ లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉద్దేశానికి మాత్రమే కట్టుబడినందుకు మెచ్చుకోవాలి.

కాకపోతే కోర్ట్ లాంటి కథల్లో ప్రిడిక్టబులిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఇందులో కూడా ఆ సమస్య ఉంది. మరీ హై అనిపించే, వావ్ అంటూ థ్రిల్ కు గురి చేసే వాదనలు తక్కువే. కేవలం తాను చెప్పాలనుకున్న పాయింట్ కు మాత్రమే కట్టుబడాలన్న దర్శకుడి చిత్తశుద్ధి వల్ల ఈ సమస్య వచ్చింది. అయితే ఇది తప్పేం కాదు. ఒక అమాయకుడు పోక్సోకు చిక్కితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయో చెప్పాలనుకున్నాడు కాబట్టి ఆ దిశగానే స్క్రీన్ ప్లే టూ మచ్ ఎగ్జై టింగ్ అనిపించకుండా ఒక సెటిల్డ్ టోన్ లో వెళ్తుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని నూటికి నూరు శాతం మెప్పిస్తుందని చెప్పలేం కానీ బాలేదని అనిపించుకోదు.

ఇది ఎలాంటి సినిమానో ముందే ప్రిపేరయ్యే విధంగా ట్రైలర్ కట్లు, ప్రమోషన్లు చేశారు కాబట్టి దానికి అనుగుణంగా చూస్తే కోర్ట్ నిరాశ పరిచే ఛాన్స్ ఎంత మాత్రం లేదు. సామాన్యులకు చట్టం గురించి తెలియక చేస్తున్న పొరపాట్లు, అయిదు కోట్ల పెండింగ్ కేసుల వల్ల బాధితులు చూస్తున్న నరకం, కేవలం ఇరవై రోజుల నిడివి ఒక బంధాన్ని చట్టబద్ధమా వ్యతిరేకమా అని నిర్ణయించే బలహీనత ఇలాంటి ఎన్నో అంశాలు తేజ ద్వారా ప్రశ్నల రూపంలో సంధించిన రామ్ జగదీష్ ఫైనల్ గా సేఫ్ గేమ్ ఆడాడు. ముప్పై ఏళ్ళ నాటి బాలీవుడ్ మూవీ దామిని అంత గొప్పగా అనిపించకపోవచ్చు. అయినా సరే అల్లరి నరేష్ నాంది లాంటి ప్రయత్నాలు, కోర్ట్ లాంటి ఊతకర్రలు మరికొందరు కొత్త దర్శకులకు మార్గం చూపిస్తాయనేది వాస్తవం.

నటీనటులు

కొత్త కుర్రాడు హర్ష్ రానా చందూగా పర్ఫెక్ట్ ఛాయస్. ఎలాంటి వంకలు పెట్టే అవకాశం లేకుండా చలాకీగా నటించాడు. భారీ ఎమోషన్స్ డిమాండ్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ సెకండాఫ్ లో ఆ ఛాన్స్ లేకపోవడంతో పెర్ఫార్మన్స్ పరంగా పరిమితమయ్యాడు. అయితే గుర్తింపు రావడంలో మాత్రం ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కొత్తమ్మాయి శ్రీదేవి సహజంగా ఉంది. ఎలాంటి గ్లామర్ కోటింగ్ లేకుండా ఒక పక్కింటి అమ్మాయిని చూస్తున్న ఫీలింగ్ కలిగించడంలో వంద మార్కులు కొట్టేసింది. జంట ఎంపికలో దర్శకుడి టేస్ట్ భేష్.

శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మూర్ఖత్వం నిండిన కులపిచ్చి పెద్దమనిషిగా అదరగొట్టడమే కాదు భయపెట్టేశాడు. ముఖ్యంగా కోపంతో ఊగిపోయే సీన్లలో విశ్వరూపం చూపించాడు. ప్రియదర్శికి ఛాన్స్ దక్కింది రెండో సగంలోనే. ఉన్నదాంట్లోనే తన ఉనికిని చాటుకున్నాడు. సాయికుమార్ మరోసారి హుందాగా సీనియర్ లాయర్ పాత్రకు నిండుదనం తెచ్చారు. చాలా గ్యాప్ తర్వాత హర్షవర్షన్ లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపించే డిఫెన్స్ న్యాయవాదిగా మెప్పించాడు. రోహిణి, శుభలేఖ సుధాకర్ రెగ్యులరే. హీరో తల్లితండ్రులు, స్నేహితుల గ్యాంగ్, హీరోయిన్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు తప్ప కొత్త ఆర్టిస్టులు కావడంతో సహజత్వం రెట్టింపయ్యింది.

సాంకేతిక వర్గం

విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఎక్కువ శబ్దం లేకుండా సన్నివేశాల డిమాండ్ కు అనుగుణంగా మంచి కంపోజింగ్ ఇచ్చారు. పాటల్లో ఒకటి బాగుండగా మిగిలినవి పర్వాలేదు. దినేష్ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం బడ్జెట్ పరిమితుల్లోనూ క్వాలిటీ ఇవ్వడంలో సక్సెసయ్యింది. సబ్జెక్ట్ డిమాండ్ మేరకు తక్కువ లొకేషన్లు కావడంతో మొనాటని అనిపించకుండా ఆయన డిజైన్ చేసుకున్న ఫ్రేమింగ్ మంచి డెప్త్ ఇచ్చింది. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ నీట్ గా సాగింది. అవసరం లేనివి పెట్టారనిపించలేదు. ఇక నాని నిర్మాణ విలువలు బాగున్నాయి. కంటెంట్ అడిగినంత ఖర్చు పెట్టాడు. ఎంత అవసరమో అంత బడ్జెట్ కనిపించింది.

ప్లస్ పాయింట్స్

ఆర్టిస్టుల ఎంపిక
శివాజీ పెర్ఫార్మన్స్
సెకండాఫ్ కోర్ట్ డ్రామా
దర్శకుడి ఉద్దేశం

మైనస్ పాయింట్స్

ప్రేమకథ సోసోనే
సరిపోని ఎమోషన్ 
కొన్ని లూజ్ ఎండ్స్

ఫినిషింగ్ టచ్ : గెలిచిన వాయిదా

రేటింగ్ : 3 / 5