మలయాళ హీరోనే అయినా దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మహానటితో ప్రూవ్ చేసుకుని డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటేతో సూపర్ హిట్ కొట్టాక క్రమంగా డిమాండ్ పెరుగుతూ పోయింది. సీతారామంతో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. దెబ్బకు ఆఫర్లు క్యూ కట్టాయి. కల్కి 2898 ఏడిలోనూ చిన్న క్యామియో చేశాడు. అయితే మాతృభాష కంటే అతను టాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అభిమానులని ఆశ్చర్యపరుస్తోంది. నిన్న అతని పుట్టినరోజు సందర్భంగా మల్లువుడ్ నుంచి ఒక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేకపోవడమే దీనికి నిదర్శనం.
ప్రస్తుతం దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ సెప్టెంబర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిన్న టీజర్, పాటలు వచ్చేశాయి. ఆగస్ట్ 15 హడావిడి తగ్గాక ప్రమోషన్ల వేగం పెంచబోతున్నాడు. ధనుష్ సార్ ఫలితం చూశాక కోరిమరీ దర్శకుడు వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చాడు దుల్కర్. అగ్ర బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఆకాశంలో ఒక తార ప్రకటన నిన్న అఫీషియలయ్యింది. పవన్ సాధినేని ట్రాక్ రికార్డు బాక్సాఫీస్ పరంగా ఏమంత మెరుగ్గా లేకపోయినా స్వప్న సినిమా అధినేతల నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. కల్కి పార్ట్ 2లో ఎక్కువ నిడివి చేయబోతున్నాడని టాక్ ఉంది.
ఇదిలా ఉండగా మలయాళంలో దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దర్శకులు ఇద్దరున్నారు. వాళ్ళు సౌభిన్, నహాస్ హిదాయత్. కానీ ఇవి ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇతరత్రా కారణాల వల్ల ఆలస్యమవుతూ ఉన్నాయి. నిన్న ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తే జరగలేదు. కానీ తెలుగు నుంచి వచ్చాయి. చూస్తుంటే దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. త్వరగా ఎదగడంతో పాటు రెమ్యునరేషన్లు, గ్రాండియర్లు ఇక్కడ ఎక్కువ కాబట్టి ప్రాధాన్యత మారిందేమో. తండ్రి మమ్ముట్టి లాగా దుల్కర్ వేగంగా సినిమాలు చేయకపోవడం గమనార్హం.