వినాయక చవితికి రసవత్తరమైన పోటీ

టాలీవుడ్ బాక్సాఫీస్ పండగల సీజన్ గా చూసే వాటిలో మొదటి స్థానం సంక్రాంతిది కాగా ఆ తర్వాత దసరా నిలుస్తుంది. దీపావళిని కోలీవుడ్ తీసుకున్నంత సీరియస్ గా మనవాళ్ళు పరిగణించరు. కారణం తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఒక్క రోజుకే పరిమితం చేయడం వల్ల. ఇప్పుడు క్రమంగా వినాయక్ చవితి కూడా ఫేవరెట్ ఫెస్టివల్ లిస్టులోకి చేరిపోతోంది. ఈసారి మూడు కంటెంట్ ఉన్న సినిమాలతో పోటీ రసవత్తరంగా మారబోతోంది. వాటిలో మొదటిది విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ టైం ఫిక్షన్ డ్రామా మీద అన్ని భాషల్లోనూ విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఏపీ తెలంగాణ హక్కులను ఒక భారీ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందనే టాక్ ఉంది కానీ త్వరలోనే క్లారిటీ రానుంది. తుపాకీ నుంచి విజయ్ మార్కెట్ ఇక్కడ బాగా విస్తరించింది. ఇది సెప్టెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరుసటి రోజు నారా రోహిత్ సుందర కాండని తెస్తున్నారు. ఇమేజ్ పరంగా విజయ్ తో పోటీపడే స్థాయి కాకపోయినా టీజర్ లో చూపించిన విజువల్స్, అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి. మూడోది సెప్టెంబర్ 7న ప్లాన్ చేసుకుంటున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకుడిగా సితార సంస్థ పెద్ద బడ్జెట్ తో నిర్మించింది.

ఈ త్రికోణ పోటీ దాదాపు ఖరారైనట్టే. ఆగస్ట్ నెల డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, సరిపోదా శనివారం లాంటి క్రేజీ మూవీస్ తో నిండిపోవడంతో మిగిలినవాళ్లకు సెప్టెంబర్ మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. అది కూడా చివరి వారం దేవర వచ్చే లోపు మిగిలినవి పని కానిచ్చేయాలి. సో వాయిదా లేదా ఇంకాస్త ముందుకు రావడం జరగని పని. కల్కి 2898 ఏడి తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఏదీ లేక జూలై కాస్త చప్పగానే గడిచిపోనుంది. కలెక్షన్ల పరంగా కల్కి థియేటర్ల ఆకలిని బాగా తీర్చేసింది. ఈ ఆనందం తర్వాత కూడా కొనసాగాలంటే పెద్ద హీరోల సినిమాలు వస్తూనే ఉండాలి. ఇప్పుడొచ్చే గ్యాప్ తాత్కాలికమే.