లోక నాయకుడు కమల్ హాసన్ రాజకీయాలు, ఇతర కారణాల వల్ల మధ్యలో కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ గ్యాప్ తర్వాత ఆయన రీఎంట్రీ ఇవ్వాలనుకున్నది ‘ఇండియన్-2’ చిత్రంతోనే. కానీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మొదలై, సగం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్న దశలో ఈ సినిమాకు ఊహించని విధంగా బ్రేక్ పడింది. లొకేషన్లో జరిగిన క్రేజ్ ప్రమాదంలో కొందరు ఫైటర్లు ప్రాణాలు వదిలారు. ఆ ప్రమాదం కోలీవుడ్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. దెబ్బకు సినిమా ఆగిపోయింది. రెండేళ్ల పాటు చిత్రీకరణ పున:ప్రారంభమే కాలేదు.
షూటింగ్‌లో భద్రత ప్రమాణాలను పాటించకపోవడంపై హీరో కమలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మీద ఫైర్ అయ్యారని వార్తలు వచ్చాయి. మీడియా ముందు కూడా నిర్మాతల పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కారు కమల్. ఆయన కోపం ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఇండియన్-2ను తిరిగి పట్టాలెక్కించడానికి ఆయన చాన్నాళ్ల పాటు అంగీకరించలేదు.
వందల కోట్ల పెట్టుబడి పెట్టి, వందల మంది కష్టం ముడిపడ్డ చిత్రమైనా.. శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ తీస్తున్న సినిమా అయినా కమల్ చాన్నాళ్ల పాటు కరగలేదు. మధ్యలో ‘విక్రమ్’ సినిమాను మొదలుపెట్టి పూర్తి చేశారు. చివరికి రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆయన దిగి వచ్చారు. ‘ఇండియన్-2’ను పట్టాలెక్కించారు. ఆ టైంలోనే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. రెండు చిత్రాలనూ కమల్ కష్టపడి పూర్తి చేశారు. కానీ సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్నా సరే.. కమల్‌కు నిర్మాతల మీద కోపం తగ్గినట్లు లేదు.
తాజాగా జరిగిన ‘ఇండియన్-2’ తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పావు గంట సుదీర్ఘ ప్రసంగం చేసిన కమల్.. మాట వరసకు కూడా లైకా ప్రొడక్షన్స్, దాని అధినేత సుభాస్కరన్ గురించి మాట్లాడలేదు. ‘ఇండియన్’ తీసిన ఎ.ఎం.రత్నం గురించి ప్రస్తావించి.. ఒక మేకప్‌మ్యాన్‌గా మొదలై అంత భారీ చిత్రం తీయడం గురించి ఎలివేషన్ ఇచ్చారే కానీ.. ఇప్పుడు వందల కోట్లు పెట్టి, కష్టనష్టాలకు ఓర్చి ‘ఇండియన్-2’ తీసిన లైకా గురించి మాత్రం మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. దీన్ని బట్టి క్రేన్ ప్రమాదం విషయంలో నిర్మాత మీద ఇంకా కమల్‌కు కోపం తగ్గినట్లు లేదనిపిస్తోంది.