‘క్వాలిటీ’పై శంకర్ క్లారిటీ

దర్శకుడు శంకర్‌ను తెలుగు వాళ్లు తమిళుడిగా చూడరు. తమిళ హీరోలను ఎలా అయితే నెత్తిన పెట్టుకున్నారో శంకర్ లాంటి దర్శకులను కూడా అంతే గొప్పగా ఆదరించారు. పోస్టర్ మీద శంకర్ పేరుంటే చాలు హీరో ఎవరన్నది పట్టించుకోకుండా థియేటర్లకు వెళ్లిపోతారు. ఆయన తెలుగు స్టార్లతో సినిమాలు చేయాలని మన ప్రేక్షకులు ఎంతగానో ఆశించారు. వారి సుదీర్ఘ నిరీక్షణకు మూడేళ్ల కిందట తెరపడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో శంకర్ ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టడం మన ప్రేక్షకులకు అమితానందాన్నిచ్చింది. కాకపోతే ఈ సినిమా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యమైంది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపిస్తోందీ చిత్రం.

ఐతే ఈ మూవీ క్వాలిటీ విషయంలో మన ప్రేక్షకులకు కొంత అనుమానాలున్నాయి. ఈ మూవీ చేస్తున్నపుడే.. ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించాల్సి రావడమే అందుక్కారణం. ఒకేసారి రెండు చిత్రాలను తెరకెక్కించడంతో ఆ ప్రభావం ఔట్ పుట్ మీద పడి ఉంటుందా అనే సందేహాలున్నాయి.

ఇదే విషయాన్ని ‘భారతీయుడు-2’ ప్రెస్ మీట్లో ప్రస్తావనకు వచ్చింది. దీనికి శంకర్ బదులిస్తూ.. “క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. నాకు కొవిడ్ టైంలో దొరికిన ఖాళీలో ‘భారతీయుడు-2’లో మిగిలిన పార్ట్ మొత్తానికి క్రియేటివ్ వర్క్‌తో పాటు అన్నీ పూర్తి చేశాను. ఎప్పుడు ఆ సినిమా పున:ప్రారంభమైనా మళ్లీ కొత్తగా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా అన్నీ పూర్తయ్యాయి. దీంతో రెండు సినిమాలు తీయడంలో నాకు ఎలాంటి అసౌకర్యం కనిపించలేదు. ఒకవేళ దీని వల్ల క్వాలిటీ మీద ఏమైనా ప్రభావం పడుతుందేమో అని నాతో సహా అందరూ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టారు. అందు వల్ల క్వాలిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు. నేను ఒక టైంలో ఒక సినిమా చేస్తున్నపుడు ఎలాంటి క్వాలిటీ చూపిస్తానో.. అదే క్వాలిటీ రెండు సినిమాల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప తగ్గదు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని స్పష్టం చేశాడు.

ఈ సందర్బంగా కమల్ హాసన్ జోక్యం చేసుకుని ఒకప్పుడు బాలచందర్ ఒకే ఏడాది నాలుగు సినిమాలు తీసిన విషయం.. దాసరి ఒకేసారి పలు చిత్రాల రైటింగ్‌లో పాలు పంచుకుని వరుసగా హిట్లు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.