శివ కాదని మాస్ ఎందుకు తెస్తున్నారు

వచ్చే నెల ఆగస్ట్ 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా శివ రీ రిలీజ్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ చెప్పడం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఎప్పుడో 1989లో వచ్చిన బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు నలభై కంటే తక్కువ వయసున్న వాళ్లకు దాని థియేటర్ ఎక్స్ పీరియన్స్ లేదు. టాలీవుడ్ గమనాన్ని మార్చిన సిల్వర్ స్క్రీన్ వండర్ ని పెద్దతెరపై చూసుకోవచ్చని సినీ ప్రియులు సంబర పడ్డారు. తీరా చూస్తే ఇప్పుడు శివ స్థానంలో లారెన్స్ దర్శకుడిగా పరిచయమైన మాస్ ని రెడీ చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం 4K, డాల్బీ సౌండ్ కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.

అసలు శివని ఎందుకు తప్పించారనే ప్రశ్నకు అన్నపూర్ణ వర్గాల నుంచి సరైన సమాచారం లేదు కానీ ఇన్ సైడ్ టాక్ వేరే ఉంది. శివ నెగటివ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. వాటిని రీ మాస్టర్ చేసేందుకు సరిపడా టెక్నాలజీ నాగ్ బృందం వద్ద ఉన్నప్పటికీ రెండు మూడు రీళ్లతో వచ్చిన సమస్య వల్ల మొత్తం ప్రింట్ ని సరైన రీతిలో కన్వర్ట్ చేయలేకపోతున్నారట. దీనికి చాలా ఎక్కువ సమయం అవసరం ఉండటంతో హడావిడి ఎందుకు లెమ్మని ఫ్యాన్స్ నిరాశ చెందకుండా శివ స్థానంలో మాస్ ని తెస్తున్నారని తెలిసింది. ఆగస్ట్ 28 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయని అంటున్నారు.

మొత్తానికి శివ లేకపోవడం అధిక శాతం మూవీ లవర్స్ ని నిరాశపరిచే వార్త. ఈ క్లాసిక్ మంచి క్వాలిటీ ఇప్పటికీ ఆన్ లైన్ లో అందుబాటులో లేదు. అలాంటిది సరికొత్త సాంకేతికతతో చూసే ఛాన్స్ దొరికుతుందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. సరే దానికి ఎవరేం చేయలేరు కానీ మాస్ కూడా మంచి థియేటర్ కంటెంటే. కొంత కాలం ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన నాగార్జునలోని కమర్షియల్ పొటెన్షియాలిటీని మరోసారి బయటికి తీసింది మాసే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రఘువరన్ రాహుల్ దేవ్ విలనిజం, సునీల్ ఫ్రెండ్ షిప్ ఎపిసోడ్, జ్యోతిక ఫ్లాష్ బ్యాక్ అన్నీ పైసా వసూల్ అంశాలే.