స్టార్ల మీద అభిమానం పలు రకాలు. బెనిఫిట్ షోలకు వెళ్లడం, కటవుట్లకు డెకరేషన్ చేయడం, రిలీజ్ రోజు బాణా సంచా డీజే సందడి చేయడం, పదేసిసార్లు సినిమా చూడటం ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఎన్నెన్నో. ఈ మధ్య రీ రిలీజులకు సైతం మనోళ్లు ఎంత హడావిడి చేస్తున్నారో చూస్తున్నాం. పాత చిత్రాలు మహా అయితే రెండు కోట్లు వసూలు చేస్తే గొప్పనుకుంటే ఇప్పుడా నెంబర్ ఏకంగా ఎనిమిది కోట్లు దాటిపోయింది. అయితే తాను మాత్రం వేరే లెవెల్ అంటున్నాడు విగ్నేష్ కాంత్ అనే అభిమాని. సూపర్ స్టార్ రజినీకాంత్ పిచ్చ ఫ్యాన్ అయిన ఇతను ఏకంగా గిన్నిస్ బుక్కులో చోటు సంపాదించుకున్నాడు.
అదెలాగో చూద్దాం. విగ్నేష్ కు యూట్యూబ్ లో బ్లాక్ షీప్ అనే ఛానల్ ఉంది. రజని 50 సంవత్సరాల నట ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక అరుదైన ఫీట్ ఏదైనా చేయాలని భావించి నాన్ స్టాప్ గా యాభై గంటల పాటు ఒక్క సెకండ్ విరామం లేకుండా రెండు రోజులకు పైగా పాడ్ క్యాస్ట్ నిర్వహించాడు. అంపా స్కై వన్ లో జరిగిన ఈవెంట్ లో సెప్టెంబర్ 6 నుంచి మొదలుపెట్టి 8 రాత్రి దాకా అప్రతిహతంగా కొనసాగింది. ఇందులో పరిశ్రమకు చెందిన కో ఫ్యాన్స్ తో పాటు నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లు తమ వీలుని బట్టి పాల్గొన్నారు. దీంతో గిన్నిస్ నిర్వాహకులు సర్టిఫికెట్ ఇచ్చారు.
ఇది రజనీకాంత్ కు తెలియడంతో ఆయనే స్వయంగా ఒక వాయిస్ నోట్ పంపి సంతోషాన్ని పంచుకున్నారు. అయినా డబ్బు ఖర్చయ్యే ఎన్నో పనుల కన్నా ఇది చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎవరూ అందుకోలేని ఒక మైలురాయి సొంతమవుతుంది. విగ్నేష్ కాంత్ చేసింది ఇదే. ఇతని యూట్యూబ్ ఛానల్ లో 40 లక్షల 70 వేల సబ్స్క్రైబర్లు ఉండగా ఇప్పుడీ సంఖ్య అమాంతం పెరగబోతోంది. సినిమాలు, యాత్రలకు సంబంధించిన ఎన్నో వీడియోలు పెట్టడమే ఇతని దినచర్య. ఆదాయం కూడా దాని ద్వారానే బాగా సమకూర్చుకుంటున్నాడు.