తమిళ అగ్ర దర్శకుడు శంకర్ ఈ మధ్య ఎంతో ఇష్టపడి ఓ నవలకు సంబంధించి హక్కులు కొనుక్కోగా.. ఆ నవలలోని అంశాలను వేరే సినిమాల్లో అనుమతి లేకుండా వాడేస్తుండడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశన్ అనే రచయిత రాసిన ‘వీర యుగ నాయగన్ వేల్ పారి’ అనే నవల హక్కులను శంకర్ కొంత కాలం కిందట కొనేశారట. ఐతే ఆ నవలలోని కీలక సన్నివేశాలను అనుమతి లేకుండా కాపీ కొట్టి సినిమాలు పెట్టేశారట. ఒకటి రెండు కాదు.. పలు చిత్రాల్లో ఈ సన్నివేశాలు ఉన్నాయంటూ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలే విడుదలైన ఒక మూవీ ట్రైలర్లో కూడా ఆ నవలలోని కీలక సన్నివేశాల ఛాయలు కనిపించినట్లు శంకర్ వెల్లడించారు. క్రియేటర్ల హక్కులను కాపాడాలని.. ఇలా రచనల నుంచి యథేచ్ఛగా చౌర్యం చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో సన్నివేశాలు పెట్టేయడం తప్పు అని.. ఇలాంటివి నివారించాలని శంకర్ కోరారు. ఇలాంటివి ఇక ముందు జరిగితే న్యాయపరమైన చర్యలు తప్పవని శంకర్ హెచ్చరించారు.
శంకర్‌కు సాహిత్యం పట్ల గొప్ప అవగాహన, అభిరుచి ఉన్నాయి. ఆయన సుజాత, జయమోహన్ లాంటి సుప్రసిద్ధ రచయిలతో కలిసి పని చేశారు. ఏదైనా రచనల్లోని అంశాలు నచ్చితే హక్కులు కొని సినిమాల కోసం ఉపయోగించుకుంటారు. ఈ క్రమంలోనే ‘వీర యుగ నాయగన్ వేల్ పారి’ నవల నచ్చి హక్కులు కొన్నారు. కానీ ఇంతలో అందులోని ముఖ్యమైన అంశాలు వేరే సినిమాల్లో రావడం శంకర్‌కు ఆగ్రహం, ఆవేదన తెప్పించాయి.
చివరగా జులైలో ‘ఇండియన్-2’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు శంకర్. ఆ సినిమా శంకర్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఇంకో పార్ట్ కూడా రావాల్సి ఉంది. ఈ లోపు ‘గేమ్ చేంజర్’ మూవీని రెడీ చేసే పనిలో పడ్డారు శంకర్. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 20న విడుదల కాబోతోంది. ‘ఇండియన్-2’ ప్రభావం దీని మీద ఉండదని.. ఈ చిత్రంతో శంకర్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates