నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన బాలకృష్ణ 50వ స్వర్ణోత్సవం అంత వర్షంలోనూ ఘనంగా ముగిసింది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా సెలబ్రిటీలతో పాటు అశేష సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కొత్త జనరేషన్ యువ హీరోలు బాలయ్య పట్ల తమ మనసులో గూడుకట్టుకున్న అభిమానాన్ని ప్రదర్శించారు. సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ కలిసిన అయిదారుసార్లు నిజాయితీ ఉన్నవాళ్ళను బాలయ్య ఖచ్చితంగా ఇష్టపడతారని అర్థమయ్యిందని, ఆయన అనుభవమంత లేని వయసులో స్ఫూర్తిగా తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
విజయ్ దేవరకొండ మాటల్లో యాభై సంవత్సరాల పాటు నటనలో ఉండటమే కాక వైద్య రంగంలోనూ ముద్ర వేసిన బాలయ్య గారి ఆసుపత్రిలో తనకు తెలిసిన వాళ్ళు చికిత్స తీసుకున్న ఉదంతాన్ని గుర్తు చేశాడు. లైగర్ షూటింగ్ లో మొదటిసారి కలుసుకున్న జ్ఞాపకాన్ని పంచుకుని ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకున్నాడు. నాని ప్రసంగిస్తూ తన వయసు కన్నా పదేళ్లు ఎక్కువగా ఈ వేడుకలు జరుగుతున్నాయని, ఒక్కసారి కలిసిన, మాట్లాడిన వెంటనే ఎవరైనా ఇష్టపడే వ్యక్తిత్వమని, ఇలాగే మరో వంద సంవత్సరాలు ఇంకో వంద సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు.
దగ్గుబాటి రానా తన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాలయ్య సినిమా విడుదల రోజే పుట్టాను కాబట్టి అల్లరి చేయడం వచ్చేసిందని చెబుతూ జై బాలయ్య నినాదంతో ముగించాడు. మంచు విష్ణు మాట్లాడుతూ నాన్న మోహన్ బాబు, బాలకృష్ణ గారి వల్లే ఇప్పుడీ స్థానంలో ఉన్నానని, స్వచ్ఛమైన హృదయంతో ఆయన చేసిన సేవలు ఎవరికి సాధ్యం కావని గౌరవం చాటుకున్నాడు. చిన్నప్పుడు డాన్సుల గురించి అడవి శేష్ పంచుకోగా అల్లరి నరేష్ సరదా మనిషిగా బాలయ్యని అభివర్ణించారు. ఇందరు కొత్త జనరేషన్ హీరోల నోటి వెంట బాలకృష్ణ వ్యకిత్వం గురించి వింటున్నప్పుడు కలిగే ఆనందం కన్నా ఫ్యాన్స్ ఇంకేం కోరుకుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates