తగ్గిపోతున్న OTT జోరు దేనికి సంకేతం

కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టాయి కంపెనీలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కనిపిస్తోంది. బోలెడు కంటెంట్ ప్రతి గురు శుక్రవారాల్లో వస్తున్నా జనం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నిన్న మొన్న చూసుకుంటే విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం, రాజ్ తరుణ్ భలే ఉన్నాడే, నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, హారర్ మూవీ కళింగ, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ బాలుగాని టాకీస్ ఇలా బోలెడు వచ్చినా కూడా సోషల్ మీడియాలో పెద్దగా హడావిడి, సౌండ్ కనిపించడం లేదు.

వీటిలో కొన్నింటికి మంచి టాక్ వచ్చింది కూడా. అయినా సరే పెద్దగా పట్టించుకోని దాఖలాలు చూస్తుంటే ఓటిటి వైభవం మెల్లగా మసకబారి థియేటర్ వైపే జనం ఆసక్తి చూపిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడే కాదు కల్కి 2898 ఏడి లాంటి వెయ్యి కోట్ల ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తింది. ధనుష్ రాయన్ కే కొన్ని రోజులు ఎక్కువ రేటింగ్ రావడం గమనించాల్సిన విషయం. అంటే తెలుగు ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా స్మార్ట్ తెరల వైపు చూడటం లేదానే అనుమానం కలగడం సహజం. అయితే ఇది తాత్కాలికమో కాదో చూడాలి.

థియేటర్ అనుభూతి కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అందరూ ఓటిటి కోసమే ఎదురు చూడటం తగ్గించేశారు. దేవర, కల్కిలకు టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా కొన్నారు, ఆదరించారు. గుంటూరు కారంకు నెగటివ్ టాక్ వచ్చినా డబ్బులు తీసుకొచ్చింది. హనుమాన్ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. ఇవన్నీ ఓటిటిలో అద్భుతాలు చేసినవి కాదు. దేవర హిందీ మల్టీప్లెక్సుల కోసం యాభై రోజుల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ ఒప్పందం చేసుకోవడం మంచి ఎత్తుగడ. ఓటిటిలో కొత్త రిలీజులకు క్రమంగా భారీ వ్యూస్ తగ్గిపోతున్న నేపథ్యంలో ఇకపై హక్కుల విషయంలో బేరసారాలు ఎక్కువగా ఉంటాయనే అంచనా నిజమయ్యేలా ఉంది.