1.75/5
02 Hrs & 16 Mins | Action | 14-02-2025
Cast - Vishwak Sen, Aakanksha Sharma, Kamakshi Bhaskarla, Abhimanyu Singh, Vineet Kumar, Babloo Prithiveeraj, Prudhvi Raj, Sunishith and others
Director - Ram Narayan
Producer - Sahu Garapati
Banner - Shine Screens
Music - Leon James
రెగ్యులర్ ఫార్ములా జోలికి వెళ్లకుండా ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్న విశ్వక్ సేన్ ఈసారి లైలాతో యూత్ హీరోలు ఎవరూ చేయని రిస్క్ తీసుకున్నాడు. ఆడవేషంలో ఫుల్ లెన్త్ చేయడానికి ఒప్పుకుని సాహసమే చేశాడు. ముందు నుంచి దీని మీద భారీ అంచనాలు లేకపోయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వి చేసిన కామెంట్లతో రేగిన వివాదం ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టి పడేలా చేసింది. ఒక రాజకీయ పార్టీ బాయ్ కాట్ లైలా అంటూ పిలుపు ఇచ్చే రేంజ్ లో రచ్చ చేసుకుంది. మరి ఇంత హంగామాని నిలబెట్టుకుందా.
కథ
హైదరాబాద్ పాతబస్తీలో బ్యూటీ పార్లర్ నడిపే సోను (విశ్వక్ సేన్) కు మేకప్ చేసే విషయంలో పెద్ద లేడీ ఫాలోయింగ్ ఉంటుంది. ఏ స్థాయిలో అంటే ఏదైనా లోకల్ బ్రాండ్ కి ఇతగాడి ఫోటో పెట్టుకుంటే అమాంతం ఆ వస్తువు అమ్మకాలు పెరిగేంత. ఒక పెళ్లికి సంబంధించిన మోసం వల్ల సోను మీద లోకల్ రౌడీ రుస్తుం (అభిమన్యు సింగ్) పగను పెంచుకుంటాడు. ఇంకో సంఘటన వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ (పృథ్విరాజ్) తో వైరం ఏర్పడుతుంది. వీళ్ళ నుంచి తప్పించుకునేందుకు సోను లైలాగా మారిపోతాడు. తనను ఈ వలయంలో ఇరికించిన వాళ్ళ కోసం వేట మొదలుపెడతాడు. చివరికి ఎలా బయట పడ్డాడనేది తెరమీద చూసే అసలు స్టోరీ.
విశ్లేషణ
మగాడు ఒక అమ్మాయిగా మారడం పట్ల సమాజంలో చిన్న చూపు ఎప్పటి నుంచో ఉంది. అది వేషమైనా సరే ఎగతాళి చేసే వాళ్లే ఎక్కువ. సినిమాల్లో దీన్ని కరెక్ట్ గా వాడుకుంటే అద్భుతమైన హాస్యం పుట్టించవచ్చని గతంలో చిత్రం భళారే విచిత్రం, మేడమ్ లాంటి క్లాసిక్స్ ఋజువు చేశాయి. కాకపోతే వినోదాన్ని బ్యాలన్స్ గా వాడుకోవడం తెలిసుండాలి. దర్శకుడు రామ నారాయణ ఈ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి కేవలం లౌడ్ కామెడీని నమ్ముకోవడం లైలాకు జరిగిన అతి పెద్ద ద్రోహం. యూట్యూబ్ తెరిస్తే బోలెడన్ని అడల్ట్ జోకులు ఉచితంగా దొరుకుతున్న ట్రెండ్ లో ఒక గుర్తింపున్న హీరోకు ఎలాంటి ట్రీట్ మెంట్ రాసుకోవాలనే సోయి లేకపోవడం విచిత్రం.
