బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ పడుతుంటారు. కానీ కొందరు లిరిసిస్టులు మాత్రం తెలుగు పాట స్ధాయిని కాపాడడానికి తమ వంతుగా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అందులో ఒకరు చంద్రబోస్.

సిరివెన్నెల మరణించిన సమయంలో.. ఆయన పాటించిన ప్రమాణాలను అనుసరిస్తూ, తెలుగు పాటను నిలబెడతామంటూ ఆయన శపథం కూడా చేశారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎలాంటి సినిమాకు పాటలు రాసినా తన ముద్రను చూపిస్తుంటారు చంద్రబోస్.

అగ్ర దర్శకుడు సుకుమార్, ఎంతో అభిమానంతో తన ప్రతి సినిమాకీ బోసుతోనే పాటలు రాయించుకుంటారు. వీరి కలయికలో వచ్చిన చిత్రాల్లో రంగస్థలం చాలా స్పెషల్. దర్శకుడిగా సుకుమార్ ఇందులో ఒక లెవెల్ చూపిస్తే.. సాహిత్యంతో బోస్ కూడా తన స్థాయిని చూపించారు. ఇందులో ప్రతి పాటా ఒక ఆణిముత్యం.

ఇలాంటి గొప్ప పాటల కోసం చంద్రబోస్ అసలు పెన్ను, పేపరే ముట్టుకోలేదట. ఈ విషయాన్ని ఒక పాడ్ కాస్ట్ లో ఆయన వెల్లడించారు. “ఆ సినిమా పాటలు అన్ని కేవలం గంట వ్యవధిలో పూర్తి అయ్యాయి. నేనసలు పెన్ను, పేపరు ముట్టుకోనేలేదు. పాటల లిరిక్స్ అన్ని నోటితోనే చెప్పేశాను. అలాగే రికార్డు అయ్యాయి. ఈ సినిమా నుంచి ఎంత సక్కగున్నావే పాటను రిలీజ్ చేసినపుడు మంచి స్పందన వచ్చాక సోషల్ మీడియాలో లిరిక్ కార్డు పోస్ట్ చెయ్యాల్సి ఉంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు లిరిక్స్ రాసి ఇవ్వమన్నారు. అందుకోసమే పేపర్ మీద రాయాల్సి వచ్చింది. అంతే కానీ అందులో ఏ పాట కోసం కూడా పెన్ను, పేపర్ ముట్టుకోలేదు” అని చంద్రబోస్ వెల్లడించారు.

1995లో తాజ్ మహల్ సినిమాతో గేయ రచయితగా పరిచయం అయిన చంద్రబోస్ ఇప్పటిదాకా 3600 దాకా పాటలు రాశారు. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం కూడా అందుకున్న సంగతి తెలిసిందే.