హైదరాబాద్ మాస్ థియేటర్లో విజయ్ చూసిన సినిమా

మాములుగా స్టార్ హీరోలు బయటికి రావడమే పెద్ద తతంగం. బౌన్సర్లను పెట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసే అభిమానుల మధ్య ఎక్కడికైనా వెళ్లాలన్నా ఇబ్బందే. ఆఖరికి తమ స్వంత సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లినా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది రెండు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరో హైదరాబాద్ లోకల్ సింగల్ స్క్రీన్ లో రెండో క్లాస్ టికెట్ తీసుకుని వేరే హీరో ప్యాన్ ఇండియా మూవీ చూశాడంటే నమ్మగలమా. కానీ స్వయంగా అతని కో స్టార్ చెప్పినప్పుడు అంత కంటే సాక్ష్యం ఏం కావాలి. ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ప్రమోషన్ల సందర్భంగా వైభవ్ ఇది పంచుకున్నాడు.

గత డిసెంబర్ లో విజయ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు సాయంత్రం ఏదైనా సినిమా వెళ్లాలనుకున్నాడు. పివిఆర్ లాంటి మల్టీప్లెక్స్ లో చూద్దామాని వైభవ్ తో పాటు దర్శకుడు వెంకట్ ప్రభు అడిగారు. అక్కడ చూస్తే కిక్కేముంటుంది, వద్దని చెప్పి, హైదరాబాద్ లో ఊర మాస్ థియేటర్ ఏదో కనుక్కుని అందులో స్క్రీన్ కు దగ్గరగా ఉండే 80 రూపాయల సెకండ్ క్లాస్ టికెట్లు కొనమని ముందే చెప్పారట. అక్కడికి వెళ్ళేదాకా వైభవ్ కి ఇది తెలియదు. తీరా టికెట్లు చూసి పొరపాటు పడ్డారేమో అని మేనేజర్ అడగబోతే విజయ్ వద్దని వారించి తనే వాటిని అడిగానని చెప్పడంతో షాక్ తినడం ఇతని వంతైంది.

అలాని ఓపెన్ గా అందరికీ కనిపించేలా విజయ్ వెళ్ళలేదు కానీ గుర్తుపట్టకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మాములుగా ఇలా దొంగచాటుగా హీరోయిన్లు సినిమాలకు వెళ్తుంటారు కానీ హీరోలు అరుదు. అందులో విజయ్ ఈ సాహసం చేయడమంటే విశేషమే. షారుఖ్ ఖాన్ డంకీని కాదని సలార్ కే ఓటు వేయడం కూడా వైభవ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇక్కడైతే చెల్లింది కానీ అదే చెన్నైలో విజయ్ కనక ఈ రిస్క్ చేసుంటే థియేటర్ ని మరమత్తులు చేయాల్సి వచ్చేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు, అనుభూతులు స్టార్ హీరోలకు అవసరమే.