ప్రారంభం నుంచే లైలా దారి తప్పుతున్న వైనం కనిపిస్తూనే ఉంటుంది. విశ్వక్, ఆకాంక్ష శర్మ మధ్య లవ్ ట్రాక్ రొటీన్ కే రొటీన్ అనిపించే స్థాయిలో అత్తెసరుగా సాగింది. అమ్మడి గ్లామర్ షో ఉపయోగపడలేదు సరికదా ఇంకా చిరాకొచ్చేలా చేసింది. ఏ పాత్రకు సారైనా దిశా నిర్దేశం ఉండదు. సరదాగా నలుగురు సిట్టింగ్ లో ఉన్నప్పుడు వేసుకునే జోకులను స్క్రీన్ మీదకు యధాతథంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వరు. థియేటర్ ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ దృష్టిలో ఉంచుకుని వాళ్ళను తక్కువంచనా వేయనప్పుడే కథనం బాగా వస్తుంది. ఆర్టిస్టుల మీద అతిగా ఆధారపడిన రామ నారాయణ వాళ్ళ స్థాయికి తగ్గట్టు సీన్లు రాయించుకోవడంలో విఫలమయ్యాడు.
నవ్వించడానికి, నవ్వులపాలవ్వడానికి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. మొదటివైపు ఉన్నారు కాబట్టే జంధ్యాల, ఈవివి లాంటి వాళ్ళు చిరస్మరణీయులయ్యారు. లైలాలో వినోదానికి లోటు లేనంత స్కోప్ ఉంది. కానీ దాన్ని ఎలా సృష్టించాలో అర్థం కాని అయోమయంలో రామ నారాయణ తడబడిన వైనం ప్రతి ఫ్రేమ్ లో ఉంది. హీరో లేడీగా మారేందుకు అవసరమైన కాంఫ్లిక్ట్ బలంగా ఉండాలి. ఇది కన్విన్సింగ్ గా ఉన్నప్పుడే ఆడియన్స్ ఆ క్యారెక్టర్ ని ప్రేమిస్తారు. కానీ లైలాలో అది సిల్లీగా మారిపోయింది. దీంతో ఇంటర్వెల్ దగ్గర ఆసక్తి రేపడంలో విఫలమైన దర్శకుడు రెండో సగంలో దాన్ని మరింత కింది స్థాయికి దించేసి ట్రాక్ తప్పేశాడు.
సోషల్ మీడియాలో ఫేక్ పాపులారిటీతో సెలబ్రిటీగా మారిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక పాత్ర ఇవ్వడం లాంటి మహోన్నత టేస్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. సోను సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దాని పరిష్కారం సెకండాఫ్ లో కొంచెమైనా సీరియస్ గా ఉండాలి. దానికి బదులు ఇద్దరు ప్రియుల మధ్య నలిగిపోయే పాత చింతకాయ పచ్చడి ఫార్ములా వాడటంతో ఎటెటో పోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ కారణంగా తల్లి ఎమోషన్ సైతం తేలిపోయింది. బ్యూటీ పార్లర్ ని సోను ఎందుకంతగా అట్టి పెట్టుకున్నాడనే భావోద్వేగాన్ని దర్శకుడు కనీస స్థాయిలో రిజిస్టర్ చేయలేకపోయాడు. దీని వల్ల మదర్ సెంటిమెంట్ ఫోర్స్డ్ గా అనిపిస్తుంది.
కమర్షియల్ జనాలకు మసాలాలు అవసరమే. కానీ అవి ఎంత మోతాదులో ఉండాలో అంత ఉంటేనే ఆమోదం లభిస్తుంది. కానీ లైలాలో ఇవి ఓవర్ డోస్ అయ్యాయి. కొన్ని బూతులు మరీ పచ్చిగా ఉండటం మాస్ కి సైతం వెగటనిపించినా ఆశ్చర్యం లేదు. ఒక దశలో టీవీ రియాలిటీ షోలలో చూసే కామెడీ కన్నా కింది స్థాయిలో రాసుకోవడం వెనుక అసలు ఉద్దేశమేంటో దర్శక రచయితలకే తెలియాలి. కొత్తగా ప్రయత్నించడమంటే క్రియేటివిటీకి పదును పెట్టడం. అంతే కానీ వింతగా అలోచించి రోత పుట్టించడం కాదు. ట్రెండ్ మారిందనో, లేదా అభిరుచులు అప్డేట్ అయ్యాయనో ఇలాంటి లైలాలు తీస్తే ఆదరించేందుకు కొత్త తరం ఆడియన్స్ అంత అమాయకంగా లేరు.
