హీరో ధనుష్ కు తెలుగులో డీసెంట్ మార్కెట్ ఉంది. అందుకే ఏరికోరి మంచి కథ కోసం ఎదురు చూసి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ సార్ చేశాడు. సితార నిర్మాణం కావడంతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కాన్సెప్ట్ ని తెరకెక్కించిన విధానం భారీ విజయం అందుకునేలా చేసింది. రఘువరన్ బికెట్ తర్వాత అంత సక్సెస్ అయిన ధనుష్ మూవీ ఇదే. ఆ తర్వాత నేనే వస్తున్నా డిజాస్టర్ కాగా కెప్టెన్ మిల్లర్ కనీస స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. వచ్చే వారం ఆగస్ట్ 26 రాయన్ వస్తోంది. ప్రమోషన్ల కోసం రేపు హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు.
ఇప్పుడీ సినిమా మీద పెద్దగా బజ్ లేదు. సందీప్ కిషన్ ఉన్నప్పటికీ ఆ ఫ్యాక్టర్ ని అంతగా హైలైట్ చేసుకోవడం లేదు. ఏఆర్ రెహమాన్ సంగీతమంటే ఆశ్చర్యపోయేవాళ్లు చాలానే ఉన్నారు. ఎస్జె సూర్య విలన్ గా నటించిన ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. వీటికి సరైన రీతిలో మార్కెటింగ్ జరగాలి. అప్పుడే ఓపెనింగ్స్ చూడొచ్చు. సార్ రేంజ్ లో బజ్, టాక్ వచ్చాయంటే మాత్రం ఒక మంచి వీకెండ్ తెలుగులో దొరుకుతుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వయొలెంట్ గా రూపొందిన రాయన్ కి ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. పా పాండి తర్వాత చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టాడు.
విజయ్ సేతుపతి మహారాజ తరహాలో ఇది కూడా వర్కౌట్ అయితే బాగుంటుందని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 ఏడి వచ్చి నెల దాటుతున్న తరుణంలో ఆ సినిమా ఇక ఎక్కువ రోజులు థియేటర్లను ఫీడ్ చేయలేదు. ప్రధాన కేంద్రాల్లో వారాంతాలు మినహాయించి దాదాపు అన్ని చోట్ల నెమ్మదించేసింది. ప్రేక్షకులు భారీగా చూసేశారు. కల్కికి రాయన్ కి మధ్యలో ఏకంగా రెండు వారాల గ్యాప్ వచ్చింది. భారతీయుడు 2, డార్లింగ్ నిరాశపరచడం వల్ల మళ్ళీ సినిమా హాళ్లు బోసి పోతున్నాయి. రాయన్ కు డీసెంట్ టాక్ రావడం కీలకం. ఆ బరువు హీరో దర్శకుడుగా ధనుష్ సార్ మీదే ఉంది.