వివాదం రేపుతున్న డబల్ ఇస్మార్ట్ సాంగ్ !

ఇటీవల మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నోటి నుండి పాపులర్ అయిన ‘ఆ కుర్చీని మడతపెట్టి’ అంటూ ఒక వాయిస్ ముందు పెట్టి ఒక పాటను తీసుకువచ్చారు. గుంటూరు కారం ప్రేక్షకులను అలరించలేకపోయినా ఆ పాట మాత్రం భారీ ఎత్తున హిట్ అయింది. దాంతో సోషల్ మీడియాలో అప్పటికే పాపులర్ అయిన ఆ వ్యక్తి మరింత పాపులర్ కావడం జరిగింది.

మరి దానినే స్ఫూర్థిగా తీసుకున్నాడో ఏమోగానీ డబల్ ఇస్మార్ట్ సినిమాలో కల్లు దుకాణం వద్ద ఉండే ఓ పాట మధ్యలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ‘అయితే ఏం చేద్దామంటవ్ మరి’ అని మీడియా సమావేశాలలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాటను ముందు పెట్టడం తీవ్ర దుమారం రేపుతుంది. కల్లు దుకాణం వద్ద చిత్రీకరించే పాటకు కేసీఆర్ వాయిస్ తీసుకోవడం తీవ్రంగా అవమానించడమేనని విమర్శలు మొదలయ్యాయి.

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తుండగా చార్మి కౌర్ నిర్మిస్తున్నది. మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యాం రాశారు. అయితే ఒక పాట విడుదల చేస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడి మీదనే అన్ని బాధ్యతలు ఉంటాయి. సినిమా అనేది సమాజం మీద ప్రభావం చూయించే రంగాలలో ప్రధానమయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి వాయిస్ ను తీసుకుంటున్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సున్నితమైన అంశాలు అనవసర వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో డబల్ ఇస్మార్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.