చాలా దూరం వెళ్తున్న కార్తీ క్షమాపణ

సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డు వివాదం గురించి మాట్లాడుతూ కార్తీ సెన్సిటివ్ ఇష్యూ అంటూ నవ్వుతు దాటవేయడం పవన్ కళ్యాణ్ కి కోపం తెప్పించింది. పవన్ నేరుగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇలాంటి సున్నితమైన విషయాలను హాస్యాస్పదం చేయొద్దంటూ నేరుగా హెచ్చరిక చేసినంత పని చేశారు. కార్తీ వెంటనే ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెబుతూ అదేదో అనుకోకుండా జరిగిపోయిందని, హిందూ ధర్మం పట్ల అపారమైన గౌరవం ఉన్న తాను తప్పు చేయనని అన్నాడు. పవన్ ఈ స్పందనను స్వాగతించడమే కాక కార్తీని మెచ్చుకుంటూ సినిమాకు విషెస్ చెప్పాడు. ఇది నిన్నటి దాకా జరిగిన కథ.

అందరూ అంతా అయిపోయిందనే అనుకున్నారు. కానీ జరుగుతున్నది వేరు. కార్తీ సారీ చెప్పడం పట్ల తమిళ పరిశ్రమల్లో కొన్ని వర్గాలు గుర్రుగా ఉన్నాయి. నాజర్ ఈ ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం ఎక్స్ వేదికగా వైరలవుతోంది. ఇంకోవైపు సోషల్ మీడియా ట్రోలర్స్ రంగంలోకి దిగి పవన్ మీద సెటైర్లు వేయడం ప్రారంభించారు. కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకోకుండా ఈవెంట్ మాట్లాడిన స్పీచ్ చూడకుండా మీమ్స్, వీడియోలు తయారు చేస్తున్నారు. నిన్న కార్తీ క్షమాపణ చెప్పాక మొదట స్పందించింది అన్నయ్య సూర్య. పవన్ కు ధన్యవాదాలు చెబుతూ డియర్ అని అభిమానంగా సంబోదించాడు.

అయిపోయిన దాన్ని కొందరు ఏదో ప్రయోజనం కోసం పెద్డది చేయడం చూస్తుంటే ఇతరత్రా ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. సత్యం సుందరం ప్రమోషన్లలో బిజీగా ఉన్న కార్తీకి ఇదంతా చికాకు కలిగించే విషయమే. ఈ సినిమా మీద తనకు బోలెడు నమ్మకముంది. ఒక క్లాసిక్ లో నటించాననే ఆనందంతో ప్రతి ఇంటర్వ్యూలోనూ గొప్పగా చెబుతున్నాడు. దేవర లాంటి విపరీతమైన పోటీతో తలపడుతున్న టైంలో జనాన్ని తన సినిమా కోసం థియేటర్లకు రప్పించేందుకు ఏం చేయాలో కార్తీ అంతకన్నా ఎక్కువే చేస్తున్నాడు. ఇలాంటి టైంలో యాంకర్ అనవసరంగా లేవనెత్తిన లడ్డు టాపిక్ వల్ల ఇబ్బందుల్లో పడ్డాడు.