చంద్ర‌బాబు గారూ… నంది అవార్డులు ప్ర‌క‌టించండి సార్

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు. కానీ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులు అట‌కెక్కేశాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొన్నేళ్లు అవార్డులిచ్చింది. ఆ ప్ర‌భుత్వం పోయాక.. జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అస‌లు అవార్డుల సంగ‌తే ప‌ట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను తీసుకొచ్చి కొన్నేళ్ల‌కు క‌లిపి ఒకేసారి పుర‌స్కారాలు ప్ర‌క‌టించింది. 2025కు గాను తాజాగా అవార్డులు ప్ర‌క‌టించారు. మ‌రి ఏపీలో నంది అవార్డుల పునరుద్ధ‌ర‌ణ ఎప్పుడా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.

ఉగాదికి అవార్డులు ఉంటాయ‌ని చ‌ర్చ జ‌రిగింది కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించ‌డం లేదు. తమ సంస్థ‌లో తెర‌కెక్కిన చిత్రాల‌కు గాను గ‌ద్ద‌ర్ అవార్డులు అందుకున్న విజేత‌ల‌ను అభినందిస్తూ ఈటీవీ విన్ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి అతిథులుగా వ‌చ్చిన ఆర్.నారాయ‌ణ‌మూర్తి, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ నంది అవార్డుల గురించి మాట్లాడారు.

తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్ అవార్డులు ఇవ్వ‌డం గొప్ప విష‌యం అంటూ కొనియాడిన నారాయ‌ణ మూర్తి.. ఏపీ ప్ర‌భుత్వానికి నంది అవార్డుల విష‌యంలో విజ్ఞ‌ప్తి చేశారు. నంది అవార్డుల‌ను సినిమా వాళ్లు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారని.. ఎంతో గొప్ప‌వారు, పెద్ద వారైన చంద్ర‌బాబు పెద్ద మ‌న‌సు చేసుకుని నంది అవార్డుల‌ను ఇచ్చే ప్ర‌య‌త్నం చేయాల‌ని.. నారాయ‌ణ‌మూర్తి విన్న‌వించారు.

త‌మ్మారెడ్డి మాట్లాడుతూ.. సినిమా వాళ్ల‌కు అవార్డులు ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వాలు అంత ఉత్సాహం చూప‌వ‌ని.. అందుకు టైం లేద‌ని అనుకుంటాయ‌ని వ్యాఖ్యానించారు. ఐతే తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం చాలా త‌క్కువ స‌మ‌యంలో గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింద‌న్నారు.

ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌డం, వాటిని జ్యూరీ ప‌రిశీలించ‌డం.. అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం.. ఇదంతా కేవ‌లం 40-45 రోజుల్లోనే పూర్త‌యింద‌ని.. ప్ర‌భుత్వం అనుకుంటే ఎంత త‌క్కువ సమ‌యంలో అయినా అవార్డులు ఇవ్వొచ్చు అన‌డానికి ఇది రుజువు అని ఆయ‌న పేర్కొన్నారు.