తమిళం నుంచి ఓ మోస్తరు స్థాయి సినిమా వచ్చినా తెలుగులో మంచి రిలీజ్ ఉంటుంది. థియేటర్ల సమస్య ఉండదు. ప్రేక్షకాదరణ కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ మొదలుకుని.. శివకార్తికేయన్ లాంటి యంగ్ హీరోల వరకు ఎంతోమందిని మన వాళ్లు ఆదరించారు. వాళ్ల సినిమాలను నెత్తిన పెట్టుకున్నారు.
ఇటీవల విజయ్ సినిమా ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ తెలుగులో ఎంత పెద్ద రిలీజ్ దక్కిందో తెలిసిందే. దానికి అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున 4 గంటలకు షోలు పడ్డాయి. మనవాళ్లు తమిళ చిత్రాలను ఇంతగా నెత్తిన పెట్టుకుంటుంటే.. తమిళులు మన చిత్రాలను ఎలా చూస్తున్నారన్నది చర్చనీయాంశం. ప్రేక్షకాదరణ దక్కాలంటే ముందు మంచి రిలీజ్ ఉండాలి. థియేటర్ల కేటాయింపు ఆశించిన స్థాయిలో ఉండాలి. కానీ ఈ విషయంలో అక్కడి ఎగ్జిబిటర్ల నుంచి సహకారం లభించదు.
రాజమౌళి, ప్రభాస్ సినిమాలను పక్కన పెడితే.. వేరే చిత్రాలకు తమిళనాట థియేటర్లు దొరకడం చాలా కష్టం. ‘దేవర’ సినిమాకు తమిళనాట మంచి బజ్ ఉన్నప్పటికీ థియేటర్ల సమస్య తప్పట్లేదన్నది తాజా సమాచారం. ఈ వారం కార్తి మూవీ ‘మెయ్యళగన్’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అదేమీ భారీ చిత్రం కాదు. హైప్ మరీ ఎక్కువేమీ లేదు. దాంతో పాటుగా ‘దేవర’కు రీజనబుల్ రేంజిలో థియేటర్లు ఇవ్వచ్చు. కానీ ఈ చిత్రానికి సింగిల్ స్క్రీన్లు అసలే ఇవ్వట్లేదు. మల్టీప్లెక్సుల్లో కూడా ఆశించిన స్థాయిలో స్క్రీన్ల, షోలు లభించట్లేదట.
సినిమాకు హైప్ ఉన్నప్పటికీ థియేటర్లు చాలినంత స్థాయిలో దక్కకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడుతున్నట్లు చెన్నై వర్గాల సమాచారం. అదే సమయంలో కార్తి చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది. ఏషియన్ మూవీస్ సునీల్ రిలీజ్ చేస్తుండడం వల్ల దానికి స్క్రీన్లు షోల విషయంలో ఇబ్బంది లేదు. సినిమా బాగుంటే మనవాళ్ల ఆదరణ ఎలా ఉంటుందో కూడా చెప్పాల్సిన పని లేదు. మనం వాళ్ల సినిమాలను ఇంతగా నెత్తిన పెట్టుకున్నా.. వాళ్లు మాత్రం మన చిత్రాలకు తమిళనాట ఎదగనివ్వకపోవడం అన్యాయమే కదా.