చిరు, పవన్, చరణ్ కలిసి నటిస్తే..?

రామ్ చరణ్ సినిమా ‘మగధీర’లో చిరంజీవి క్యామియో రోల్ చేశాడు. చిరు హీరోగా చేసిన ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఇక చిరు సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్’లో పవన్ అతిథి పాత్రలో మెరిశాడు. ఐతే ఈ ముగ్గురూ ఎన్నడూ కలిసి నటించింది లేదు. ఐతే ఈ మెగా త్రయంతో ఏకంగా మల్టీస్టారరే ప్లాన్ చేస్తున్నాడట స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఇది ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో కానీ.. హరీష్ శంకర్ అయితే ఈ కలయికలో సినిమాకు సబ్జెక్ట్ రెడీ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

ప్రస్తుతం పెద్ద డైరెక్టర్లందరూ భారీ స్పాన్ ఉన్న, పాన్ ఇండియా సినిమాలు ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఎప్పట్నుంచో పాన్ ఇండియా సినిమాలే తీస్తుండగా.. సుకుమార్ ‘పుష్ప-2’తో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయాడు. అల్లు అర్జున్‌తో చేయబోయే కొత్త చిత్రంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన రేంజ్ పెంచుకోబోతున్నట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మీ సంగతి ఏంటి అని హరీష్‌ను అడిగితే.. “పాన్ ఇండియా సినిమాలు చేయాలి అనుకుంటే చేయలేం. వెయ్యి కోట్లు పెట్టి బాహుబలి చేయమంటే చేయలేం. కానీ బాహుబలి లాంటి సినిమా తయారైతే అది రెండు వేల కోట్లకు వెళ్తుంది. పుష్ప చేస్తున్నపుడు సుకుమార్ గారు పాన్ ఇండియా అనుకుని ఉండరు. రిలీజ్ తర్వాత అది ఆ స్థాయికి వెళ్లింది. కాంతార కూడా అంతే. నేను పర్టికులర్‌గా పాన్ ఇండియా సినిమా చేయాలని అని చేయను. నా దగ్గర పెద్ద కాన్వాస్‌లో కొన్ని కథలు ఉన్నాయి.

ఇండియా-పాకిస్థాన్ బోర్డర్లో జరిగే ఓ ప్రేమకథ ఉంది. అది చేస్తే పాన్ ఇండియా స్థాయికి వెళ్లొచ్చు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌ ముగ్గురూ కలిసి నటిస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా అనుకుని కథ రాశాను. అది కనుక చేస్తే పాన్ ఇండియా సినిమాలకు బాబు లాంటి చిత్రం అవుతుంది. చూడాలి ఏమవుతుందో” అని హరీస్ చెప్పాడు.