నాని పరిచయం చేస్తున్న మరో టాలెంట్

న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాక నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకోవడం చూస్తున్నాం. ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మని దర్శకుడిగా ఇండస్ట్రీకి అ! ద్వారా పరిచయం చేసింది నానినే. మాములుగా వింటేనే కాంప్లికేటెడ్ గా అనిపించే అలాంటి కథను ఒప్పుకోవడమే సాహసం. అలాంటిది ఏకంగా నిర్మించి అడిగిన స్టార్ క్యాస్టింగ్ తీసుకొచ్చి లాభాలు ఆశించకుండా రిస్క్ చేయడం నిజంగా విశేషమే. ఆ తర్వాత హిట్ ది ఫస్ట్ కేస్ ద్వారా శైలేష్ కొలనుని ఇంట్రొడ్యూస్ చేస్తే తర్వాత అతను అడివి శేష్, వెంకటేష్ తో చేసి ఇప్పుడు నానితోనే హిట్ 3 ది థర్డ్ కేసు తీయబోతున్నాడు.

ఇప్పుడు జగదీశ్ అనే మరో కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీకి నాని తీసుకురాబోతున్నాడు. తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద ప్రియదర్శి హీరోగా ఇది రూపొందుతుందని ప్రకటించాడు. నిన్న హైదరాబాద్ లో జరిగిన డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ప్రకటించడానికి ఇంత కన్నా మంచి సమయం లేదని అందుకే చెబుతున్నానని జగదీశ్ ని వేదిక పైకి పిలిచి మరీ అనౌన్స్ చేశాడు. అంతే కాదు ఇతని పేరు భవిష్యత్తులో బలంగా వింటారని కూడా హామీ ఇచ్చాడు. సో ప్రశాంత్ వర్మ తరహాలో మరో గొప్ప ప్రతిభను నాని వెలికి తీసినట్టు కనిపిస్తోంది.

నిజానికి హీరోలు ఇలా డెబ్యూ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా పరిశ్రమలో కొత్త రక్తం వస్తుంది. క్రియేటివిటీ పదును పడుతుంది. ఎంతసేపూ సరైన కథలు దొరకడం లేదు, దర్శకులు తీయడం లేదని నిట్టూర్చడం కన్నా ఉన్నంతలో రిస్క్ లేని బడ్జెట్ ఖర్చు పెడుతూ హీరోగా నటించకపోయినా సరే నిర్మాతగా వెన్ను తట్టడం పలు రకాలుగా ఉపయోగపడుతుంది. నాని చేస్తోంది ఇదే. పదులు వందల కోట్లతో సినిమాలు తీయాలనుకోవడం లేదు. చిన్న హీరోలతో ప్రయోగాలు చేస్తూనే పెట్టుబడి ఢోకా లేని తెలివైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ గా ఎంతో సంతృప్తినిచ్చే ప్రయత్నమిది.