ఈ ఏడాది బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన కిల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో చూశాం. ట్రైన్ లో ఒక రాత్రి జరిగే దొంగతనాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ వయొలెంట్ డ్రామా తెలుగు తమిళ భాషల్లో రీమేక్ కాబోతోందనే వార్త గట్టిగా తిరుగుతోంది. లారెన్స్ హీరోగా రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారని వినిపించింది. కాంబోకి సంబంధించిన ప్రకటన వచ్చింది కానీ అది ఖచ్చితంగా కిల్ రీమేకని చెప్పలేదు. అయితే హక్కులు కొన్న మాట మాత్రం వాస్తవమే. ఈ విషయాన్నలా ఉంచితే ఇటీవలే కిల్ హాట్ స్టార్ లో వచ్చింది.
ఒరిజినల్ వెర్షన్ అలాగే ఉంటే ఇబ్బంది లేదు కానీ తాజాగా తెలుగులో డబ్బింగ్ చేసి దాని ఆడియోని జత చేయడంతో హిందీ రాని జనాలకు శుభ్రంగా చక్కని క్వాలిటీతో కిల్ చూసే అవకాశం దొరికింది. ఒకపక్క రీమేక్ ఏర్పాట్లు జరుగుతుంటే ఇలా అనువాదం చేయడం ఏంటని మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. గతంలో చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రకటించినప్పుడు దాని అసలు మలయాళం లూసిఫర్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్ తో పాటు అందుబాటులో ఉంది. షూటింగ్ జరుగుతున్న టైంలోనూ టీమ్ పట్టించుకోలేదు. దీంతో ఫ్యాన్స్ తో సహా ఎందరో మోహన్ లాల్ వెర్షన్ చూసేశారు.
ఇప్పుడదే తరహాలో కిల్ కూడా రావడం కంటెంట్ మీద ఎగ్జైట్ మెంట్ తగ్గించేస్తుంది. ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారమే అలా చేసి ఉంటారు ఇలాంటి విషయాల్లో నిర్మాతలు జాగ్రత్తగా ఉండటం అవసరం. అందుకే మలయాళం ప్రొడ్యూసర్లు తమ సినిమాను వేరే బాషల వాళ్ళు కొంటారని నమ్మకం ఉంటేనే రైట్స్ ని అట్టిపెట్టుకుంటున్నారు. లేదంటే అన్ని బాషల డబ్బింగ్ హక్కులు ఓటిటికి అమ్మేస్తున్నారు. ఫహద్ ఫాసిల్ ఆవేశం తెలుగులో అందుబాటులో లేకపోవడానికి కారణం ఇదే. కిల్ కు అలా జరగలేదు. కేవలం పది కోట్ల లోపే బడ్జెట్ తో రూపొందిన యాభై కోట్లకు దగ్గరగా వసూలు చేసింది.