అనిరుధ్ ఎలివేషన్లతో అంచనాలు రెట్టింపు

రేపు విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1లో జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, కొరటాల శివ దర్శకత్వం తర్వాత అందరూ దృష్టి పెడుతున్న అంశం అనిరుధ్ రవిచందర్ సంగీతం. టాలీవుడ్ మ్యూజిక్ తనకు కొత్త కానప్పటికీ ఇంత పెద్ద ప్యాన్ ఇండియా స్ట్రెయిట్ మూవీకి కంపోజ్ చేయడం మొదటిసారి. అజ్ఞాతవాసి, జెర్సి కేవలం తెలుగు వెర్షన్ కే కట్టుబడి ఉండటం వల్ల పరిగణించలేం. నాని గ్యాంగ్ లీడర్ కూడా ఇదే బాట. అందుకే దేవర కోసం అనిరుధ్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా విశేషాల గురించి అతను ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే ఇప్పటికే ఆకాశంలో ఉన్న అంచనాలు మరింత పైకెళ్లేలా కనిపిస్తున్నాయి.

అవెంజర్స్, బ్యాట్ మ్యాన్ లాంటి హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు కలిగే అనుభూతి దేవరకు దక్కిందని, రీ రికార్డింగ్ కోసం చాలా కష్టపడ్డామని చెప్పడం చూస్తే కంటెంట్ మాములుగా ఉండేలా లేదు. పైగా చెన్నైలో కాకుండా విదేశాల్లో బీజీఎమ్ కంపోజింగ్ చేయడమంటే కొత్త వాయిద్యాలతో పాటు డిఫరెంట్ స్కోర్ వినిపించడం ఖాయం. హైదరాబాద్ లో మొదటి రోజు మొదటి ఆట చూడాలని ఫిక్సయ్యానని, కొరటాల శివ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తానని చెప్పడం కొసమెరుపు. అంటే రేపు రిలీజ్ రోజు అనిరుధ్ భాగ్యనగరంలోనే ఉంటాడన్న మాట. ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ లేకపోలేదు.

ఇది కనక అనిరుధ్ రవిచందర్ ఋజువు చేసుకుంటే కనక తనపై పెట్టుకున్న నమ్మకం, ఇచ్చిన రెమ్యునరేషన్ రెండింటికి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. దీని తర్వాత టాలీవుడ్ లో అతనివి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన మేజిక్, విజయ్ దేవరకొండ 12 ఉన్నాయి. మరికొన్ని ఆఫర్లను వెయిటింగ్ లిస్టులో పెట్టాడు. దేవరతో వచ్చే గుర్తింపు బాలీవుడ్ లో తనకు జవాన్ ఇచ్చిన పేరు కంటే ఎక్కువే తెస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. కీలకమైన ఆయుధ పూజ పాటని థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం అందుకే దాచినట్టు ఉన్నారు. రేపీ సమయానికి దేవర జాతకం నిర్ణయమై ఉంటుంది.