సినిమా కోసం తమిళ నటుడు విక్రమ్ ఎంతగా తపిస్తాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాను పోషించే పాత్ర కోసం ఎంతగా అయినా శ్రమించడానికి, అవతారం మార్చుకోవడానికి అతను సిద్ధం. హీరోగా తనకు తొలి బ్రేక్ ఇచ్చిన సేతు సినిమాలో ఒక చోట పాత్ర నల్లగా, బలహీనంగా కనిపించాలని అంటే అందుకోసం తిండి మాని, గంటల తరబడి ఎండలో నిలబడ్డ డెడికేషన్ అతడిది. ఇంకా కెరీర్లో ఎన్నో పాత్రల కోసం ఒళ్లు హూనం చేసుకున్న చరిత్ర అతడికి ఉంది.
ఐతే కాశి సినిమా కోసం తాను పడ్డ కష్టంతో తన చూపే పోయే ప్రమాదంలో పడ్డానని.. కొన్ని రోజులు చూపు మందగించిందని విక్రమ్ వెల్లడించడం విశేషం. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ విషయం తెలిపాడు.
తెలుగులో ఆర్పీ పట్నాయక్ హీరోగా నటించిన శీను వాసంతి లక్ష్మి సినిమా మాతృకే కాశి. ఈ చిత్రంలో విక్రమ్ అంధుడిగా నటించాడు. ఈ మూవీ మంచి హిట్ కావడమే కాక అనేక అవార్డులూ గెలుచుకుంది. ఐతే ఈ సినిమా కోసం కొన్ని నెలల పాటు కళ్లు పైకి పెట్టి నిజమైన అంధుడిలా కనిపించేలా నటించానని.. దీని వల్ల తన కళ్లు దెబ్బ తిన్నాయని విక్రమ్ తెలిపాడు. వైద్యుడిని కలిస్తే.. చూపు మందగించిన విషయం ధ్రువీకరిస్తూ ఇలాగే ఇంకొన్ని రోజులు చేస్తే చూపు పూర్తిగా పోయేదని చెప్పినట్లు విక్రమ్ చెప్పాడు.
తన కెరీర్లో ఇలా ఎక్కువ కష్టపడి ప్రమాదం కొనితెచ్చుకున్న సినిమా ఐ అని వెల్లడించాడు విక్రమ్. ఆ సినిమా కోసం 82 కిలోల నుంచి 52 కిలోలకు బరువు తగ్గానని.. పాత్ర కోసం ఇంకా బరువు తగ్గాలనుకుంటున్న సమయంలో డాక్టర్ తనను హెచ్చరించినట్లు తెలిపాడు విక్రమ్. ఇంకా బరువు తగ్గితే అవయవాలు పని చేయడం మానేస్తాయని.. ప్రాణమే పోతుందని హెచ్చరించడంతో తాను ఆ ప్రయత్నం మానుకున్నానని చెప్పాడు. ఐతే సినిమా కోసం, పాత్ర కోసం ఎంతైనా కష్టపడడానికి తాను ఎప్పుడూ సిద్ధమని, అది తనకెంతో ఆనందాన్నిస్తుందని విక్రమ్ చెప్పడం విశేషం.