శత్రు సంహారానికి ‘శనివారం’ సూర్య

గత ఏడాది రెండు ఘనవిజయాలు దసరా, హాయ్ నాన్న రూపంలో సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఈసారి సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. భారీ అభిమాన సందోహం మధ్య వేడుకను నిర్వహించారు. అంటే సుందరానికి తర్వాత పూర్తి విభిన్నమైన జానర్ తో నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ చేతులు కలిపారు. అంచనాల పరంగా ఓ రేంజ్ హైప్ మోస్తున్న సరిపోదా శనివారం కంటెంట్ మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది.

కథను దాచే ప్రయత్నం చేయలేదు. సోకులపాలెంలో పుట్టడమే నేరంగా భావించే చోట పోలీస్ ఆఫీసర్ దయ (ఎస్జె సూర్య) అక్కడి ప్రజల మీద కిరాతకంగా విరుచుకు పడుతూ ఉంటాడు. ఎంత కోపం వచ్చినా అణుచుకుని దానికి కారణమైన వాళ్ళను శనివారం వెతికి మరీ బుద్ధిచెప్పే సూర్య (నాని) కు ఆ వాడకు వెళ్లాల్సిన అవసరం పడుతుంది. తండ్రి (సాయికుమార్) వద్దని వారించినా దయతో తలపడేందుకు సిద్ధ పడతాడు. యముడు, చిత్రగుప్తుడు ఒకే మనిషిలో ఉంటే ఏమవుతుందో నిలువెత్తు రూపంగా కనిపించే సూర్య సోకులపాలెం జనాన్ని కాపాడేందుకు దయా దుర్మార్గాన్ని ఎలా ఎదిరించాడనేది తెరమీద చూడాలి.

తన స్టయిల్ కి భిన్నంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంని ఒక కంప్లీట్ యాక్షన్ కం రివెంజ్ థ్రిల్లర్ గా రూపొందించిన తీరు ఆసక్తిని పెంచేలా ఉంది. పెద్ద క్యాస్టింగ్, భారీ బడ్జెట్ తో పాటు గతంలో వినని ఒక స్టోరీ పాయింట్ తీసుకుని అంచనాలు పెంచడంలో సక్సెసయ్యాడు. జేక్స్ బిజోయ్ బీజీఎమ్ ఎలివేషన్ ని మరో స్థాయికి తీసుకెళ్లగా సోషల్ మీడియా ఫ్యాన్స్ వాడే పోతారు అందరూ పోతారు ఊతపదాన్ని నానితో పలికించడం పేలింది. కానిస్టేబుల్ గా ప్రియాంక మోహన్ అలా మెరిసింది. నెలాఖరులో దసరాని మించే మాస్ మసాలా విందు భోజనానికి సూర్య అందించిన ఆహ్వానం ఉత్సుకత రేపడంలో విజయవంతమయ్యింది.