‘బిగ్ బాస్’లో ఇంకో వారం గడిచిపోయింది. మరో పోటీదారు షో నుంచి వైదొలగక తప్పలేదు. ఆ కంటెస్టంటే.. దేవి నాగవల్లి. ఈ టీవీ9 యాంకర్.. ఎప్పుడు ఎలిమినేషన్లోకి వస్తే అప్పుడు షో నుంచి బయటికి రాక తప్పదని ఒక ముద్ర ముందే పడిపోయింది. అనుకున్నట్లే ఆమె ఎలిమినేషన్లోకి రావడం ఆలస్యం.. వేటు పడిపోయింది. ఐతే బిగ్ బాస్‌లో మూడు వారాల పాటు ఆమె నడవడికను పరిశీలిస్తే మాత్రం ప్రేక్షకులు తప్పులో కాలేశారేమో అనిపించడం ఖాయం.
తొలి వారం షో నుంచి ఎగ్జిట్ అయిన సూర్యకిరణ్ సంగతే తీసుకుంటే.. అతను కొంచెం అగ్రెసివ్‌గా కనిపించడం, తగువులు పెట్టుకోవడంతో వెంటనే నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది. దీంతో అతడి మీద ప్రేక్షకులు వ్యతిరేకత చూపించి షో నుంచి బయటికొచ్చేలా చేశారు. ఐతే ఎలిమినేట్ అయ్యాక హౌస్ నుంచి బయటికొచ్చి సహచరులు ఒక్కొక్కరి గురించి సూర్యకిరణ్ విశ్లేషించిన తీరు, తన మాటల్లో మెచ్యూరిటీ చూశాక తప్పులో కాలేశామా అన్న భావన ప్రేక్షకుల్లో కలిగింది. ఒక వ్యక్తిని త్వరగా జడ్జ్ చేయకూడదనడానికి సూర్యకిరణ్ ఒక ఉదాహరణగా నిలిచాడు.
కట్ చేస్తే ఇప్పుడు దేవి వైదొలిగిన అనంతరం కూడా పలువురిలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవిని టీవీ 9 యాంకర్ అన్న కోణంలోనే చూశారు జనాలు. ఆ ఛానెల్ పట్ల జనాల్లో ఉన్న వ్యతిరేకత ఆమెపై పడింది. టీవీ9ను పక్కన పెట్టి దేవి అంటే ఏంటి అనేది జనాలు చూడలేదు. నిజానికి ఆమె హౌస్‌లో హుందాగానే ఉంది. పరిణతితో వ్యవహరించింది. ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని షోను పూర్తిగా ఫాలో అయిన వాళ్లు అర్థం చేసుకున్నారు.
ఐతే టీవీ9 పట్ల ఉన్న వ్యతిరేకతతో దేవి ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అని తెలియడం ఆలస్యం.. గేమ్ మొదలు కాకముందే ఆమె ఎలిమినేషన్ కోసం నెటిజన్లు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జనసేన మీద విషం కక్కుతోందన్న కారణంతో టీవీ9 ఛానెల్ మీద కోపం పెంచుకున్న మెగా అభిమానులు దేవిని ఎలాగైనా బయటికి పంపించాలని కాచుకుని ఉన్నారు. ఆమె ఎలిమినేషన్లోకి రావడం ఆలస్యం.. షో చూడని వాళ్లు కూడా దేవికి వ్యతిరేకంగా పని చేసి అనుకున్నది సాధించారు. దీంతో మరో మంచి కంటెస్టెంట్ షోకు దూరమైంది.