వాస్తవానికి అక్టోబర్ 10 జూనియర్ ఎన్టీఆర్ దేవర రావాల్సింది. కానీ ఓజి సెప్టెంబర్ 27 నుంచి తప్పుకోవడంతో మంచి డేట్ ని వదులుకోవడం ఎందుకనే ఉద్దేశంతో నిర్మాతకు ముందుకు జరిపారు. ఇప్పుడా పదో తేదీ మీద కోలీవుడ్ పెద్ద స్కెచ్చే వేసింది. సూర్య హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువని కొన్ని వారాల క్రితమే అక్టోబర్ 10 గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు స్టూడియో గ్రీన్ అధికారికంగా ప్రకటించింది. పోటీకి ఎవరు రారని, ఒకవేళ వచ్చినా పార్ట్ 1 చూసి పార్ట్ 2 టైంకి అందరూ తప్పుకుంటారని నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్స్ బాగా వైరలయ్యాయి.
అప్పటిదాకా ఆగడం ఎందుకు ఇప్పుడే చూసుకుందామని కవ్వించిన తీరులో రజనీకాంత్ వెట్టయన్ అక్టోబర్ 10 విడుదల చేయబోతున్నట్టు లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా డిస్ట్రిబ్యూటర్ల గుండె ఝల్లుమంది. మనదగ్గర సమస్య లేదు కానీ తమిళనాడులో రెండు పెద్ద గ్రాండియర్లకు ఒకే రోజు థియేటర్లను భారీ ఎత్తున కేటాయించే పరిస్థితి లేదు. కనీసం ఒక రోజు గ్యాప్ ఉంటే టాక్ ని బట్టి షోల సర్దుబాటు జరిగేది. కానీ వెట్టయన్ టీమ్ తగ్గేదేలే అంటూ కంగువని ఢీ కొట్టేందుకు సిద్ధ పడటం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడింకో ట్విస్టు ఉంది.
అక్టోబర్ 11న కన్నడ హీరో ధృవ సర్జ నటించిన మార్టిన్ పన్నెండు భాషల్లో రిలీజ్ కానుంది. దీనికి సైతం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ధృవ ఇమేజ్, మార్కెట్ పరంగా సూర్య, రజనీకాంత్ రేంజ్ కాదు కానీ కంటెంట్ చూస్తే ఏదో పెద్ద సెటప్ పెట్టినట్టు ట్రైలర్ చూశాక అర్థమయ్యింది. దీని సంగతి పక్కనపెడితే కంగువ, వెట్టయన్ రెండూ ఏపీ, తెలంగాణకు సంబంధించి క్రేజీ నిర్మాతల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. రజని మూవీకి పధ్నాలుగు కోట్ల డీల్ జరిగిందట. కంగువకు ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది కానీ ఎంతనేది బయటికి రాలేదు. పోటీ మాత్రం మహా రసవత్తరంగా జరిగేలా ఉంది.