టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం నట ప్రతిభ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్లో చాలా వరకు కామెడీ రోల్సే చేయడం వల్ల ఆయన్ని ఆ కోణంలోనే ప్రేక్షకులు చూశారు కానీ.. ‘బాబాయ్ హోటల్’ లాంటి చిత్రాలు చూస్తే ఆయన ఎమోషన్లను కూడా ఎంత గొప్పగా పండించగలరో అర్థమవుతుంది. ఇక నటనను దాటి బ్రహ్మిలో ఎంతో ప్రతిభ ఉంది. తెలుగు పండితుడైన బ్రహ్మికి భాష, సాహిత్యం మీద గొప్ప పట్టుంది. ఆయన మంచి రచయిత, వక్త కూడా.
అలాగే బ్రహ్మిలో చిత్రకళా ప్రతిభ కూడా తరచూ బయటపడుతుంటుంది. ఆయన వేసిన బొమ్మలు అబ్బురపరుస్తాయి. వీటన్నింటికీ తోడు బ్రహ్మితో మిమిక్రీ కళ కూడా ఉంది. తన పాత్రల కోసం అప్పుడప్పుడూ ఆయన దాన్ని బయటికి తీస్తుంటారు. వేదికల మీద కూడా కొందరు ప్రముఖులను అనుకరిస్తుంటారు. తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్‌ను ఆయన ఇమిటేట్ చేసిన తీరు హాట్ టాపిక్‌గా మారింది.
కమల్ హీరోగా శంకర్ రూపొందించిన ‘ఇండియన్-2’లో బ్రహ్మి చిన్న క్యామియో చేశారు. శంకర్ పట్టుబట్టి బ్రహ్మితో ఈ పాత్ర చేయించారట. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన బ్రహ్మి.. సినిమా గురించి ప్రసంగమేమీ చేయకుండా కేవలం కమల్‌ను అనుకరించి వేదిక నుంచి దిగిపోయారు. మిమిక్రీ కళాకారులు చాలామంది నటులను అనుకరిస్తారు కానీ.. కమల్ వాయిస్‌ను ఇమిటేట్ చేయడం అంత ఈజీ కాదు. పైగా ఇప్పుడు వయసు పెరిగాక కమల్ వాయిస్‌లో మార్పు వచ్చింది.
ఇప్పుడున్న మిమిక్రీ ఆర్టిస్టులు యాజిటీజ్ ఆయన వాయిస్‌ను దించడం కష్టమనే చెప్పాలి. కానీ బ్రహ్మి మాత్రం కమల్ ఇప్పుడు బొంగురు పోయిన గొంతుతో ఎలా మాట్లాడతారో.. అచ్చం అదే స్టయిల్లో వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చి ఔరా అనిపించారు. కమల్ సైతం ఎంతో ఆసక్తిగా బ్రహ్మి ప్రసంగాన్ని విన్నారు. తర్వాత తన ప్రసంగంలో తాను చెప్పాలిందంతా తన వాయిస్‌లో బ్రహ్మానందమే చెప్పేశారంటూ ఆయన కళను కొనియాడారు.