నటీనటులు
విశ్వక్ సేన్ కష్టంలో ఎలాంటి లోపం లేదు. తనవరకు రెండు షేడ్స్ ని బాగానే చేశాడు. కాకపోతే చీరకట్టుకుని లైలాగా మారాక అతని పొటెన్షియాలిటీ వాడుకునే స్థాయిలో ఎపిసోడ్స్ లేకపోవడంతో విశ్వక్ సైతం నిస్సహాయంగా మిగిలిపోయాడు. ఒకవేళ ఛాలెంజింగ్ అనిపించే సీన్స్ పడి ఉంటే వర్సటాలిటి చూపించేవాడేమో కానీ రైటింగ్ వీక్ ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలరు. ఆకాంక్ష శర్మ షో ఎక్కువ, పెర్ఫార్మన్స్ తక్కువలా ఏదో మొక్కుబడిగా కానిచ్చేసింది. గ్లామర్ పరంగా ఉపయోగపడింది కూడా రవ్వంత లేదు.
అభిమన్యు సింగ్ కాస్త ఎక్కువ నిడివిలోనే కనిపించాడు. అక్కడక్కడా నవ్వించడానికి ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. యానిమల్ పృథ్విరాజ్ కామెడీ పండలేదు. ఒక పరిధి దాటి చేయలేకపోయే బలహీనత ఇందులో బయటపడింది. చిరంజీవి వీరాభిమానిగా వినీత్ కుమార్ మిస్ ఫైర్ అయ్యాడు. కాంట్రావర్సి చేసిన థర్టీ ఇయర్స్ పృథ్వికి నిజంగానే మేకలా మిగిలిపోయే క్యారెక్టర్ దక్కింది. బ్లాక్ టోన్ తో చేసిన అమ్మాయి మరీ కృతకంగా ఉంది. మిగిలిన ఆర్టిస్టుల గురించి అదే పనిగా గుర్తు చేసుకుని చెప్పుకునేంత సీన్ దక్కలేదు.
సాంకేతిక వర్గం
లియోన్ జేమ్స్ సంగీతంలో ఎలాంటి మెరుపులు లేవు. ఏదో ఒక పాట పర్వాలేదనిపించినా మిగిలినవి మాత్రం నిరాశపరిచాయి. ఇలాంటి కంటెంట్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా చేయడానికి ఏముండదు కాబట్టి ఏదో మొక్కుబడిగా బండి లాగించేశాడు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం వీలైనంత మేరకు క్వాలిటీ కోసం కష్టపడింది. కొన్ని విజువల్స్ పర్వాలేదు. సాగర్ దాది ఎడిటింగ్ వీలైనంత నిడివిని కంట్రోల్ లో ఉంచినా లాభం లేకపోయింది. వాసుదేవ మూర్తి రచన మరీ ఇంత అవుట్ డేటెడ్ గా ఉండటం స్క్రిప్ట్ దశలోనే గుర్తించాల్సింది. స్వతహాగా డైరెక్టరైనా విశ్వక్ ఈ లోపాలను గుర్తించకపోవడం ట్రాజెడీ. షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి
పాజిటివ్ పాయింట్స్
విశ్వక్ సేన్ తపన
రెండు మూడు జోకులు
మైనస్ పాయింట్స్
సిల్లీ కథా కథనాలు
అవసరం లేని ద్వందార్థాలు
పాత్రల డిజైన్
హీరో హీరోయిన్ లవ్ ట్రాక్
బలం లేని కాంఫ్లిక్ట్
ఫినిషింగ్ టచ్ : విలవిలా
రేటింగ్ : 1.75 / 5