థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో వచ్చాక ప్రశంసలు అందుకుంటున్న మహారాజ తమిళంతో పాటు తెలుగులోనూ అంతే స్పందన తెచ్చుకోవడం చూశాం. సినిమాలో విజయ్ సేతుపతి వెతుకుతున్న హంతకుడిని పట్టించే క్రమంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన నటుడి పేరు నటరాజన్ సుబ్రమణియం. అందరూ అనుకున్నట్టు ఇతనేదో మాములు నటుడు కాదు. మన టాలీవుడ్ తోనూ కనెక్షన్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన నితిన్ అ ఆకు డూడ్లీతో కలిసి ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వహించాడు. చల్ మోహనరంగాకు సోలోగా పని చేసి మెప్పించాడు.
ఇతని ఘనత కేవలం ఇక్కడికే పరిమితం కాదు. ముఖ్యంగా ఎన్నో హిందీ సూపర్ హిట్ మూవీస్ లో భాగం పంచుకున్న ట్రాక్ రికార్డు ఉంది. జబ్ వీ మెట్, బ్లాక్ ఫ్రైడే, పరిణీత, గోల్మాల్ రిటర్న్స్, లవ్ ఆజ్ కల్, నాక్ అవుట్ లాంటి ఎన్నో బాలీవుడ్ క్లాసిక్స్ కి కెమెరామెన్ గా పని చేసి ప్రశంసలు, అవార్డులు దక్కించుకున్నాడు. నితిన్ చల్ మోహనరంగ తర్వాత బ్రేక్ తీసుకుని యాక్టర్ గా మారిపోయి అప్పటి నుంచి కెరీర్ ని ఇంకో దిశగా మలుచుకున్నాడు. ఒక టాప్ టెక్నీషియన్ రెండు విభాగాల్లో ఇంత పేరు తెచ్చుకోవడం అరుదు. ఇతను కోలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుల్లో ఒకడిగా మారిపోయాడు.
మనం ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే త్రివిక్రమ్ తో ఉన్న బాండింగ్ వల్లే. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నటరాజన్ సుబ్రమణియంకు ఆ కోరిక కూడా త్వరలోనే నెరవేరబోతోంది. అది కూడా మొదటి అవకాశం ఇచ్చిన మాటల మాంత్రికుడి ద్వారానే అని ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా కష్టపడే తత్వం ఉంటే ఎందులోనైనా నిలదొక్కుకోవచ్చని చెప్పేందుకు ఇతనే మంచి ఉదాహరణ. సతురంగ వెట్టై తర్వాత మహారాజ తనకు చాలా పేరు తెచ్చింది. చాలా మంది దర్శకులు ఆఫర్లు ఇస్తున్నారట. ఇంత బిజీగా ఉన్నప్పుడు ఇక కెమెరా వెనుక పనేముంది.