ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన గేమ్ చేంజర్ నుంచి కొత్త పాట వచ్చేసింది. రా మచ్చామచ్చా అంటూ సాగే హుషారైన పాటను టీం లాంచ్ చేసింది. తమన్ మంచి బీటున్న పాటను అందిస్తే.. శంకర్ తనదైన శైలిలో దాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తున్నాడు. కానీ విజువల్స్ థియేటర్లోనే చూసుకోండి అన్నట్లుగా లిరికల్ వీడియోలో పాటలోని దృశ్యాలను పెద్దగా చూపించలేదు. చాలా వరకు వర్కింగ్ విజువల్స్‌తోనే పాటను లాగించేశారు. అక్కడక్కడా చిన్న గ్లింప్స్ లాంటివి చూపించారు.
చరణ్ ఒక చోట చిరుకు ట్రిబ్యూట్‌గా ఇంద్ర వీణ స్టెప్ వేసే షాట్ కూడా చూపించి చూపించనట్లు చూపించారు. ఐతే ఈ పాట సినిమాలో చాలా చాలా స్పెషల్ అని.. థియేటర్లు హోరెత్తిపోయేలా ఉంటుందని.. ముందే మొత్తం విప్పి చూపించకుండా మేజర్ హైలైట్స్ అన్నింటినీ దాచి పెట్టారని సమాచారం. ఈ పాట కంపోజిషన్, టేకింగ్ పరంగా ఆసక్తికర విషయాలు ముడిపడి ఉన్నాయట.
మన దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన కళారూపాలను కళ్లకు కట్టేలా ఈ పాట సాగుతుందట. ఇందులో మధ్యలో వచ్చే మ్యూజిక్ బిట్ వెనుక చాలా కసరత్తే జరిగినట్లు సమాచారం. ఆ కళారూపాలను చూపించేలా ఈ మ్యూజిక్ బిట్ సాగుతుంది. ఆయా ప్రాంతాలకు చెందిన కళాకారుల నుంచి ఒరిజినల్ ఇన్‌స్ట్రుమెంట్స్ తెప్పించి ఈ మ్యూజిక్ బిట్ కంపోజ్ చేశాడట తమన్. ఇక విజువల్‌గా ఈ మ్యూజిక్ బిట్ చిత్రీకరణ వేరే లెవెల్లో ఉంటుందని.. మన సంస్కృతి గొప్పదనాన్ని చాటేలా భారీగా దీన్ని చిత్రీకరించారని సమాచారం. ఈ పాట కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. విజువల్‌గా థియేటర్లో ఈ సాంగ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని.. చరణ్ స్టెప్పులు కూడా తోడైతే సాంగ్ వేరే లెవెల్ అనిపిస్తుందని అంటున్నారు.
ఇక గేమ్ చేంజర్ ప్రమోషన్లను కొంచెం లేటుగా మొదలుపెట్టినప్పటికీ.. ఇక నుంచి వరుసగా అప్ డేట్స్ ఉంటాయని టీం సమాచారం. క్రిస్మస్ టైంలో రిలీజ్ అనుకుంటున్న ఈ చిత్రం నుంచి త్వరలోనే విడుదల తేదీతో పోస్టర్ లాంచ్ కానున్నట్లు తెలిసింది.