సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్ హద్దులు దాటిపోతుంటాయి కానీ.. చాలా వరకు తెలుగు కుర్రాళ్ల మీమ్స్ సినీ జనాలు సైతం ఎంజాయ్ చేసేలా సరదాగా ఉంటాయి. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే దర్శకుల్లో ఒకరైన అనిల్ రావిపూడి.. తన కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు ప్రమోషన్లలో భాగంగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వైరల్ మీమ్ గురించి భలే ఫన్నీగా స్పందించారు.
ప్రతి సంక్రాంతికీ కచ్చితంగా సోషల్ మీడియాలో తిరిగే మీమ్ అది. ఇది సంక్రాంతికి ఫ్యామిలీస్ అంతా ఎంజాయ్ చేసే సినిమా అని ఎవరైనా అంటే.. బదులుగా నేను బజారోడిని అని రిప్లై ఇస్తున్నట్లుగా ఉంటుందా మీమ్. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం రిలీజైనపుడు కూడా ఆ మీమ్ వైరల్ అయింది. ఆ మీమ్ చూసి అనిల్ రావిపూడి విపరీతంగా నవ్వుకున్నాడట. ఆ విషయాన్ని చెబుతూ.. అలాంటి మీమ్స్ వేసే వాళ్లకు సరదాగా పంచ్ ఇచ్చాడు అనిల్.
ఇలాంటి మీమ్స్ వేసే యూత్ కూడా ఫ్యామిలీ భాగమే అని అనిల్ అన్నాడు. నువ్వు బజారోడివి కాదు, నీకు కూడా ఫ్యామిలీలో ఉంది. నువ్వు కూడా అందులో భాగమే అని అనిల్ నవ్వుతూ చెప్పాడు. తన చిన్నతనంలో అబ్బాయిగారు, సుందరకాండ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమాలను తన తల్లిదండ్రులతో కలిసి థియేటరుకు వెళ్లి చూశానని.. వాళ్లకు నచ్చినవి వాళ్లు తీసుకుంటే, తనకు నచ్చిన విషయాలు తాను తీసుకున్నానని.. అలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నానని.. ఇప్పుడు ఆ సినిమాలను చూసి నోస్టాల్జిగ్గా ఫీలవుతానని అనిల్ చెప్పాడు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వస్తే.. అందులో మీనాక్షి చౌదరితో ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉంటుందని.. అది యూత్‌కు నచ్చేదే అని.. అలాగే అందులోని కామెడీని యూత్ కూడా ఎంజాయ్ చేస్తారని అనిల్ అన్నాడు. కాబట్టి ఫ్యామిలీ సినిమాలను యూత్ చూడరు అనేదేమీ ఉండదని అనిల్ అభిప్రాయపడ్డాడు. ఫ్యామిలీ అంటే పిల్లలు, కుర్రాళ్లు, పెద్దవాళ్లు.. ఇలా అందరూ భాగమే కాబట్టి.. నేను బజారోడిని అనడం కరెక్ట్ కాదని అనిల్ మరోసారి నొక్కి వక్కాణించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates