ప్రతి సన్నివేశం అత్యద్భుతంగా వచ్చినందు వల్లే ఏ ఒక్క సీన్ ని ఎడిటింగ్ లో తీసేయలేదని దర్శకుడు శంకర్ భారతీయుడు 2 ఈవెంట్లలో చెప్పిన సంగతి తెలిసిందే. ఫుటేజ్ చూశాకే ఇండియన్ 3 నిర్ణయం తీసుకున్నామని కూడా అన్నారు. తీరా చూస్తే టాక్ ఊహించని విధంగా రావడంతో పాటు తెలుగు కంటే ఎక్కువగా తమిళంలోనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ ప్రధానంగా ఎత్తి చూపిస్తున్న లోపం నిడివి గురించే. 3 గంటల 4 నిమిషాల లెన్త్ ఈ కథకు చాలా ఎక్కువనే అభిప్రాయం మెజారిటీ నుంచి వ్యక్తమయింది.
ఈ అంశాన్ని దర్శకుడు శంకర్ సీరియస్ గా పరిగణనలోకి తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. సుమారు 20 నిమిషాల పాటు ట్రిమ్ చేయాలనే దిశగా కసరత్తు మొదలుపెట్టారట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇలాంటి ఎపిసోడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సిద్దార్థ్ స్నేహితుల ఫ్యామిలీ బ్లాక్స్ ని అవసరానికి మించి సాగదీశారు. పైగా రిపీట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది. దాంతో పాటు క్లైమాక్స్ లో మోనో రైడర్ సైకిల్ వేసుకుని కమల్ హసన్ తో డిజైన్ చేసే ఛేజ్ సైతం ల్యాగ్ అనిపించింది. ఇక పాటల సంగతి సరేసరి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని తగ్గిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ చర్చలైతే జరుగుతున్నాయట. అదేదో ముందే చేసి ఉంటే కొంత డ్యామేజ్ తగ్గి ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఇండియన్ 3 కోసం అక్కర్లేని ఎన్నో ఎలిమెంట్స్ జొప్పించారనే పాయింట్ ని దాదాపు రివ్యూలన్నీ ఎత్తిచూపాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడీ స్ట్రాటజీ ఎంతమేరకు ఫలితం ఇస్తుందో చూడాలి. శంకర్ కెరీర్లో ఫ్లాపులుగా చెప్పుకునే స్నేహితుడు, ఐలను దాటుకుని భారతీయుడు 2 నిలుస్తుందనే అంచనా నిజం కాకూడదని అయన ఫ్యాన్స్ కోరిక. చూడాలి మరి ఉపశమనం కలిగించేందుకు ఏ డెసిషన్ తీసుకుంటారో.